నెల్లూరు, ఫిబ్రవరి 11: నగరంలోని హరనాధపురంలో తల్లీకూతుళ్ల హత్య జరిగి సంవత్సరం పూర్తి అవుతున్నా నిందితులను శిక్షించకుండా బయిల్ ఇచ్చి ప్రజల్లోకి వదలడాన్ని నిరసిస్తూ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్(టిఎన్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో నేతలు, విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకొని మంగళవారం విఆర్‌సి సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించి మహాత్మాగాంధీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలనాయుడు మాట్లాడుతూ నగర నడిబొడ్డులో మధ్యాహ్నం ఇంటిలోనికి ప్రవేశించి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులను బయటకు వదలడం ఏమిటని ప్రశ్నించారు. సంఘటన జరిగినప్పుడే టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో నిందితులను ఉరి తీయాలంటూ పోరాటం చేస్తే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను ఉరి తీసేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పోలీస్‌శాఖ హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇప్పటికీ అమలు జరగలేదని, నిందితులకు ఉరి విధించినప్పుడే విద్యార్థిని భార్గవి, ఆమె తల్లి శకుంతల ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.
దేశంలో నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ త్వరితగతిన నిందితులకు శిక్ష విధించే విధంగా ఫాస్ట్ ట్రాక్‌కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. బుధవారం జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలోని విద్యార్థులు రెండు నిమిషాలు పాటు వౌనం పాటించి వారికి సంతాపం తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ అమృల్లా, హర్ష, మోను, సాయికిషోర్, ప్రేమ్‌కుమార్‌రెడ్డి, ముత్తుజా, రవితేజ, వంశీకృష్ణ, శ్రావణ్, ప్రమోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ ఉద్యోగి ఇంట్లో చోరీ
రూ.1.50లక్షల సొత్తు అపహరణ
నెల్లూరు, ఫిబ్రవరి 11: ఇంట్లో ఎవరూ లేరని గమనించిన గుర్తుతెలియని దొంగలు మిద్దెపైన నుంచి లోనికి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.1.50లక్షలు విలువచేసే సొత్తును అపహరించుకెళ్లిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున స్థానిక నవాబుపేటలోని బంగ్లాతోట సమీపంలో జరిగింది. రమణకుమార్ అనే వ్యక్తి నగరంలోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే గురువారం ఇంటి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. గమనించి దొంగలు మిద్దెపై నుంచి ఇంటిలోనికి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న లక్షా 50వేల రూపాయలు విలువచేసే రెండు సవర్ల బంగారు ఆభరణాలతోపాటు రెండు కేజిల వెండి వస్తువులను దొంగిలించుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న రమణకుమార్ బీరువా తెరిచి ఉండటాన్ని గమనించి చూడగా అందులో బంగారం, వెండి వస్తువులు లేకపోవడంతో దొంగతనం జరిగిందని నిర్ధారించుకుని రెండవ నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై సాంబశివరావు, క్రైం సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఇన్‌స్పెక్టర్ శివారెడ్డి ఆధ్వర్యంలో వేలిముద్రలను సేకరించారు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాంబశివరావు తెలిపారు.
రెండవ రోజు కూడా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
నెల్లూరు, ఫిబ్రవరి 11: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్(యుఎఫ్‌బియు) పిలుపు మేరకు రెండవ రోజైన మంగళవారం బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. నగరంలోని బృందావనంలో ఉన్న ఆంధ్రాబ్యాంక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కన్వీనర్, ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారన్నారు. కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా గత రెండురోజుల నుంచి సమ్మె చేస్తున్నామన్నారు. దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణ ఒప్పందం త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 235 బ్యాంక్‌లలో పనిచేస్తున్న 5వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జివోఇ నాయకులు ఎస్ తిరుపతినాయుడు, నాయకులు ఎన్ సుబ్బారావు, వి రామకృష్ణ, శ్రీనివాసరావు, నరేంద్రరెడ్డి, దిలీఫ్‌కుమార్, సైమన్‌పీటర్, కెఎస్ ప్రసాద్, భాస్కర్, రాజు, ఎస్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
రెండురోజులుగా స్తంభించిపోయిన లావాదేవీలు
నెల్లూరు జిల్లాలో రెండురోజులుగా కేంద్రప్రభుత్వం ఐబిఏ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా గత రెండురోజుల నుంచి బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. దీంతో జిల్లాలో అన్నీ జాతీయ బ్యాంకులతోపాటు ప్రభుత్వ రంగ గ్రామీణ శాఖలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ఎక్కువ ఎటిఎంలలో నగదు లేక ప్రజలు ఇబ్బందులుపడ్డారు.
టిడిపి హయాంలోనే మహిళలకు అన్యాయం
* మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణమ్మ స్పష్టం
నెల్లూరు కల్చరల్, ఫిబ్రవరి 11: తెలుగుదేశం పార్టీ హయాంలోనే మహిళలకు అన్యాయం జరిగిందని, మహిళా వ్యతిరేక చర్యలన్నీ బాబు పాలనలోనే జరిగాయని, ఈ విషయాన్ని మరిచిపోయి ఆ పార్టీ మహిళా రక్షణపై గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పందిళ్లపల్లి అరుణమ్మ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలు చంద్రబాబుపై కనె్నర్ర చేయడం వల్లే గత పదేళ్లుగా టిడిపి అధికారానికి దూరంగా ఉందన్నారు. అంగన్‌వాడీ మహిళలను హైదరాబాద్‌లో లాఠీలతో కొట్టించి, గుర్రాలతో తొక్కించిన సంఘటన టిడిపి పాలనలోనే జరిగిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని ఆందోళన చేస్తే మహిళలని కూడా చూడకుండా పోలీసులతో పాశవికంగా కొట్టించి అవమానించింది చంద్రబాబు కాదా అని అరుణమ్మ ప్రశ్నించారు. ఇంకా వందేళ్లు గడిచినా బాబు రాక్షస పాలనను ఈ రాష్ట్ర ప్రజలు నమ్మరని అరుణమ్మ జోస్యం చెప్పారు.
