నర్సీపట్నం, ఫిబ్రవరి 4: రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ రెవెన్యూ అధికారులు(విఆర్‌ఒలు) సమ్మెకు దిగుతున్నారు. రెవెన్యూ కాన్ ఫెడరేషన్ పిలుపు మేరకు 5వతేదీ అర్ధరాత్రి నుండి జిల్లావ్యాప్తంగా విఆర్‌ఓ.లు సమ్మె పాల్గొంటున్నట్లు వి.ఆర్.ఓ. సంఘం జిల్లా అధ్యక్షుడు సబ్బవరపు త్రినాథ రామకాసు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలో జిల్లాలోని విఆర్‌ఓ.లందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సంఘ ప్రతినిధులు నర్సీపట్నం డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నర్సీపట్నంలో వారు విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 60 రోజులపాటు వి.ఆర్.ఓ.లంతా సమ్మెలో పాల్గొన్నారన్నారు. సమ్మె కాలాన్ని ఎర్డ్న్ లీవ్‌గా పరిగణిస్తూ ముఖ్యమంత్రి జి. ఓ.నెంబర్ 33ను విడుదల చేశారన్నారు. ఈ జిఓ.తో సమ్మె కాలాన్ని డ్యూటీగా పరిగణిస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రామకాసు డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో విఆర్‌ఓల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాలి పేతూరు. ఉపాధ్యక్షుడు ఎస్.సింహాద్రప్పడు, సహాయ కార్యదర్శి సిహెచ్.అప్పారావు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు జి.సూర్యనారాయణ, పి.ఆర్. అప్పారావు పాల్గొన్నారు.
దుగ్గాడ కాలువ ఆధునీకరణలో
నిర్లక్ష్యంపై ఆగ్రహం
కోటవురట్ల, ఫిబ్రవరి 4: దుగ్గాడ కాలువ ఆధునీకరణలో రైతులకు అవసరమైన పనులను ఎందుకు చేపట్టలేకపోయారంటూ ప్రపంచబ్యాంకు ప్రతినిధి సమక్షంలో ఏటికొప్పాక సుగర్స్ డైరెక్టర్, బి.కె.పల్లి మాజీ సర్పంచ్ పెట్ల రాంబాబుతోపాటు రైతులు ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. దుగ్గాడ కాలువ ఆయకట్టుదారుల సదస్సు మంగళవారం మండలంలో జల్లూరు గ్రామంలో నిర్వహించారు. ఈసదస్సులో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో దుగ్గాడ కాలువ ఆధునీకరణ పనులు 1.91 కోట్ల రూపాయలతో చేపట్టారన్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధి సమావేశం ప్రారంభించగానే రాంబాబు, రైతులు లేచి అధికారులు, కాంట్రాక్టర్ తమ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నాలుగు లక్షలు, ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ 4.5 లక్షల రూపాయలు దీనికి విరాళాలు అందజేశారన్నారు. ఏటికొప్పాక సుగర్స్ చైర్మెన్ ఆర్.ఎస్.రామభద్రరాజు సలహాలు, సూచనలను అధికారులు పట్టించుకోలేదన్నారు. రైతులకు సమాధానం చెప్పలేకే రామభద్రరాజు హాజరు కాలేకపోయారన్నారు.
పనుల్లో నాణ్యత లోపించిందని రైతులు ఆరోపించారు. తలుపులు, రెగ్యులేటర్లు, గేట్లు,స్లూయిజ్‌లు మరమ్మతులు చేపట్టలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరిగేషన్ ఇ.ఇ.మల్లికార్జునరావు మాట్లాడుతూత నీలం తుపాన్ వలన కాలువకు పలుచోట్ల నష్టం జరగడంతో ఆధునీకరణకు విడుదలైన నిధుల్లో 40 లక్షల రూపాయలను తుఫాన్ మరమ్మతులకు మళ్ళించారన్నారు. దీనివలన కొన్ని పనులు చేపట్టలేకపోయామని డి.ఇ.వివరణ ఇచ్చారు. మిగిలి ఉన్న 40 లక్షల రూపాయలతో రైతులకు అవసరమైన పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధి శంకర్‌నారాయణ మాట్లాడుతూ సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చుకునేందుకు రైతులు ముందుకు వస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం నిధులతో పలు చోట్ల చెరువుల మరమ్మతులు చేయించి రైతులు సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చుకుంటున్నట్లు పరిశీలనలో వెల్లడైందన్నారు. ముందుగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధి, ఇరిగేషన్ అధికారులు కాలువ ఆధునీకరణ పనులను పరిశీలించారు. సాధన స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మండల దేశం పార్టీ అధ్యక్షుడు లాలం కాశీనాయుడు, కాంగ్రెస్ నాయకుడు ఆర్.ఎస్.సత్యనారాయణరాజు, పిఎ.సి.ఎస్. ఉపాధ్యక్షుడు లాలం కొండబాబు, ఆయకట్టుదారులు పెట్ల వెంకటరమణ పాల్గొన్నారు.