వికారాబాద్, ఫిబ్రవరి 6: రథసప్తమి సందర్భంగా అనంతగిరి శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంలో గురువారం శ్రీస్వామివారి సప్తవాహన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 7.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్వామి వారిని సూర్యప్రభ, హనుమంత, శేష, గరుడ, గజ, సింహ, చంద్రవాహనాలపై ఊరేగించి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జి.శేఖర్‌గౌడ్, వ్యవస్థాపకులు నాళాపురం సీతారామచార్యులు పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన సప్తవాహన మహోత్సవంలో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు ఆర్.నర్సింలు, సూర్యనారాయణ, విరూపాక్షి ఉన్నారు.
బుగ్గలో రథసప్తమి వేడుకలు
శ్రీబుగ్గ రామలింగేశ్వర క్షేత్రంలో వెలసిన సూర్యదేవాలయంలో గురువారం రథసప్తమి వార్షికోత్సవ మహోత్సవం భక్తుల సందడితో అంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ అర్చకులు ఎం.శివశంకరస్వామి, శ్రీకాంత్‌స్వామి అన్నారు. కార్యక్రమంలో భక్తులు పద్మపాండు, మాణయ్య, మాణిక్యం, వీరకాంతస్వామి, ప్యాటమల్లేశం, సత్యంగుప్త, రాములు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంత వైద్య సిబ్బంది పనితీరు భేష్
వికారాబాద్, ఫిబ్రవరి 6: గ్రామీణ ప్రాంత వైద్య, ఆరోగ్య సిబ్బంది పనితీరు చాలా బాగుందని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి నిర్మల్‌కుమార్ అన్నారు. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఎఎన్‌ఎం, సూపర్‌వైజర్, సిహెచ్‌వోల కోసం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పట్టణ ప్రాంత వైద్య, ఆరోగ్య ఉద్యోగులతో గ్రామీణ ప్రాంత ఉద్యోగులను పోలిస్తే గ్రామీణ ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేశారన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లలో జిల్లా ప్రస్తుతం 10వ స్థానంలో ఉందని, మార్చి 31వ తేదీలోపు లక్ష్యాలను సిబ్బంది పూర్తి చేయాలని సూచించారు.
ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎఎన్‌ఎంలతో జరిగే ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్రంలో కేవలం రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల ఎఎన్‌ఎం ఎడ్ల పుష్పలత, శంకర్‌పల్లి ఎఎన్‌ఎం పద్మమ్మలు ఎంపికయ్యారని తెలిపారు. సమావేశంలో జిల్లా స్టాటిస్టికల్ అధికారి కృష్ణ, ఫ్యామిలీ డిప్యూటి స్టాటిస్టికల్ ఆఫీసర్ జంగయ్య, వైద్యాధికారులు యాకేందర్‌రెడ్డి, గౌస్, నసీఫ్‌జాన్, ఎఎస్‌వో సాంబూరి రవీందర్, మన్సూర్ పాల్గొన్నారు.