పటమట, ఫిబ్రవరి 8: దక్షణ భారతదేశం రెండవ అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన గుణదలమాత (మరియమాత) మహోత్సవాలకు సర్వసిద్ధం అయ్యింది. ఆదివారం ఉదయం 7 గంటలకు బిషప్ గ్రాసి హైస్కూల్ ప్రాంగణంలో విజయవాడ కతోలిక పీఠం అపోస్థోలిక పాలనాధికారి, బిషప్ గోవిందు జోజి, మోన్‌సిజ్ఞోర్, పుణ్యక్షేత్రం రెక్టర్ మెరుగుమాల చిన్నప్ప మరియమాత పతాకాన్ని ఆవిష్కరించి లాఛనంగా ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం బిషప్ గ్రాసిలో ప్రత్యేకంగా అలంకిరించిన పూజపీఠంపై విజయవాడ కతోలిక పీఠం జూబిలేరియన్ గురువులు ఫాదర్ గుడా మెలిక్కియోర్‌రాజు, తదితర గురువుల సమిష్టి దివ్యపూజబలితో ఉత్సవాలు మొదలవుతాయి . శనివారం సాయంత్రం నుండే వివిధ ప్రాంతాల నుండి భక్తులు గుణదల పుణ్యక్షేత్రానికి చేరుకొని బస చేస్తున్నారు. బిషప్ గ్రాసి హైస్కూల్ ప్రాంగణంలో వేలాది మంది భక్తులు మూడు రోజులు ఉత్సవాల పూజలను తిలకించే విధంగా విశాలమైన క్లాత్ షామియాలను ఏర్పాటు చేశారు.
కొండ మధ్యలో మేరిమాతను, కొండ శిఖరాన ఏసుక్రీస్తు శిలువను భక్తులు ప్రశాతంగా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయాల్లో కూడా భక్తులు కొండపై మరియమాతను దర్శించుకోనే విధంగా కొండ మెట్ల మార్గాలను విద్యుత్ లైట్లతో అలకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగ కుండా పుణ్యక్షేత్రం రెక్టర్ ఎం.చిన్నప్ప, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ అధ్వర్యంలో ఉత్సవ కమిటీలు పనిచేస్తున్నాయి.
అక్రమ సంపాదన కోసమే నకిలీ కరెన్సీ తయారీ : ఎసిపి
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 8: అక్రమమార్గంలో డబ్బు సంపాదించేందుకే నిందితులు నకిలీ కరెన్సీ తయారీకి పూనుకున్నట్లు సెంట్రల్ ఏసిపి డివి నాగేశ్వరరావు తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు వారి నుంచి 7.33 లక్షల నకిలీ కరెన్సీ, కలర్ ప్రింటర్ కమ్ స్కానర్, పేపర్ కట్టలు, స్టాంపులు, నేరానికి ఉపయోగించిన ఆటో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణలంక పోలీస్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సెంట్రల్ ఏసిపి డివి నాగేశ్వరరావు ఈమేరకు వివరాలు వెల్లడించారు. గుంటూరు తారకరామానగర్‌కు చెందిన పబ్బాటి మురళి (32), ప్రకాశం జిల్లా కనిగిరి స్వగ్రామం కాగా ప్రస్తుతం తెనాలి నందులపేటకు చెందిన మాలినేని సాంబయ్య (34), తెనాలి కొత్తపేటకు చెందిన ఆటోడ్రైవర్ మాదాల వెంకట్రావు (38)లను టాస్క్ఫోర్స్ సాయంతో అరెస్టు చేశారు. గుంటూరులో కొంతకాలం అల్యూమినియం వ్యాపారం చేసిన మురళీ తెనాలిలో ఐస్‌బండి వ్యాపారం చేసే సాంబయ్యలు ఆటోడ్రైవర్ వెంకట్రావుతో కలిసి అసలు నోట్లను కలర్ స్కానింగ్ ద్వారా ప్రింట్‌లు తీసిన నకిలీ నోట్లను చలామణి చేసేందుకు యత్నిస్తూ దొరికిపోయారు. సాంబయ్యపై తెనాలి 3టౌన్‌లో గతంలో దొంగనోట్ల కేసు కూడా ఉన్నట్లు ఏసిపి తెలిపారు. విలేఖరుల సమావేశంలో కృష్ణలంక సిఐ అహ్మద్ అలీ సిబ్బంది పాల్గొన్నారు.