నెల్లూరు, ఫిబ్రవరి 11: దక్షణ మధ్య రైల్వే డివిజనల్‌లో అత్యధిక ఆదాయం నెల్లూరు నుంచే రైల్వేశాఖకు సమకూరుతోంది. దాదాపు ఏడాదికి రూ.1200 కోట్లు నెల్లూరు జిల్లా నుంచి వస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీనిలో గూడ్స్ రవాణా ద్వారా సుమారు రూ.500 కోట్లు వస్తోంది. కృష్ణపట్నం ఓడరేవు, విజయవాడ డివిజన్ ఆదాయంలో ఆగ్రస్థానంలో నిలిచింది. విదేశాల నుండి దిగుమతి అవుతున్న సరుకులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేయడంలో రైల్వేశాఖదే అగ్రస్థానం. గ్రానైట్, ఇనుపఖనిజం, పామాయిల్ తదితర సరుకులు దిగుమతి అవుతున్నాయి. జిల్లాలో రైలు రవాణాకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. జిల్లాలో 220 కిలోమీటర్ల పొడవున రైలు మార్గం ఉంది. అయితే పశ్చిమ ప్రాంతంలో మాత్రం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొత్త రైలు మార్గానికి మాత్రం కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదు. శ్రీకాళహస్ర్తీ- నడికుడి కొత్త రైలు మార్గానికి 2010-11 బడ్జెట్‌లోనే మోక్షం లభించింది. సర్వే కూడా పూర్తి అయ్యి ఈ మార్గ నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా కూడా ఊపింది. 2005లో తొలిసారిగా ప్రాథమిక సర్వే నిర్వహించారు. దీన్ని వ్యయం అప్పట్లో రూ.1310 కోట్లను అంచనా వేశారు. అయితే ప్రస్తుతం 30శాతం పెరిగి ఉంటుంది. కాగా అందులో రాష్ట్ర ప్రభుత్వం 50శాతం భరించే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంగీకరించారు. ఇందుకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో ఈ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. 2012 రైల్వే బడ్జెట్‌లో కేవలం ఈ మార్గానికి రూ.8లక్షలు మాత్రమే నిధులు కేటాయించారు. 2012-13 బడ్జెట్‌లో కోటి రూపాయల నిధులను కేటాయించారు. ఈ కొత్తరైలు మార్గం ఏర్పాటైతే నెల్లూరు వాసులకు దూరాభారం తగ్గుతుంది. అంటే హైదరాబాద్‌కు వెళ్లాలంటే 160 కిలోమీటర్లు తగ్గుతుంది. అలాగే చార్జీ కూడా తగ్గుతుంది. చిత్తూరు జిల్లాలోని కాళహస్ర్తీ నుంచి నెల్లూరు జిల్లా పశ్చిమ ప్రాంతాలైన రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు, వింజమూరు మీదుగా ప్రకాశం జిల్లాలోని పామూరు, కనిగిరి, దర్శి మీదుగా హైదరాబాద్‌కు వెళుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గం సముద్రతీరం వెంబడి ఉండటంతో తరచూ వరదలు, తుఫాన్‌ల తాకిడి వల్ల రైలు ట్రాక్ దెబ్బతిని రైళ్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కల్గుతున్నాయి. ఈ మార్గమైతే అలాంటి ఇబ్బందులు ఉండవు. గూడూరు నుంచి దుగరాజపట్నం వరకు రైలు మార్గానికి సర్వే చేసి అంచనాలు తయారు చేశారు. అయినా ఇంత వరకు మోక్షం లేదు. ఈ సారైన బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారో లేదో. కృష్ణపట్నం- ఓబులావారిపల్లి రైలు మార్గం కార్యరూపం దాల్చలేదు. చెన్నై- హైదరాబాద్ బుల్లెట్ రైలు 2009లోనే కార్యరూపం దాల్చినా ఇంత వరకు మంజూరు కాలేదు. రానున్న ఎన్నికల సమయంలోనే జిల్లాకు రైల్వే బడ్జెట్‌లో అధిక నిధులు మంజూరు అవుతాయో లేదో వేచి చూడాల్సిందే.
దక్షణ మధ్య రైల్వే డివిజనల్‌లో అత్యధిక ఆదాయం నెల్లూరు నుంచే రైల్వేశాఖకు
english title:
funds
Date:
Wednesday, February 12, 2014