ఒంగోలు, ఫిబ్రవరి 11: జిల్లాలో ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె విజయవంతమైంది. రెండవ రోజైన మంగళవారం జిల్లావ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జిల్లాలోని ఒంగోలు, కందుకూరు, మార్కాపురం, చీరాల తదితర ప్రాంతాల్లోని బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేలకోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ సమ్మెలో ఎపిజిబి, ఎఐబిఒఏ, యుఎఎఫ్‌బియు, ఎస్‌బిఐఎల్‌హెచ్‌ఐసి జిల్లానాయకులు పాల్గొన్నారు. ఒంగోలులోని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా ఒంగోలు మెయిన్ బ్రాంచి వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఎస్‌బిఐఎస్‌ఎల్‌హెచ్‌ఐసి వైస్‌ప్రెసిడెంట్, ప్రకాశం జిల్లా ఇన్‌చార్జి ఎం కృష్ణ, జిల్లా రీజనల్ కార్యదర్శి జి విజయకుమార్ తదితరులు మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు తీవ్ర పనిభారాన్ని మోస్తూ వ్యాపారాన్ని, ఉత్పాదకతను పెంచుతున్నారని పేర్కొన్నారు. ఫలితంగా బ్యాంకులు లాభాలు ఆర్జిస్తున్నాయని, కాని కార్పోరేట్ సంస్థలు ఎగవేసిన బాకీలను ఎన్‌పిఎలుగా చూపి వేతన సవరణను అంగీకరించకపోవటాన్ని గట్టిగా ప్రతిఘటించాలని ఉద్యోగులకు వారు పిలుపునిచ్చారు. ఈసమ్మెలో యూనియన్ల నాయకులు మల్లికార్జునరావు, పికె రాజేశ్వరరావు, బిఇఎఫ్‌ఐ నాయకులు సిహెచ్ శోభన్‌బాబు. ఏపిఎన్‌జివో రాష్ట్ర నాయకులు అబ్దుల్‌బషీర్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌డి సర్దార్, సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాసరావు, ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుబ్బారావు, సిపిఎం నగర కార్యదర్శి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం దిష్టిబొమ్మను ఉద్యోగులు తగలబెట్టి నిరసన తెలిపారు. మొత్తంమీద బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇబ్బందులుపడ్డ ఖాతాదారులు
english title:
banks strike successful
Date:
Wednesday, February 12, 2014