మార్కాపురం , ఫిబ్రవరి 11: లక్షలాదిమంది సీమాంధ్ర ప్రజల వేదనను ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్రరాష్ట్ర విభజన బిల్లు ఆమోదించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూనుకోవడం దురదృష్టకరమని మార్కాపురం మున్సిపల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ అధ్యక్షులు జె రామయ్య అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదచర్యలకు వ్యతిరేకంగా మున్సిపల్ ఉద్యోగులు 2వరోజు మంగళవారం పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచే కార్యసాధనలో భాగంగా పురపాలక సంఘం రాష్ట్ర ఉద్యోగ జెఎసి పిలుపుమేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఆయన తెలిపారు. అత్యావసర సర్వీసులు మినహాయిస్తూ జరపనున్న ఈ నిరవధిక సమ్మెకు పురప్రజలు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి టి సత్యనారాయణ, మేనేజర్ యోగేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులచే
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు, ఫిబ్రవరి 11: రాష్టవ్య్రాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ ఈనెల 8వ తేది నుండి జరిగే సమ్మెలో భాగంగా మంగళవారం పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించి స్థానిక చర్చి సెంటర్‌లో తలలేని రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు బహిష్కరించి నగరపాలక సంస్థ నుండి ప్రదర్శనగా బయలుదేరి చర్చి సెంటర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్‌డి సర్దార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంపుదల విషయంపై మీనమేషాలు లెక్కించడం సిగ్గుచేటన్నారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 12,500 రూపాయలు ఇవ్వాలని, ఒప్పొంద కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రతినెలా 1వ తేదిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్ ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షులు ముదివర్తి బాబూరావు మాట్లాడుతూ మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు పిఎఫ్, ఈఎస్‌ఐ పని భద్రత కల్పించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివిఆర్ చౌదరి మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులకు వారసత్వపు హక్కు కల్పించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని, జిపిఎఫ్ ఖాతా ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుల ఆదినారాయణ, శేషయ్య, శ్రీ్ధర్, శ్రావణ్‌కుమార్, దుర్గాప్రసాద్, జ్యోతుల రాజీవ్‌గాంధీ, చల్లా దుర్గారావు, కుంచాల శివరామకృష్ణ, వల్లెపు రామయ్య తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ అధికారుల అక్రమాలపై ఎసిబితో విచారణ చేయించండి
మార్కాపురం, ఫిబ్రవరి 11: రెవెన్యూ అధికారుల అక్రమాలపై ఎసిబి అధికారులతో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగుచూస్తాయని ప్రజలు అంటున్నారు. బదిలీ అయిన అనంతరం సమ్మె కారణంగా రిలీవ్ కాకుండా ఐదురోజులపాటు ఇక్కడే తిష్టవేసిన ఓ అధికారి లెక్కకు మించి సంతకాలు చేసి అందినంత దోచుకువెళ్ళాడనే ఆరోపణలు వినవస్తున్నాయి. అవినీతి బయటపడాలంటే ముందుగా 1-బి రికార్డులను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకుంటే వాస్తవాలు వెల్లడి అవుతాయని పలువురు అంటున్నారు. ఒకే తేదీతో వందలాది పాసుపుస్తకాలకు సంతకాలు చేశారంటే ఏమేరకు అవినీతి జరిగిందో చెప్పకనే అర్ధం అవుతుంది. కాగా ఈ అధికారి గతంలో పెద్దారవీడు మండలంలో పనిచేసి బదిలీపై మార్కాపురం వచ్చారని, ఇదే సమయంలో