అనకాపల్లి, ఫిబ్రవరి 4: సమైక్యాంధ్ర ఉద్యమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజకీయ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోకపోవడం సిఎం వ్యవహారం రుజువు చేస్తుందన్నారు. తెలంగాణ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టే తరుణంలో ఢిల్లీలో సోనియాగాంధీ నివశించే టెన్ జనపథ్ వద్ద నిరసన దీక్ష చేపట్టకుండా వేరే చోటికి వెళ్లి దీక్ష చేపట్టాలని అనుకోవడం ఆయన మిలాకత్ రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో సమైక్యరాష్ట్రం కోసం దీక్షచేస్తే అపహాస్యం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి అదే సమస్య పరిష్కారం కోసం ఢిల్లీలో సిఎం దీక్షకు ఎందుకు సిద్ధపడుతున్నారని ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో కుటుంబాల పాలన సాగుతోందని, వారి స్వార్ధ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడదీయడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు.
రాహూల్‌ను ప్రధానమంత్రిని చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను విడదీస్తే, తెరాస అధ్యక్షుడు కెసిఆర్ తన కుమారుడికి రాజ్యాధికారం కట్టబెట్టేందుకు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని ఆరోపించారు. ఈ రెండు కుటుంబాలు రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని విడదీస్తుంటే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వారికి తెరచాటుగా సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎంతో త్యాగంచేస్తే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజల మనోభావాలను కాపాడేందుకు అదే తరహాలో పోరాటాలు సాగిస్తున్నారన్నారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజ్యాధికారాన్ని కట్టబెడతారనే భయంతోనే రాష్ట్ర విచ్చిన్నానికి సోనియాగాంధీ సిద్ధపడ్డారని ఆరోపించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఎమ్మెల్యే గవిరెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పేదల కోసం మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోనున్నారన్నారు. పట్టణ టిడిపి అధ్యక్షుడు బుద్ధ నాగజగదీష్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరావు, కోర్‌కమిటీ సభ్యులు మళ్ల సురేంద్ర, మాజీ ఎంపిపిలు రొంగలి శ్రీరామ్మూర్తి, నిమ్మదల త్రినాథరావు, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు అక్కిరెడ్డి రమణబాబు పాల్గొన్నారు.
విభజనతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్ఛితి!
పాయకరావుపేట, ఫిబ్రవరి 4: రాష్ట్ర విభజనతో రాజకీయ అనిశ్ఛితి ఏర్పడిందని సి.పి.ఐ జిల్లా కార్యదర్శి జె.వి. సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇతర దేశాలలో నిషేధించిన, కాలం చెల్లిన పరిశ్రమలను తీసుకొచ్చి నూతన సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తున్నట్లు పి.సి.పి.ఐ.ఆర్. పేరుతో సముద్ర తీరం వెంబడి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. సమైక్యాంధ్ర ముసుగులో పి.సి.పి.ఐ.ఆర్.పై ప్రజా అభ్యంతరాలను తూతూమంత్రంగా ముగించి వేశారని తెలిపారు. గడచిన రెండేళ్లలో జిల్లాలో ఉన్న పలు పరిశ్రమల్లో ప్రమాదాలు సంభవించి ఉద్యోగులు మృతి సంఘటనలు జరిగాయన్నారు. ఇటువంటి పరిశ్రమల్లో భద్రతా చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయన్నారు. పరిశ్రమల్లో భద్రత కరువైందని ప్రభుత్వ సంస్థల విచారణల్లో తేలిందని తెలిపారు. ఇవి చాలదన్నట్లు పి.సి.పి.ఐ.ఆర్. పేరుతో రసాయన పరిశ్రమలు పెడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో జిల్లా కాలుష్యానికి కేంద్రంగా మారనుందని తెలిపారు.
విశాఖలో కాలుష్యం కారణంగా కొత్తగా ఊపిరితిత్తుల జబ్బులు వస్తున్నాయని ఆయన తెలిపారు. మానవ మనుగడకు నాశనం కలిగించే పరిశ్రమలు ఏర్పాటు చేయవద్దని సి.పి.ఐ. తరుపున డిమాండ్ చేశారు. మారుతున్న రాజకీయాల కారణంగా ప్రజాప్రతినిధులు పార్టీలు మారినా అభ్యర్థుల ముఖాలు మారడం లేదన్నారు. రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలపై అధికారులు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. వీటిపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎటువంటి స్పందన ఉండటం లేదన్నారు. సంస్థలు మూసివేస్తే వాటి ప్రారంభోత్సవాలకు వచ్చిన సెలబ్రటీలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సి.పిఐ నాయకులు రావు వెంకట జగ్గారావు, బందుల సుబ్బలక్ష్మి, వెలుగుల అర్జునరావు, జి.తాతారావు, ఇసరపు రమణమ్మ పాల్గొన్నారు.