విశాఖపట్నం, ఫిబ్రవరి 7: వరుసగా మూడోసారి రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఎన్నికయ్యారు. దీంతో శనివారం ముఖ్యమంత్రి, తనను ఎన్నుకున్న శాసనసభ్యులతో హైదరాబాద్‌లో సమావేశం ఉందని ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దీనివలనే తాను విశాఖకు రాలేకపోతున్నానని పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల్లో ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళి త్వరలో విశాఖ నగరానికి చేరుకుని ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కలుసుకోగలనని తెలిపారు. తనను రాజ్యసభకు అధిక మెజారిటితో గెలిపించిన శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మూడోసారి రాజ్యసభకు నామినేట్ చేసిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి, యుపిఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తాను రుణపడి ఉంటానన్నారు. విశాఖ ప్రజలు ఎల్లపుడూ నా గుండె నిండా ఉంటారని, విశాఖ ప్రజల ప్రేమను, అప్యాయతను, ఆదరణను తాను ఎన్నటికీ మరువలేనన్నారు. ఇంతవరకు తాను విశాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, ముఖ్యంగా వైద్య శిబిరాలు నేత్ర వైద్య శిబిరాలు ఇక మీదట కూడా నిరంతరం కొనసాగుతాయనిచ్చారు.
బంగ్లాలో సంబరాలు
రాజ్యసభ సభ్యునిగా వరుసగా మూడోసారి డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ఎంపికైన నేపథ్యంలో విశాఖలో టిఎస్సార్ బంగ్లాలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, టిఎస్సార్ క్యాంపు కార్యాలయ సిబ్బంది సంబరాలు జరుపుకొన్నారు. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టిఎస్సార్ ఎన్నికైనట్టు ఖరారు కావడంతో ఆయన అభిమానులు ఆనందోత్సహాలతో స్వీట్లు పంచుకున్నారు. టిఎస్సార్ బంగ్లా ముందు బాణాసంచా కాల్చి కేరింతలు కొట్టారు. టిఎస్సార్ సేవాపీఠం ప్రధాన సమన్వయకర్త డి.వరదారెడ్డి, టిఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో సంబరాల్లో పాలుపంచుకున్నారు.
వరుసగా మూడోసారి రాజ్యసభ సభ్యునిగా డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి
english title:
tsr
Date:
Saturday, February 8, 2014