
వెల్లింగ్టన్, ఫిబ్రవరి 18: విదేశీ గడ్డపై టీమిండియా పర్యటన మరోసారి పేలవంగా ముగిసింది. న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వులో జరిగిన చివరి టెస్టు మంగళవారం డ్రాగా ముగియడంతో ఈ సిరీస్ 1-0 తేడాతో కివీస్ వశమైంది. దీంతో భారత టెస్టు జట్టుకు విదేశాల్లో వరుసగా నాలుగో సిరీస్ ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ అద్భుత ప్రదర్శనతో చరిత్రాత్మక ట్రిపుల్ సెంచరీ సాధించి ధోనీ సేన ఆశలపై నీళ్లు చల్లాడు. ఆరు వికెట్ల నష్టానికి 571 పరుగులతో మంగళవారం చివరి రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన నైట్ వాచ్‌మన్లు మెక్‌కలమ్, జిమీ నీషామ్ భారత బౌలర్లపై మరోసారి విరుచుకుపడి ఏడో వికెట్‌కు 179 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం జహీర్ ఖాన్ బౌలింగ్‌లో మెక్‌కలమ్ వికెట్ల వెనుక ధోనీ చేతికి చిక్కడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. మొత్తం 559 బంతులను ఎదుర్కొని నాలుగు సిక్సర్లు, 32 ఫోర్ల సహాయంతో 302 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించిన మెక్‌కలమ్ 1991లో శ్రీలంక జట్టుపై మార్టిన్ క్రో సాధించిన 299 పరుగుల వ్యక్తిగత స్కోరును అధిగమించడంతో పాటు ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి కివీస్ బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. 2012లో భారత్‌పై 329 పరుగుల అజేయ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మైఖేల్ క్లార్క్, 1934లో ఇంగ్లాండ్ జట్టుపై 304 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్‌ల తర్వాత టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన నెంబర్ 5 బ్యాట్స్‌మన్‌గా కూడా మెక్‌కలమ్ రికార్డులకు ఎక్కాడు. మెక్‌కలమ్ నిష్క్రమణ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టిమ్ సౌథీ 11 పరుగులు సాధించి జహీర్ ఖాన్ బౌలింగ్‌లోనే పుజారాకు దొరికిపోగా, తొలి టెస్టులోనే సెంచరీతో రాణించిన జిమీ నీషామ్ (137), నీల్ వాగ్నర్ (2) అజేయంగా నిలిచారు. దీంతో 8 వికెట్ల నష్టానికి 680 పరుగుల భారీ స్కోరు సాధించిన నూజిలాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఆ తర్వాత 435 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టును న్యూజిలాండ్ బౌలర్లు సమర్ధవంతంగా ప్రతిఘటించారు. వీరిని ఎదుర్కోవడంలో భారత ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. శిఖర్ ధావన్ (2), మురళీ విజయ్‌లతో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్‌గా దిగిన చటేశ్వర్ పుజారా (17) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో ధోనీ సేన 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఈ తరుణంలో యువ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. క్రీజ్‌లో నిలదొక్కుకుని చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు నాలుగో వికెట్‌కు 112 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించారు. 135 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ ఒక సిక్సర్, 15 ఫోర్ల సహాయంతో 105 పరుగులు సాధించగా, స్థిమితంగా ఆడిన రోహిత్ శర్మ 97 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 31 పరుగులు సాధించాడు. దీంతో భారత జట్టు 52 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 166 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఉభయ జట్ల కెప్టెన్లు ఆటను నిలిపివేసేందుకు అంగీకరించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 192 పరుగులకు ఆలౌటవగా, భారత జట్టు 438 పరుగులు సాధించిన విషయం విదితమే. (చిత్రం) పరుగులతో హోరెత్తించిన మెక్‌కలమ్ 302, జిమీ నీషామ్ 137-నాటౌట్
సంక్షిప్తంగా స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 52.5 ఓవర్లలో 192 ఆలౌట్.
భారత్ తొలి ఇన్నింగ్స్: 102.4 ఓవర్లలో 438 ఆలౌట్.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 210 ఓవర్లలో 680/8 డిక్లేర్డ్ (హమీష్ రూథర్‌ఫర్డ్ 35, టామ్ లాథమ్ 29, బ్రెండన్ మెక్‌కలమ్ 302, బిజె.వాట్లింగ్ 124, జిమీ నీషామ్ 137-నాటౌట్).
వికెట్ల పతనం: 1-1, 2-27, 3-52, 4-87, 5-94, 6-446, 7-625, 8-639. బౌలింగ్: జహీర్ ఖాన్ 5/170, మహ్మద్ షమీ 2/149, రవీంద్ర జడేజా 1/115.
భారత్ రెండో ఇన్నింగ్స్: 52 ఓవర్లలో 166/3 (మురళీ విజయ్ 7, శిఖర్ ధావన్ 2, చటేశ్వర్ పుజారా 17, విరాట్ కోహ్లీ 105-నాటౌట్, రోహిత్ శర్మ 31-నాటౌట్).
వికెట్ల పతనం: 1-10, 2-10, 3-54. బౌలింగ్: టిమ్ సౌథీ 2/50, ట్రెంట్ బౌల్ట్ 1/47.