
చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 6: సకాలంలో నీటి బిల్లులు జారీ చేయడంతో పాటు నీటి బకాయిదారులకు రెడ్ నోటీసులు అందజేసి అవసరమైతే కనెక్షన్‌లను తొలగించాలని జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.జగన్‌మోహన్ అదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన మెయింటనెన్స్ విభాగానికి చెందిన అన్ని డివిజన్లకు చెందిన అధికారులతో జలమండలి రెవెన్యూ ఆధికారులతో ఇడి సమీక్షా సమావేశం నిర్వహించి, డివిజన్ల వారీగా రెవెన్యూ వసూళ్లపై అడిగి తెలుసుకున్నారు. వినియోగదారులు సకాలంలో నీటి బిల్లులు చెల్లించి బోర్డు పరంగా మరిన్ని సేవలు పొందాలని ఆయన సూచించారు. డివిజన్‌ల వారీగా వారానికోసారి సంబంధిత జనరల్ మేనేజర్ స్థాయి అధికారి మీటర్ రీడర్‌లను మొదలుకోని సెక్షన్, సబ్ డివిజన్‌ల అధికారులతో రెవెన్యూపై సమావేశాలు నిర్వహించాలని ఆయన అదేశించారు. సెక్షన్ల వారీగా రెవెన్యూ టార్గెట్‌లను తయారు చేసుకుని, నీటి బిల్లుల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించి ప్రతి నెల జలమండలి సిపిడిసిఎల్‌కు రూ.50 కోట్లకు పైగా విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లిస్తుందని, ఈ విషయాన్ని ప్రతి వినియోగదారుడు తెలుసుకునేలా ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగి, అధికారిపై ఉందన్నారు. నీటి బిల్లుల జారీ, సకాలంలో మీటర్ల పరిశీలన, క్యాటగిరీ మార్పు, మొండి బకాయిదారులకు రెడ్ నోటీసుల జారీ తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. గతంలో డొమెస్టిక్ కనెక్షన్ కల్గిన వినియోగదారులు, అదే స్థానంలో బహుళ అంతస్తులను నిర్మించుకుని అదే క్యాటగిరిలో నీటిని వాడుతూ బోర్డును మోసం చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి తగిన సమాచారాన్ని ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ డైరెక్టర్, సిజిఎం, టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులకు అందజేయాలని ఇడి అధికారులను అదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ విభాగం డైరెక్టర్ డా.పి.సత్యసూర్యానారాయణ, సిజిఎం క్రిష్ణలతో పాటు వివిధ సర్కిళ్ల సిజిఎం, డివిజన్‌ల జిఎం, డిజిఎం తదితరులు పాల్గొన్నారు.
పట్టి పీడిస్తున్న సిబ్బంది కొరత
జలమండలిలో నెలకొన్న సిబ్బంది కొరత కారణంగా ఆశించిన రీతిలో రెవెన్యూ వసూళ్లలో ప్రగతిని సాధించలేక పోతున్నామని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. సెక్షన్‌ల కార్యాలయాల్లో సిబ్బంది కొరత అధికంగా ఉన్న కారణంగా ప్రతి పనిని సంబంధిత మేనేజర్ చేసుకోవాల్సి వుండటంతో వారికి పని భారం పెరిగింది. మొండి బకాయిలకు సంబంధించి రెడ్ నోటీసులు జారీ చేసిన తరువాత కనెక్షన్ తొలగించేందుకు వెళ్లినపుడు తగిన పోలీసు ఫోర్స్ లేని కారణంగా వినియోగదారుల నుండి గట్టి ప్రతిఘటనలు ఎదురవుతున్నాయని ఆధికారులు పేర్కొంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో మొండి బకాయిదారులకు సంబంధించి నీటి కనెక్షన్‌ను తొలగించేందుకు వెళ్లినప్పుడు వినియోగదారులు సిబ్బంది, అధికారులపై దాడులు సైతం చేసారని వారు గుర్తుచేసారు. నీటి బకాయిలున్న వారికి నోటీసులు జారీ చేసిన తరువాత కనెక్షన్లను తొలగించడానికి గాను బోర్డు అధికారులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు బోర్డు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.