న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో మరో కొత్త అంశం వెలుగు చూసింది. హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన బిడ్డర్లను ఖరారు చేస్తున్న సమయంలో అంటే 2007లో అప్పటి భారత వైమానిక దళ ప్రధానాధికారి ఎఫ్ హెచ్ మేజర్‌కు అగస్టా వెస్ట్‌లాండ్ మాతృసంస్థ అయిన ఫిన్ మెకానికా సంస్థ విందు ఇచ్చిందని అగస్టా వెస్ట్‌లాండ్‌కు చెందిన లాయర్లు ఇటలీ కోర్టుకు తెలియజేసినట్లు మీడియా వార్తలు పేర్కొన్నాయి. అంతేకాకుండా భారత్‌లో ఈ హెలికాప్టర్ల కుంభకోణంలో సిబిఐ ఎఫ్‌ఐర్‌లో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న మరో మాజీ ఐఏఎఫ్ చీఫ్ ఎస్‌పి త్యాగికి, ఇటలీ అధికారులకు మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని కూడా ఆ సంస్థ లాయర్లు బస్టో అర్సిజియో కోర్టుకు తెలియజేసారు. త్యాగి తమ దేశంలో పర్యటించినప్పుడు తాను ఆయనకు విందు ఇచ్చినట్లు ఈ నెల 4న జరిగిన విచారణ సందర్భంగా అగస్టా వెస్ట్‌లాండ్ సంస్థ మాజీ అధికారి జేమ్స్ సపోరిటో చెప్పడం గమనార్హం. అయితే తాను కంపెనీలో పని చేస్తున్న సమయంలో ఎవరికి విందు ఇచ్చాననే విషయంలో సపోరిటో గందరగోళానికి గురయి ఉండవచ్చని కంపెనీ లాయర్లు కోర్టుకు చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సంస్థ ఇచ్చిన విందులో కంపెనీ అధికారులతో కలిసి మేజర్ దిగిన ఫోటోలను కూడా వారు న్యాయస్థానానికి చూపించినట్లు పత్రికా వార్తలు వెల్లడించాయి.
కాగా, ఈ వార్తలపై మేజర్ స్పందిస్తూ, 2007లో తాను ఇటలీలో అధికారికంగా పర్యటించినప్పుడు ఫిన్ మెకానికా సంస్థను సందర్శించానని, కంపెనీ తనకు విందు ఇచ్చిందని చెప్పారు. అయితే తన పర్యటన ప్రభుత్వం ఆమోదించిందని, పర్యటన కార్యక్రమాలు కూడా సంబంధిత అధికారులు, ఇటలీలోని భారత దౌత్యకార్యాలయం రూపొందించినవేనని కూడా ఆయన చెప్పారు. ఈ విందు వ్యక్తిగతంగా తనకోసం ఇచ్చింది కాదని, ఆ దేశాన్ని సందర్శిస్తున్న ప్రతినిధుల బృందానికి ఇచ్చిందని మేజర్ ఒక టీవీ చానల్‌కు చెప్పారు. అయితే మేజర్ వైమానిక దళ ప్రధానాధికారిగా 2007 ప్రారంభంలో త్యాగినుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాతే హెలికాప్టర్ల ట్రయల్స్ జరగడం గమనార్హం. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ట్రయల్స్ భారత్‌లో కాక విదేశాల్లో జరిగాయని ఈ ఒప్పందంపై ఆడిట్ జరిపిన కాగ్ తన నివేదికలో పేర్కొంటూ, దీన్ని మేజర్ సమర్థించుకోవడాన్ని ప్రశ్నించడం తెలిసిందే. అంతేకాదు, ట్రయల్స్ జరిపే సమయానికి సైతం అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయని కూడా కాగ్ తన నివేదికలో పేర్కొంది.
మాజీ ఐఏఎఫ్ చీఫ్ మేజర్‌కు ఫిన్ మెకానికా విందు ఇటలీ కోర్టుకు తెలిపిన కంపెనీ లాయర్లు ఫిన్ మెకానికా విందు నిజమే: మేజర్
english title:
v
Date:
Saturday, February 8, 2014