అవనిగడ్డ, ఫిబ్రవరి 8: కోడూరు మండలంలోని ఉల్లిపాలెం, బందరు మండలం భవానీపురం గ్రామాలను కలుపుతూ కృష్ణానదిపై హైలెవిల్ బ్రిడ్జి నిర్మాణం రూ.67 కోట్లతో నిర్మించటం జరుగుతుందని రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలో రూ.70లక్షల వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.30లక్షల వ్యయంతో నిర్మించనున్న సమావేశ మందిరానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ త్వరలో కృష్ణా డెల్టా ఆధునీకరణలో భాగంగా పంట కాలువ వెంబడి రివిట్‌మెంట్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా తాను నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నికల ప్రణాళిక అడ్డం రాకుండా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఎండివో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంలో శాసనసభ్యుడు అంబటి శ్రీహరిప్రసాద్, పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు ప్రమేయం లేకుండా ప్రారంభించటం తగదంటూ ప్రోటోకాల్ పాటించకుండా నిరంకుశంగా నిర్వహిస్తున్నారంటూ ఆ పార్టీ నాయకులు దుర్గాప్రసాద్, వీర వసంతరావు, బచ్చు వెంకట నాగ ప్రసాద్, ఎఎస్‌ఆర్‌కె మూర్తి, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రొటోకాల్‌ను విస్మరించిన ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సిఐ సూర్యచంద్రరావు, బుద్ధప్రసాద్ దేశం పార్టీ కార్యకర్తలతో సంప్రదించి శాసనసభ్యులు అనుమతితోనే తాను ప్రారంభిస్తున్నానని, ఆయనకు కుదరదని చెప్పటంతో ప్రారంభించాలని చెప్పటంతో కార్యకర్తలకు బుద్ధప్రసాద్ వివరించారు. అయినా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భవనం ముందు నిరసన నినాదాలు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మద్య భవన ప్రారంభ నిర్మాణం జరిగింది. అంతకు ముందు తెలుగుదేశం కార్యకర్తలు ఎండివో పైన, ఇంజనీరింగ్ అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి నిలదీశారు. ఎట్టకేలకు ప్రశాంతంగా ప్రారంభోత్సవ కార్యక్రమం ముగియటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
బైక్ బాక్స్ నుంచి లక్షన్నర నగదు చోరీ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 8: బైక్‌లోని బాక్స్‌లో పెట్టిన లక్షా 50వేల రూపాయల నగదును ఆగంతకులు దొంగలించారు. పోలీసుల కథనం ప్రకారం... ఎస్‌ఎన్ గొల్లపాలెంకు చెందిన జి. వెంకటేశ్వరరావు శనివారం స్థానిక ఇండియన్ బ్యాంక్‌లో లక్షా 50వేల రూపాయలు డ్రా చేశాడు.
బైక్ బాక్స్‌లో నగదు పెట్టుకొని యాక్సిస్ బ్యాంకు దగ్గరకు వెళ్లాడు. అక్కడ రోడ్డుపై బైక్ పెట్టి బ్యాంకు లోపలకు వెళ్లివచ్చేసరికి ఆగంతకులు చాకచక్యంగా బైక్ బాక్సులో వున్న మొత్తం నగదును తస్కరించారు. ఈమేరకు బాధితుడు ఆర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గుడివాడ, ఫిబ్రవరి 8: గుడ్లవల్లేరు మండలం అంగలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం శనివారం రాత్రి పల్సర్ బైక్‌పై గుడివాడ రూరల్ మండలం మోటూరుకు చెందిన వేల్పూరి తేజ(20), గుడివాడ పట్టణంలోని బంటుమిల్లి రోడ్డుకు చెందిన పంది హరీష్, గుడివాడ రూరల్ మండలం చిరిచింతల గ్రామానికి చెందిన గుజ్జర్లమూడి జగదీష్(19) గుడ్లవల్లేరు వైపు వెళ్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించిన కల్వర్ట్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తేజ అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాల పాలైన హరీష్‌ను 108అంబులెన్స్‌లో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. వీరితో ఉన్న జగదీష్ క్షేమ సమాచారం తెలియలేదు. స్థానికులు చిరిచింతలకు తీసుకువెళ్ళారని తెలియడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. జగదీష్‌కు సంబంధించిన ఎటువంటి సమాచారం లేకపోవడంతో అతని క్షేమంగా ఉన్నాడా, లేదా అనేది తెలియరాలేదు. ఈ మేరకు గుడ్లవల్లేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేటి నుంచి జిల్లాలో
స.హ. చట్టం కమిషనర్ పర్యటన
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 8: రాష్ట్ర సమాచార హక్కు చట్టం 2005, కమిషనర్ పి విజయబాబు ఈనెల 9వ తేదీ ఉదయం 11గం.లకు విజయవాడలోని స్టేట్ గెస్టుహౌస్‌లో సమాచార హక్కు చట్టం కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6గం.లకు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రాత్రికి స్టేట్ గెస్టుహౌస్‌లో బస చేస్తారు. 10వ తేదీ ఉదయం 11గం.లకు స్థానిక త్రివేణి డిగ్రీ కళాశాలలో నిర్వహించే రెస్పాన్సుబులిటీ ఆఫ్ ఓటింగ్ అండ్ గుడ్ గవర్నెస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాయంత్రం 6గం.లకు ఘంటసాల కళావేదిక, ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో నిర్వహించు గంటసాల ఆరాధనోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 11, 12 తేదీలు సెలవు అనంతరం 13వ తేదీ ఉదయం 6గం.లకు విజయవాడ చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారు. ఉదయం 10.30గం.లకు స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేసిన సమాచార హక్కుచట్టం 2005 అవగాహన కొరకు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5గం.లకు భవానీపురంలోని రుషీ విద్యా సదన్‌లో ఏర్పాటు చేసిన సామాచార హక్కుచట్టంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి విజయవాడలో బస చేస్తారు. 14వ తేదీ ఉదయం 11గం.లకు స్థానిక శ్రీవిద్యా అకాడమిలో నిర్వహించు ఆర్‌టిఐ-యూత్ రోల్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సాయంత్రం 5గం.లకు విజయవాడ చేరుకుని హైదరాబాదు వెళతారు.
బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, వికలాంగులకు శాపంగా మారిన
జీవో నెం.102, 22ను రద్దు చేయాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 8: బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, వికలాంగుల పాలిట శాపంగా మారిన జివో నెం.101, 22లను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ బిసి సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టిడిపి మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 101, 22 జివోను వెంటనే రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. లోన్స్ వయోపరిమితిని 45 సంవత్సరాలకు తగ్గించటం దారుణమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ప్రజలు త్వరలో బుద్ధిచెప్పనున్నారన్నారు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, వికలాంగులు జివో నెం.101, 22 వలన తీవ్రంగా నష్టపోతారన్నారు. రాబోయే రోజుల్లో బడుగు, బలహీన, మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పనున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జివో నెం.101, 22లను రద్దు చేసి బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ, వికలాంగులను ఆదుకోవాలన్నారు. అనంతరం జివో నెం.102, 22లను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, టిడిపి నాయకులు బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, బత్తిన దాసు, నారగాని ఆంజనేయ ప్రసాద్, మోటమర్రి బాబాప్రసాద్, మైనార్టీ నాయకులు ఇలియాస్ పాషా, వౌలాలి, అమీర్ బాయ్, ఎస్‌సి సెల్ నాయకులు వి చౌదరి, సాతులూరి నాంచారయ్య, కర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.