అక్కినేనికి ఘనంగా స్వర నీరాజనం
నెల్లూరు కల్చరల్, ఫిబ్రవరి 11:ఘంటసాల సంగీత సభ 11వ వార్షికోత్సవాన్ని, ఘంటసాల 40వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి స్థానిక టౌన్‌హాలులో నిర్వహించిన కార్యక్రమంలో గాయనీ గాయకులు దాదా పాల్కే అవార్డు గ్రహీత దివంగత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు స్వర నీరాజనం ఇచ్చారు. సంగీత సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు గట్టుపల్లి ఆదిశేషు, కెవిఎస్ ప్రసాద్ పర్యవేక్షణలో పలువురు గాయనీగాయకులు అక్కినేని సినిమాల్లోని ఘంటసాల గానం చేసిన పాటలను గానం చేసి సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈసందర్భంగా ఉదయం పాటలు, డాన్స్‌ల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. ఈసందర్భంగా రుచిష్వ, దేవతాసిస్టర్స్ ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో అమరావతి కృష్ణారెడ్డి, దేవరాల సుబ్రహ్మణ్యం, జలదంకి కోదండరామిరెడ్డి, బి శ్రీనివాసులురెడ్డి, గాలి కిరణ్‌కుమార్, పూడి నరేంద్ర, శిరిగిరి పెంచలయ్య, వాస్తురామచంద్రయ్య ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా పలువురు కళాకారులు గట్టుపల్లి ఆదిశేషు కుటుంబ సభ్యులు సన్మానించారు. ఈకార్యక్రమంలో డాక్టర్ ఎస్ సాయినాథ్, పాటూరు శ్రీనివాసులు,జిఎస్ మురళీకృష్ణ, పి అన్నపూర్ణ, డాక్టర్ ఎం సుబ్రహ్మణ్యం, వెనె్నలకంటి శివప్రసాద్, ఆదిమూర్తి, శ్రీనివాసమూర్తి, డివిఎస్ సాయిరాం ప్రసాద్‌తోపాటు పుర ప్రముఖులు, సంగీతాభిమానులు, కళాకారులు పాల్గొన్నారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం
నెల్లూరు , ఫిబ్రవరి 11: కడపలో ఇటీవల జరిగిన ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు బషీర్, గౌస్‌లు ప్రతిభ కనబరిచారని బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. నవాబుపేట జిల్లా బ్యాడ్మింటన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అండర్ 15 డబుల్స్ విభాగంలో మన జిల్లా క్రీడాకారులు తృతీయ స్థానం సాధించి జిల్లాకు గుర్తింపు తెచ్చారన్నారు. అదే ఉత్సాహంతో శిక్షణ తీసుకుంటూ జాతీయ స్థాయిలో జిల్లా తరఫున ఆడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బషీర్, గౌస్‌ను శాలువాతో సత్కరించి ప్రోత్సాహక నగదు బహుమతి అందించారు. ఈకార్యక్రమంలో సరాబు సుబ్రహ్మణ్యం, ఎం ప్రసాదరావు, , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినులకు వ్యాసరచన పోటీలు
నెల్లూరు, కల్చరల్, ఫిబ్రవరి 11: నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19న టౌన్‌హాల్‌లో మహిళలు మహనీయులు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని నెరసం అధ్యక్ష, కార్యదర్శులు ఎ జయప్రకాష్, మాటేటి రత్న ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా హైస్కూల్ స్థాయి విద్యార్థినులకు నీకు నచ్చిన ఆదర్శ మహిళ, కళాశాల విద్యార్థినులకు నేటి సమాజంలో స్ర్తి అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. మొదటి 3 స్థానాల విజేతలకు నగదు బహుమతితోపాటు పాల్గొన్నవారికి ప్రశంసాపత్రాలు అందచేస్తామన్నారు. వ్యాసాలను ఈనెల 17తేదీలోగా నెరసం కార్యాలయంలో అందచేయాలన్నారు.
ఘనంగా సత్యసాయి భజన మందిరం వార్షికోత్సవం
నెల్లూరు కల్చరల్, ఫిబ్రవరి 11: స్థానిక రామ్మూర్తినగర్‌లోని శ్రీసత్యసాయి భజన మందిరం దశమ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈసందర్భంగా తెల్లవారు జామున నగర సంకీర్తన, ఉదయం సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, ప్రసాద వినియోగం జరిగాయి. సాయంత్రం బాబా భజనలు, ప్రొఫెసర్ జిన్ మూర్తి, సినీ గేయరచయిత భువనచంద్ర సత్సంగం నిర్వహించారు. రాత్రి మంగళ హారతి అనంతం భక్తులకు ప్రసాద వినియోగం చేశారు. ఈకార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, సాయి భక్తులు పాల్గొన్నారు.