గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 4: ఒకపక్క మావోయిస్టులు బస్సులను హైజాక్ చేశారంటూ ప్రచారం. మరోపక్క మండలంలో ఒకరిని అపహరించి హత్య చేశారంటూ తీవ్ర వదంతుల నేపధ్యంలో మొత్తం రహదారులన్నీ పోలీసులు దిగ్బంధించారు. ఉద్రిక్త్భరితమైన వాతావరణం మధ్య పోలీస్ అవుట్ పోస్టుల ఏర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ గిరిజనులు నినదించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా మన్యంలో అవుట్ పోస్టుల ఏర్పాటును నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు, గిరిజనులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. పెదవలసలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్ర ఉత్కంఠ మధ్య అవుట్ పోస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఇటీవల మావోయిస్టులను అదుపు చేసేందుకు మన్యంలో అవుట్ పోస్టులను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. పోలీసుల నిర్ణయాన్ని మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ మండలంలోని పలువురు సర్పంచ్‌లను మావోయిస్టులు అపహరించి వారిని అవుట్ పోస్టుల ఏర్పాటుపై ప్రతిఘటించాలని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా చాపగెడ్డ వద్ద రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆస్తులను ధ్వంసం చేశారు. అవుట్ పోస్టుల ఏర్పాటును నిరసిస్తూ గతనెల 30వతేదీన సి.పిఐ మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. అన్నిరకాలుగా అవుట్ పోస్టుల ఏర్పాటును ప్రతిఘటించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈనేపధ్యంలో పెదవలసలో అవుట్ పోస్టులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. ఒకపక్క మావోయిస్టుల వదంతులు, మరోపక్క రహదారుల దిగ్బంధం వెరసి రోజంతా పెదవలసలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఒకపక్క మావోయిస్టులు బస్సులను హైజాక్ చేశారంటూ ప్రచారం.
english title:
police outposts
Date:
Wednesday, February 5, 2014