ఒంగోలు, ఫిబ్రవరి 11:రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఉద్యమం జోరుగా సాగుతోంది. ఎపి ఎన్జీవోల అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరింది. ఎన్జీవోల సమ్మె సందర్భంగా జిల్లావ్యాప్తంగా పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు మూతపడ్డాయి. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, చీరాల, మార్కాపురం తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర సమ్మె ఉగ్రరూపం దాల్చుతోంది. జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఎపి ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకు ఉద్యోగులు స్థానిక ప్రకాశం భవనం నుండి ర్యాలీగా బయలుదేరి పెట్రోలు బంకులు, సినిమాళ్లను మూయించివేశారు. ఈసందర్భంగా ప్రకాశం భవనం వద్ద ఏర్పాటుచేసిన ఆందోళన కార్యక్రమంలో ఎపి ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్యాంధ్రా ఉద్యమానికి మద్దతుగా సహకరించిన పెట్రోలు బంకులు, సినిమాహాళ్ల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జరిగే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో విద్యాశాఖ మినిస్టీరియల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అడపా స్వాములు మాట్లాడుతూ అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టడటం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎపి ఎన్జీవో అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కె శరత్‌బాబు, ఒంగోలు పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నాసర్‌మస్తాన్ వలీలు మాట్లాడుతూ ఎంపిలు పార్లమెంటులో తెలంగాణ బిల్లు వీగిపోయేలా చేసేందుకు ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లును ఎంపిలు అడ్డుకోకపోతే వారి రాజకీయ జీవితానికి సమాధి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోయ కోటేశ్వరరావు, జిల్లా పరిషత్ ఉద్యోగ సంఘం నాయకులు శ్యాంసన్, విజయలక్ష్మి, ఎం వీరనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి మాధవి, వాణిజ్య పన్నుల శాఖ విభాగం జిల్లా అధ్యక్షురాలు మూర్తి, సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు కె శివకుమార్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు పి చెంచయ్య, కె వెంకటేశ్వర్లు, డ్రైవర్ల సంఘం జిల్లా కార్యదర్శి ప్రసన్నకుమార్, నీటిపారుదల శాఖ ఉద్యోగ సంఘం నాయకులు ఆర్‌సిహెచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏడో రోజుకు చేరిన ఎన్జీవోల సమ్మె సినిమాహాళ్లు, పెట్రోలు బంకుల మూత నేడు జాతీయ రహదారుల దిగ్బంధనం
english title:
s
Date:
Wednesday, February 12, 2014