విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 18: ఎట్టకేలకు రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నేపధ్యంలో రాష్ట్రం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా నగర పోలీసు యంత్రాంగం రోడ్డెక్కింది. రాష్ట్ర విభజనకు లోక్‌సభ ఆమోదం తెలిపిన క్రమంలో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డిజిపి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పటిష్ట బందోబస్తుకు ఆదేశించారు. దీంతో నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం పార్లమెంటు ముందుకు బిల్లు రానున్న నేపధ్యంలో ముందస్తుగా కమిషనరేట్ పరిథిలోని యంత్రాంగాన్ని బందోబస్తుకు ఆదేశించారు. సాయంత్రం 3 గంటల తర్వాత బిల్లుకు ఆమోదం లభించిందన్న సమాచారం రాగానే బలగాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్టేషన్ల పరిథిలోని ప్రధాన కూడళ్ళలో ప్రత్యేక బలగాలు మోహరించాయి. ప్రత్యేక రక్షణ దళాలు పెద్ద సంఖ్యలో బందోబస్తులో పాల్గొన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులు, షాపింగ్ మాల్స్, థియేటర్లతోపాటు రైల్వే స్టేషన్, బస్టాండు, ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసు కమిషనర్ స్వయంగా ఉన్నతాధికారులతో కలిసి బందరురోడ్డులో బలగాలతో కవాతు నిర్వహించారు. ఆయన స్వీయ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు విధులు పరికించారు. ఇదిలావుండగా టి బిల్లుకు ఆమోదం లభించిందన్న సమాచారం తెలియగానే టిడిపి, వైఎస్సార్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బెంజిసర్కిల్ వద్ద వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు టైర్లు తగులబెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జై ఆంధ్రా ప్రతినిధులు ఆందోళనకు దిగగా పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. అదేవిధంగా బందరురోడ్డు రాఘవయ్య పార్కు వద్ద వైకాపా నేతలు ధర్నా నిర్వహించగా అడపాశేషు నాయకత్వంలో మరో 14మందిని అరెస్టు చేసి విడుదల చేశారు. ఇదిలావుండగా రాష్ట్ర విభజన బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ టిడిపి, వైఎస్సార్ పార్టీలు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం నగరంలో బంద్‌కు సమాయత్తమయ్యాయి. విద్యాసంస్థలు, వర్తక, వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ పాటించాలని పిలుపునిచ్చాయి. బంద్ పిలుపు నేపధ్యంలో పోలీసు యంత్రాంగం మరింత కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన సమైక్యవాదులు రిక్త హస్తాలతో వెనుదిరిగారు. నగరంలో ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగేలా పోలీసు అధికారులు పటిష్ట పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు.
* టిడిపి ఆఫీసులో సోనియా ఫ్లెక్సీ దగ్ధం
ఇదిలావుండగా విభజనకు నిరసనగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ ఫ్లెక్సీని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గురుమూర్తి, చంద్రబాబు, శ్రీనివాస్, నాగేంద్రకుమార్, రామస్వామి, ఎంఎం దౌలా తదితరులు పాల్గొన్నారు.
* ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు * నేడు బంద్‌కు టిడిపి, వైకాపా పిలుపు
english title:
t
Date:
Wednesday, February 19, 2014