Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అస్పష్ట రాజకీయం

$
0
0

ఏలూరు, ఫిబ్రవరి 8 : జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఏ మాత్రం స్పష్టత లేకపోవడంతో అటు రాజకీయ వర్గాలు, ఇటు సామాన్య ప్రజానీకం కూడా గందరగోళంలోనే కొనసాగుతున్నారు. అయితే సమైక్యాంధ్ర సెంటిమెంటుతో ఉద్యమాలు పెద్ద ఎత్తున సాగిన నేపధ్యంలో జిల్లా రాజకీయ ముఖచిత్రంపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ పార్టీలు తమ వంతుగా ఈ ముఖచిత్రంలో కొంతైనా స్పష్టత తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఇవన్నీ కూడా మరో 20 రోజుల్లో పూర్తిగా మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదని మరో ప్రచారం సాగుతూనే వుంది. ప్రస్తుతం జరుగుతున్నవి ఎత్తులా? లేక రానున్న కాలంలో కలిసి నడిచే పొత్తులా? అన్నది తేలాలంటే ఈ 20 రోజులు గడవాల్సిందే. ఆ తరువాతే ఎవరు ఎవరితో కలుస్తారు, ఇంకెవరు ఎవరితో పోరాడతారు అన్న విషయంలో కొంతైనా స్పష్టత వస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీలు పొత్తులకు ప్రవేశిస్తాయని, కలిసే పోటీ చేస్తాయన్న ప్రచారం జరిగిపోతోంది. అదే నిజమైతే జిల్లాలో కొన్ని సీట్లు బిజెపికి కేటాయించాల్సిన పరిస్థితి కూడా వుంటుంది. అదే జరిగితే ఇంతకుముందు అలవాటుగా వున్న నర్సాపురం పార్లమెంటు స్థానాన్ని బిజెపికి కేటాయిస్తారా? లేక మారిన పరిస్థితుల్లో ఈ కేటాయింపులు పెరుగుతాయా? అన్నది తేలాల్సి వుంది. ఇప్పటికే నర్సాపురం బరిలో బిజెపి తరఫున అటు సినీ హీరో కృష్ణంరాజు, అదే విధంగా ఇటు ఇటీవలే రంగ ప్రవేశం చేసిన కనుమూరి రఘురామకృష్ణంరాజు కూడా రేసులోనే వున్నట్లు చెబుతున్నారు. మరోవైపు ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమని ఈ మధ్యే ఆ పార్టీలో చేరిన కోటగిరి శ్రీ్ధర్ కూడా ప్రకటనలు చేశారు. ఈ విధంగా సీట్ల వారీగా ప్రకటనలు గుప్పుమంటున్నా అసలు పొత్తు ఉంటుందా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి వుంది. అయితే ఈ పొత్తు అంశం తేలాలంటే మరో 20 రోజులు గడవాల్సిందేనన్న అంచనాలు కూడా లేకపోలేదు. ఈ నెల 20వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు కొనసాగనున్నందున ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెడతారని ఊహిస్తున్నారు. అదే జరిగి ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. ఇదే సమయంలో బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినా ఆమోదం పొందకపోయినా ఈ ముఖచిత్రంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఒక వేళ బిల్లు ఆమోదం పొందకపోతే బిజెపి వల్లే ఆ పరిస్థితి తలెత్తితే మాత్రమే తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు విషయంలో ముందుకు సాగుతుందన్న అంచనాలున్నాయి. అలా లేకుంటే సీమాంధ్రలో బిజెపిపై వెల్లువెత్తే వ్యతిరేక పవనాల కారణంగా టిడిపి కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఎదురవుతుంది. ఇక తెలంగాణలోను కాంగ్రెస్, టి ఆర్ ఎస్‌లు ప్రత్యేక రాష్ట్ర ఖ్యాతిని భుజాన వేసుకునే అవకాశం వున్నందున అక్కడ కూడా బిజెపితో కలిసి పోటీ చేయడం వల్ల టిడిపికి పెద్దగా లాభించేది ఉండదని అంచనాలు వేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం లేదని చెబుతుండగా ఒక వేళ సమైక్యాంధ్ర కొనసాగితే మాత్రం ఈ పార్టీల మధ్య పొత్తు వుంటుందని చెబుతున్నారు. అది నిజమైతే ఏ సీట్లు బిజెపికి కేటాయిస్తారు? ఇంకేసీట్లు టిడిపి సొంతంగా పోటీ చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా అభ్యర్ధుల ఖరారు ప్రక్రియను శరవేగంగా ముందుకు తీసుకువెళుతోంది. పలు అసెంబ్లీ సిగ్మెంట్ల పరిధిలో అభ్యర్ధులను ఖరారు చేసి ముందుకు సాగుతున్న టిడిపి ఈ విషయంలో కొంత ముందంజలో వుందని చెప్పుకోవాలి. ఇదే సమయంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ అదే ఉత్సాహం కనిపిస్తోంది. అధిష్టానం నిర్ణయం మేరకు అభ్యర్ధులు ఎవరైనా గెలుపు మాత్రం తమదేనన్న ధీమా ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా పాలపొంగు వంటిదేనని, ఎన్నికల సమయానికి ఇంత హడావిడి వుండదని కూడా మిగిలిన పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాల్లో టిడిపి, వైసిపి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అడుగులు వేస్తున్నా కాంగ్రెస్‌లో మాత్రం పూర్తిస్థాయి నైరాశ్యం నెలకొని వుంది. రాష్ట్ర విభజన అంశాన్ని భుజాన వేసుకున్న దగ్గర నుంచి ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోవడంతో పలు నియోజకవర్గాల పరిధిలో అభ్యర్ధులు కూడా లభించే అవకాశం లేని స్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. అయితే ఈ అనిశ్చితులన్నీ ఒక కొలిక్కి రావాలంటే మరో 20 రోజులు వేచి చూడాల్సిందే...

జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఏ మాత్రం స్పష్టత లేకపోవడంతో
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>