మార్కాపురం, ఫిబ్రవరి 11: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే అభిప్రాయంతో కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించిన సంఘటనలో భార్య, ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు మార్కాపురం డిఎస్పీ జి రామాంజనేయులు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాజిల్లా మైలవరం మండలం బాణావత్ భీమారావుకు పెనుమలూరు గ్రామానికి చెందిన బాణావత్ కోటేశ్వరితో సుమారు 15సంవత్సరాల కిందట వివాహమైంది. కాగా ఈమె ఐస్ ఫ్యాక్టరీలో పని చేస్తుండగా అక్కడ నుంచి ఐస్‌ను తరలించే షేక్ సలీం అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో అక్రమ సంబంధం నెరుపుతున్న సలీంకు విషయం చెప్పింది. దీనితో విజయవాడ పాయకాపురంకండ్రిక గ్రామానికి చెందిన రౌడీషీటర్ షేక్ చాంద్‌బాషాతో 50వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. జనవరి 28వతేదీన విజయవాడలోని హ్యాపీ బార్ అండ్ రెస్టారెంటులో భీమారావుకు మద్యం తాగించి శ్రీశైలం వెళ్దామంటూ చెప్పి షేక్ సలీం, షేక్ చాంద్‌బాషా, మరో యువకుడు షేక్ ఇమ్రాన్‌లు కుమారి అనే కాల్‌గర్ల్‌ను తీసుకొని బయలుదేరారు. మధ్యమధ్యన మద్యం సేవిస్తూ వినుకొండలో క్లచ్‌వైర్ కొనుగోలు చేసి పెద్దదోర్నాల మండలం నందీ మలుపువద్ద వాహనాన్ని ఆపి మద్యం సేవించారు. మద్యంమత్తులో భీమారావును కిందకుదించి సలీం, ఇమ్రాన్‌లు కాళ్ళు చేతులు పట్టుకోగా చాంద్‌బాషా మెడకు ఉరివేసి హత్యచేసి మృతదేహాన్ని లోయలోనికి నెట్టివేశారు. అయితే కారుబయలుదేరే సమయంలో మరోవ్యక్తి ఏడిఅంటూ కాల్‌గర్ల్ కుమారి ప్రశ్నించగా తమపై అలిగి వేరే వాహనంలో వెళ్తాడని చెప్పి సున్నిపెంట చేరుకొని నల్గొండ మీదుగా విజయవాడకు చేరారు. అయితే మద్యంమత్తులో చాంద్‌బాషా ఓ బార్‌లో తాము హత్య చేశామని అన్న స్నేహితులతో చెబుతుండగా అక్కడే ఉన్న పోలీసు విని కృష్ణాజిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ముందుగా కర్నూల్ జిల్లా శ్రీశైలం పోలీసులకు సమాచారం అందించారు. ఆప్రాంతంలో ఎక్కడా గుర్తుతెలియని మృతదేహం కనిపించకపోవడంతో ప్రకాశంజిల్లా పోలీసులకు ఈనెల 6వతేదీన సమాచారం అందించారు. యర్రగొండపాలెం సిఐ పాపారావు ఆధ్వర్యంలో ఎస్సై బ్రహ్మనాయుడు ఆ ప్రాంతంలో గాలింపుచర్యలు చేపట్టగా మృతదేహం దొరికింది. దీనితో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న వీరు నలుగురు కారులో పారిపోతుండగా ప్రకాశంజిల్లా సంతమాగులూరు మండలం అడ్డరోడ్డు వద్ద యర్రగొండపాలెం సిఐ పాపారావు ఈనెల 10వతేదీ మధ్యాహ్నం అరెస్టు చేశారని డివైఎస్పీ రామాంజనేయులు తెలిపారు. తన భర్త మద్యం సేవించి తరచూ వేధింపులకు గురి చేస్తుండటంతో తట్టుకోలేక తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న షేక్ సలీం సహాయంతో భర్త భీమారావు హత్యకు కుట్రపన్నినట్లు మృతుని భార్య కోటేశ్వరి అలియాస్ చిన్ని తెలిపారు. కాగా నిందితుల్లో ముగ్గురు డ్రైవర్లు కావడం, మృతుడు కూడా డ్రైవర్ కావడం విశేషం. వీరిని మంగళవారం సాయంత్రం మార్కాపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు డివైఎస్పీ రామాంజనేయులు తెలిపారు.
* కిరాయి హంతకులతో భర్తను హత్య చేయించిన భార్య * అక్రమ సంబంధమే కారణం * మార్కాపురం డిఎస్పీ రామాంజనేయులు
english title:
murder mystery solved
Date:
Wednesday, February 12, 2014