గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 4: మండలంలో అపారంగా ఉన్న ఖనిజ సంపదను తరలించడానికే ప్రభుత్వం అవుట్ పోస్టుల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు గొడ్డేటి దేముడు అన్నారు. మంగళవారం పెదవలసలో అవుట్ పోస్టుల నిర్మాణాన్ని నిరసిస్తూ ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మన్యంలో మారుమూల గ్రామాలకు రోడ్డు, వైద్యం, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుంటే, గిరిజనులు అడగని అవుట్ పోస్టుల ఏర్పాటు ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. అవుట్ పోస్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఐ.కె.పి ద్వారా 28 ఎకరాల భూమిని సేకరించిందని, ఇది వాస్తవం కాదా?అని ఆయన ప్రశ్నించారు. మన్యంలో అవుట్ పోస్టుల ఏర్పాటువలన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. వీటి నిర్మాణం వెంటనే నిలుపుదల చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అవుట్ పోస్టుల నిర్మాణంవలన గతంలో పెదవలసలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిని నిర్మిస్తే మళ్ళీ అవే సంఘటనలు పునరావృతమై గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. జి.కె.వీధి సర్పంచ్ నారాయణమ్మ మాట్లాడుతూ పోలీసులు అవుట్ పోస్టుల ఏర్పాటు విరమించుకోవాలన్నారు. ఇప్పటికే మండలంలో రెండు పోలీస్ స్టేషన్లు ఉన్నాయని, గిరిజనుల రక్షణకు అవి సరిపోతాయన్నారు. అంతకుముందు పెదవలసలో అఖిలపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు అవుట్ పోస్టులను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అవుట్ పోస్టులు వద్దని, మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యలు కల్పించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో గూడెం మండలంలోని ఎనిమిది మంది సర్పంచ్‌లు, మాజీ జెడ్పీటిసి మత్య్సరాజు బాలరాజు, కో-అపరేటివ్ అధ్యక్షుడు బాబూరావు, కాంగ్రెస్, టిడిపి, సి.పి.ఎం., సిపిఐ నాయకులు పాల్గొన్నారు.
* మాజీ ఎమ్మెల్యే దేముడు ఆరోపణ
english title:
demudu
Date:
Wednesday, February 5, 2014