అక్కడ చేసిన కాలంలో మిగిలిపోయిన పనులను కూడా పాత తేదీలు వేసి పూర్తిచేసినట్లు అక్కడి అధికారులే బహిరంగంగా విమర్శించడం విశేషం. ఇదిలా ఉండగా పలువురు అధికారులు రికార్డులను ట్యాపరింగ్ చేసి ఎప్పుడో పట్టాలు పొంది పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్ పొందిన భూములకు కూడా ఫొటోలు మార్చి ఎలాంటి రద్దు ఆమోదం లేకుండా రౌండప్‌చేసి మరొకరి ఫొటోలను అతికించిన ఘనత ఈ కార్యాలయ అధికారులకు ఉందంటే వీరి అవినీతి ఏపాటిదో చెప్పకనే అర్ధం అవుతుంది. ఎసిబి అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే అనేక అవకతవకలు బయటపడే అవకాశం ఉందని, ఇప్పటికైనా జిల్లాకలెక్టర్ జోక్యం చేసుకొని మార్కాపురం రెవెన్యూ కార్యాలయ రికార్డులపై విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అభివృద్ధిపథంలో చీరాల:ఆమంచి
చీరాల, ఫిబ్రవరి 11: చీరాల పట్టణం అభివృద్ధిపథంలో పయనిస్తోందని చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలల్లో ఆయన పాల్గొన్నారు. 24వ వార్డులోని వైకుంఠపురం జాలమ్మ చెట్టు వద్ద రూ. 6 లక్షలతో సిసి రోడ్డుకు, 26వ వార్డులోని అరిటాకులపేటలో రూ. 1.50 లక్షలతో డ్రైనేజీ నిర్మాణం, 27, 28వార్డులలోని జై శంకర్‌నగర్ మన్నా చర్చి వద్ద రూ. 8.70 లక్షలతో సిసి రోడ్డు, 28వ వార్డు విఠల్‌నగర్‌లో రూ. 25.60 లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మాణం, అదే వార్డులోని బోన్ మిల్‌రోడ్డు బాప్టిస్టు చర్చి పక్కన రూ. 4.50 లక్షలతో సిసి రోడ్డు, 30వ వార్డులోని ముద్దలవారి వీధిలో రూ. 31.15 లక్షలతో సిసి రోడ్డు, 33వ వార్డు జవహర్‌నగర్‌లో రూ. 8.80 లక్షలతో సిసి రోడ్డు, అదే వార్డులోని విజిలిపేట పెట్రోల్ బంకు పక్కన రూ. 30 లక్షలతో రోడ్డు డివైడర్స్ నిర్మాణం, రూ. 17.50 లక్షలతో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా విఠల్‌నగర్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ గతంలో మున్సిపాలిటీలో పనిచేసి మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలను కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు. బలహీనవర్గాల కాలనీలో 74 మందికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పారు. డ్రైనేజీ సమస్యను అధిగమిస్తామన్నారు. బాప్టిస్ట్ చర్చి నిర్మాణంకోసం సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన చీరాలను అభివృద్ధిపథంలో నడిపించానన్నారు. ఆయన వెంట ఎఎంసి చైర్మన్ బి జైసన్‌బాబు, పిసిసి కార్యదర్శి మాదిగాని గురునాధం, మార్పు గ్రెగోరీ, డిఇ మాల్యాద్రి, ఏషయ్య, ఆర్‌ఐ హిమబిందు, టిపిఆర్‌వో కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీనివాస కల్యాణం
మద్దిపాడు, ఫిబ్రవరి 11: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి మద్దిపాడు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని, దేవేరుల ఉత్సవ విగ్రహాలను వివిధ రకాల పూలతో అర్చకులు ఎం దీక్షుతులు, గోపయ్యలు అలంకరించారు. ఆగమశాస్త్ర వేదపండితులు వేదాంతం వసంత గోపాలకృష్ణమాచార్యులు, పెద్దింటి రామచంద్ర ప్రసాదాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య కన్నుల పండుగలా తాళిబొట్టు, తలంబ్రాలతో శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కన్యాదాతలుగా మద్దిపాడు ప్రసాద్, లక్ష్మీ స్రవంతి దంపతులు పీటలపై కూర్చున్నారు. భక్తులు శ్రీ శ్రీనివాస కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో కనులారా తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రామపెద్దలు, మహిళా భక్తులు ఈవో అంజనాదేవి తదితరులు పాల్గొన్నారు.