నిజామాబాద్, ఫిబ్రవరి 5: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, టిడిపి అవలంభిస్తున్న అసంబద్ధ వైఖరి వల్లే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఒకవైపు తెలంగాణకు అనుకూలం అంటూనే, మరోవైపు సిఎంతో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని, ఈ ద్వంద్వ వైఖరిపై యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోర్తాడ్‌లో బుధవారం రాత్రి నిర్వహించిన బిజెపి బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్, టిడిపిల తీరును దుయ్యబట్టారు. తెలంగాణ విషయంలో బిజెపి ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని, పార్లమెంటులో టి.బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ, ఓటు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేసి పదవిని చేపట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా సిఎం కిరణ్ అధిష్ఠానాన్ని ధిక్కరించడం లేదంటూ దిగ్విజయ్‌సింగ్ పేర్కొనడాన్ని బట్టి చూస్తే, ఆయనతో కాంగ్రెస్ హైకమాండే ఈ తరహాలో వ్యవహరించేలా చేస్తోందని స్పష్టమవుతోందన్నారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఇలాంటి చర్యలకు పాల్పడడం శోచనీయమని, సిఎం పదవికి రాజీనామా చేసిన తరువాత ఢిల్లీలో ఒకవేళ ఉరి వేసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం నిర్ణయాన్ని సొంత పార్టీకి చెందిన నేతలే ధిక్కరిస్తున్నప్పటికీ, వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టకపోవడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణకు అనుకూలమంటూనే సమైక్యవాదాన్ని బలపరుస్తోందని విమర్శించారు. చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఎంతమంది నాయకులను కలిసి విన్నవించినా, తెలంగాణ విషయంలో బిజెపి వెనక్కి తగ్గే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టడం మానుకుని కాంగ్రెస్, టిడిపిలు తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని అవలంభించాలన్నారు. చిన్న రాష్ట్రాలతోనే త్వరితగతిన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని బిజెపి గట్టిగా విశ్వసిస్తోందని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇది ఆచరణలో నిరూపితమైందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. తెలుగు భాష మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినంత మాత్రాన ప్రళయమేమీ రాదని, రాష్ట్ర విభజన వల్ల ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగేందుకు ఇరు ప్రాంతాలకు ఆస్కారం ఉంటుందన్నారు. దేశ ప్రజలు పాలనలో మార్పును కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బిజెపి ప్రభంజనంలో అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యుపిఎ పాలనలో ధరలో ఆకాశాన్నంటాయని, వాటిని అదుపుచేసే సామర్థ్యం బిజెపికి మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వంలో కొనసాగుతున్న నేతలకు వ్యవసాయంపై అవగాహన లేనందువల్లే రైతులకు న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. ‘గరీబోకే సాథ్ కాంగ్రెస్‌కా హాత్’ నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అనంతరం ‘భ్రష్టాచార్ కే సాథ్ కాంగ్రెస్‌కా హాత్’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
ద్వంద్వ వైఖరిపై సోనియా సమాధానం చెప్పాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి టి.బిల్లుకు మద్దతుపై వెనక్కి తగ్గబోమని పునరుద్ఘాటన
english title:
c
Date:
Thursday, February 6, 2014