విశాఖపట్నం, ఫిబ్రవరి 7: ఈ నెల 12నుండి ఏప్రిల్ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సంబంధితాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇంటర్మీడియట్ బోర్డు మెంబర్లు, విద్య, రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, పోస్టల్, వైద్యశాఖల అధికారులతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులకు నిర్ణయించిన సమయాల్లో ఆర్టీసీ బస్సులను నడపాలన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరే విధంగా నడపాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా సంబంధిత అధికారిని ఆదేశించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్యశాఖకు సంబంధించి ఒక ఎఎన్‌యంను అత్యవసర ఔషధాలను, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. మంచినీటికి అసౌకర్యం కలుగకుండా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద మంచినీటి సరఫరా చేయాల్సిందిగా జివిఎంసి, పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన పోలీసు బందోబస్త్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా నగర,గ్రామీణ, పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మన్యంలోని సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను పగడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షల అనంతరం సీల్ చేసిన పరీక్షా మెటీరియల్‌ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత తపాలశాఖ వారిదని, వారు పోలీసు బందోబస్త్ సహకారంతో జాగ్రత్తగా చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, కన్వీనర్ ఎల్‌జె జయశ్రీ మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ నుండి వచ్చేనెల నాలుగో తేదీవరకు ప్రాక్టికల్ పరీక్షలు 164 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. అర్బన్ ఏరియాలో 5 జోన్‌లు రూరల్ ఏరియాలో 29 జోన్‌ల్లో జరుగనున్నట్టు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు థియిరీ (రాత పరీక్షలు) 56 పట్టణ, 55 గ్రామీణ, మొత్తం 111 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. 34 పరీక్షాపత్రాల స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 20 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించామని, ప్రాక్టికల్ పరీక్షలకు 21,773 మంది, వృత్తి విద్య పరీక్షలకు 10 వేల మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. రాత పరీక్షలకు మొదటి సంవత్సరం పరీక్షలకు 50 వేల మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 52 వేల మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. విద్యాశాఖ, రెవెన్యూశాఖలకు సంబంధించిన సిబ్బంది స్క్వాడ్‌లుగా పర్యవేక్షణ చేస్తారన్నారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ బోర్డు డిఇసి, మెంబర్ల కమిటి, డిప్యూటీ డిఇఓ రేణుక, అర్బన్, రూరల్ పోలీసు శాఖాధికారులు, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, పోస్టల్ వైద్యశాఖల అధికారులు పాల్గొన్నారు.
* జెసి ప్రవీణ్‌కుమార్
english title:
intermediate exams
Date:
Saturday, February 8, 2014