బెంజిసర్కిల్, ఫిబ్రవరి 8: గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం ఉన్న ప్రత్యేకాధికారి పాలనలో పన్నుల భారం నగర ప్రజలపై మోపుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు విమర్శించారు. సిపిఎం సెంట్రల్ జోన్ 2 ఆధ్వర్యంలో 43వ డివిజన్‌లో శనివారం స్థానిక టివిఆర్ స్కూల్ వద్ద పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన నగర ప్రజల నుండి పలు వినతులను సమస్యలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అడ్డగోలుగా పెంచిన మంచినీటి, భూగర్భ డ్రైయినేజీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాల్సిన ప్రభుత్వం, దానిని పక్కన పెట్టి ప్రత్యేకాధికారి పాలనలో పన్నుల భారాన్ని మోపుతుందన్నారు. ప్రజాసమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం, పాలకులు ప్రజల పడుతున్న కష్ట, నష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం ఆయన ఇంటి పన్ను నోటీసులను దగ్ధం చేసారు. పాదయాత్రలో ఆయనతో పాటు సిహెచ్ జోగిరాజు, ఆర్ కోటేశ్వరరావు, పి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
అనివార్య పరిస్థితుల్లోనే నిరవధిక సమ్మె
బెంజిసర్కిల్, ఫిబ్రవరి 8: గతంలో పలు దఫాలుగా జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలం చెందిందని దీని కారణంగానే నిరవధిక సమ్మెకు నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసి తెలిపింది. మూడు నెలలు క్రితం సమ్మె నోటీసు ఇచ్చామని, ప్రభుత్వం నుండి కనీస స్పందన రాని కారణంగా ఈ నెల 8నుండి నిరవధి సమ్మెకు వెళుతున్నట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఐడియుసి, బిఎంఎస్, సిఐటియు, హెచ్‌యంఎస్, ఐఎఫ్‌టియు, టిఎన్‌టియుసి, టిఆర్‌ఎస్‌కెవి సంఘాలతో కూడిన జెఎసి ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు భారత కార్మిక సంఘాల సమాఖ్య కార్యదర్శి పి ప్రసాదరావు చెప్పారు.
మాంటిస్సోరిలో ఎడ్యుకేషనల్ ఎండోమెంట్ ఫండ్ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 8: మాంటిస్సోరి మహిళా కళాశాలలో యాజమాన్యం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న డాక్టర్ వి కోటేశ్వరమ్మ, ప్రొ. వివి కృష్ణారావు ఎడ్యుకేషనల్ ఎండోమెంట్ ఫండ్‌ను శనివారం రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సుజనాచౌదరి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన కళాశాల డైరెక్టర్ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ నిరుపేదలు పరీక్షల్లో 70శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని మంచి నడవడిక, 80శాతం హాజరుకలిగిన వారి నుంచి ఏటా 30మందిని ఎంపిక చేసి ఈ పథకం ద్వారా స్కాలర్‌షిప్‌లు అందచేస్తామన్నారు. ఇందుకోసం తొలుత లక్షా 30వేల రూపాయలు ఖర్చు చేస్తామన్నారు. ఈసందర్భంగా కెజి నుంచి పిజి వరకు విభిన్న అంశాలతో విద్యార్థులు తయారుచేసిన 100 నమూనాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను సుజనాచౌదరి ప్రారంభించారు. బందరు ఎంపి కొనకళ్ల నారాయణరావు, పిజి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. వెంకటేశ్వరరావు, డీన్ ఎన్ లక్ష్మి, బి.ఇడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి పద్మతులసి, డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. ఆర్ పద్మావతి, డాక్టర్ మంగతాయారు, ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి వరదరాజన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ శ్రీనివాసరావు ప్రసంగించారు. తొలుత నందిని స్వాగతం పలుకగా డాక్టర్ సుమతీకిరణ్ వందన సమర్పణ చేశారు.