విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ప్రధాన పనులు పూర్తి చేసే విషయంలో అధికారులు లక్ష్యాలను నిర్థారించుకుని పనిచేయాలని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల ఉన్నతాధికార్లతో తన ఛాంబర్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిషృత సమస్యలపై ప్రతినెలా మూడో మంగళవారంలో హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. సమీక్షకు అవసరమైన నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని, దీనికి సంబంధించి పనుల ప్రగతిపై నిర్ణీత ఫార్మాట్‌లో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రతి రెండో శనివారం తాను ముఖ్యమైన పనుల ప్రగతిపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అధికారులు వారాంతపు లక్ష్యాలను పెట్టుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్షిస్తూ కేసులు సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిటిజన్ చార్టర్ కింద నమోదైన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారుల నుంచి వసూలు చేసే అపరాధ రుసుం వివరాలను ఎప్పటికప్పుడు నివేదికలో పొందు పరచాలన్నారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద గృహాల నిర్మాణం, పూర్తి, కేటాయింపు వంటి అంశాలను అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. జివిఎంసి పరిధలో ఘనవ్యర్థాల నిర్వాహణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాన్ని సమీక్షించారు. పన్నుల వసూళ్లలో సాధిస్తున్న ప్రగతిని సమీక్షిస్తూ, అస్తిపన్ను బకాయిల వసూళ్లలో యంత్రాంగం లక్ష్యాలను సాధించాలని సూచించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు వార్డుల వారీగా తీసుకునే ప్రగతిని పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. వీధి వ్యాపారుల సంక్షేమానికి సంబంధించి ఏర్పాటు చేయనున్న వెండర్ కమిటీల వివరాలను నివేదికలో పొందుపరచాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు కె.రమేష్, పూర్ణచంద్రరావు, జోనల్ కమిషనర్లు శివాజీ, శ్రీనివాసరావు, సన్యాసినాయుడు, రామ్మోహనరావు, సిఎంఓ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన పనులు పూర్తి చేసే విషయంలో అధికారులు లక్ష్యాలను నిర్థారించుకుని
english title:
targets
Date:
Saturday, February 8, 2014