సిద్దిపేట, ఫిబ్రవరి 5: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, మహిళా మంత్రులని చూడకుండా నెట్టివేసి లాఠీచార్జి చేయించడం సీమాంధ్ర అహంకారానికి నిదర్శనమన టిఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్‌రావు అన్నారు. తన కేబినెట్ మంత్రులనే నెట్టివేసిన సిఎంకు కలిసి ఉండాలనే హక్కులేదని సిఎం వైఖరిని తీవ్రస్థాయిలో ఖండించారు. సిఎంకిరణ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిఎం వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన, ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో బుధవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో సిఎం కిరణ్ మాటలు, చేష్టలు చూస్తుంటే సిఎం పదవి గౌరవం, హుందాతనాన్ని మంటగలిపాడన్నారు. విలువలను మరచిన కిరణ్ తాను హైద్రాబాదీనని చెప్పుకొని తెలంగాణ ప్రజల గౌరవాన్ని, హైద్రాబాద్ పేరును చెడగొడుతున్నాడని విమర్శించారు. తాను సీమాంధ్రకు చెందినవాడినని, పీలేరువాసినని చెప్పుకొని సిఎం ఏనైనా చేయవచ్చని, హైద్రాబాదీనని చెప్పి బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయవద్దని సూచించారు. ప్రభుత్వం టి.బిల్లును తిరస్కరించినట్లు చెప్పే యత్నం చేస్తున్నాడని.. డిప్యూటీ సిఎం, తెలంగాణ మంత్రులు, సీమాంధ్రకు చెందిన కొందరు మంత్రులు తెలంగాణకు మద్దతు పలికిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలు చెప్పకుండా ఢిల్లీలో దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నాడని దుయ్యబట్టారు.
తెలంగాణ బిల్లుపై చంద్రబాబు వైఖరేంటి
అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్‌లో ఏలా ప్రవేశపెడుతారంటున్న టిడిపి అధినేత చంద్రబాబుబిల్లును అసెంబ్లీ తిరస్కరించిందా? సీమాంధ్ర నేతలు తిరస్కరించారా స్పష్టం చేయాలన్నారు. అసెంబ్లీ బిల్లును టి.టిడిపి ఎమ్మెల్యేలు అనుకూలంగా వ్యవహరించలేదా చెప్పాలన్నారు. బిల్లుపై ముందు మీ వైఖరి స్పష్టం చేయాలని సూటిగా ప్రశ్నించారు. 119మంది తెలంగాణ ఎమ్మెల్యేలు బిల్లుకు అనుకూలంగా ఉన్నా మందబలంతో సీమాంధ్ర నేతలు బిల్లు తిరస్కరణకు గురైందని ప్రచారం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ ప్రజలు పోరాడిందే సీమాంధ్ర పెత్తనం మీదని, తెలంగాణ రాష్ట్రం కోసం సీమాంధ్ర ఆమోదం కావాలని చంద్రబాబు మాట్లాడడం శోచనీయమన్నారు. దోపిడీ నుంచి విముక్తి కోసం దోపిడీదారులను అనుమతి తీసుకోవాలనే చందంగా బాబు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. టి.టిడిపి నేతలు ఢిల్లీలో అనాధలుగా మిగిలారన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోతున్నాడని, సీమాంధ్ర నేతలను వెంట తీసుకొని పోతున్నాడని కానీ తెలంగాణ ఎమ్మెల్యేలను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ బిల్లు పెడితే తానే మొదటి ఓటు వేస్తానని ఎంపి నామా నాగేశ్వర్‌రావు మాట్లాడడం శోచనీయంగా ఉందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఫ్రకటనను మొదట అడ్డుకున్నదే చంద్రబాబు అని, జిఓఎం సమావేశం జరిగాక మొదట అడ్డుకున్నదే టిడిపి నేతలు అన్నారు. సీమాంధ్ర టిడిపి నేతల వైఖరిపై మాట్లాడకుండా తాను మొదటి ఓటు వేస్తానని మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర విభజన కుట్ర అంటున్నాడని, అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కుట్రగా అభివర్ణించిన బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు మాటలపై టి.టిడిపి నేతలు స్పందించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్ పాల్గొన్నారు.
సిఎం వైఖరికి నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు
english title:
cm
Date:
Thursday, February 6, 2014