నెల్లూరు, ఫిబ్రవరి 11: ఊరూవాడ ఏకమవుతోంది. పల్లె పట్టణం హద్దు చెరిగిపోతోంది. సమైక్యమే మా అభిమతమంటూ ప్రతి గుండె ధ్వనిస్తోంది. విభజించే హక్కు మీకెక్కడిదంటూ నినాదం మారుమోగుతోంది. అభివృద్ధికి అడ్డుకట్ట ఇది అవి భావి తరం గళమెత్తుతోంది. వెరసి సమైక్య ఉద్యమం పోరుతో మంగళవారం నెల్లూరు దద్దరిల్లింది. పార్లమెంట్‌లో విభజన బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ మంగళవారం నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు ప్రాంతాలతోపాటు జిల్లాలోని అన్నీ మండలాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేశారు. సినిమా హాళ్లు మూసి ప్రదర్శనలు నిలిపివేశారు . నెల్లూరురూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఎన్‌జివోలు చేస్తున్న సమైక్య ఉద్యమానికి మద్దతు తెలుపుతూ వారి నిర్వహిస్తున్న ర్యాలీలో పాల్గొని నగరంలో అర్చన హాలులో ప్రదర్శన ఆపేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. జెఎసి జిల్లా కన్వీనర్ అంజయ్య ఆధ్వర్యంలో విఆర్‌సిసెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
శక్తి ఉన్నంత వరకు
పోరాటం :ఆనం
నెల్లూరుసిటీ: సమైక్యాంధ్ర కోసం శక్తి ఉన్నంత వరకు పోరాటం చేస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. మంగళవారం సమైక్యాంధ్ర మద్దతుగా ఎన్జీఓలు చేస్తున్న సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఎన్జీఓల పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా సినిమా హాళ్లలో ప్రదర్శనను నిలిపివేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 17,18 తేదీలలో చలో ఢిల్లీయాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వ్యక్తికన్నా పార్టీ గొప్పదని, పార్టీ కన్నా ప్రజలు గొప్పవారని తెలిపారు. విభజనకు అనుకూలంగా అన్ని పార్టీలు లేఖలు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విభజన నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకించినట్లు పేర్కొన్నారు. తన శక్తి ఉన్నంత వరకు సమైక్యాంధ్ర కోసం పోరాడతానన్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో ఉన్న ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కొంతమంది స్వార్థపరులు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారన్నారు. కొంతమంది పార్టీ అతిష్ఠానానికి తప్పుడు సలహాలు ఇవ్వడం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. తనకు పార్టీకి కన్నా ప్రజలు ముఖ్యమని, వారు ఏమి చెప్పితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నారన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు డ్రామాలు అపి విభజన నిర్ణయానికి అడ్డుతలగాలని సూచించారు. సీమాంధ్రలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవి వ్యామోహంలో విభజనను ప్రోత్సాహిస్తున్నారని తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్జీఓలు పోరాడుతున్న ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపిస్తామని చెప్పారు. విభజనను అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా పార్లమెంటులో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డిసిసి ఇన్‌చార్జ్ చాట్ల నరసింహారావు, ఎన్జీఓ నాయకుడు రమణారెడ్డి, యలమూరి రంగయ్యనాయుడు, ఏసి సుబ్బారెడ్డి , పుట్టారామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఊరూవాడ ఏకమవుతోంది. పల్లె పట్టణం హద్దు చెరిగిపోతోంది.
english title:
samaikyam
Date:
Wednesday, February 12, 2014