విశాఖపట్నం, ఫిబ్రవరి 18: కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ప్రజలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమించారు. రోడ్లెక్కి నినదించారు. నిరాహార దీక్షలు చేశారు. నిరసనలు చేపట్టారు. రహదారులను దిగ్బంధించారు. జీతాలు రాకపోయినా, నెలల తరబడి ఉద్యమాన్ని నడిపించారు. మహిళలు కూడా సమైక్య రాష్ట్రం కోసం ప్రాధేయపడ్డారు. విద్యార్థులు ప్ల కార్డులు పట్టుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని వేడుకున్నారు. కొంతమంది ఆత్మ హత్య చేసుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మనసు కరుగలేదు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. పార్టీ కాదు.. ప్రజలే అధిష్ఠానం అంటూ ప్రజలను చివరి వరకూ నమ్మించి, ఇప్పుడు వారిని నట్టేట ముంచారు కాంగ్రెస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాల్చేసి, రాష్ట్రాన్ని నిలువునా రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీలోనే కడవరకూ కొనసాగారు. పదవులన్నీ అనుభవించారు. అంతా అయిపోయిన తరువాత అమ్మ పార్టీని తిట్టుకుంటూ బయటకు వచ్చి, ఆపార్టీకి రాజీనామా చేశామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. జూలై 30న రాష్ట్ర విభజనపై ప్రకటన వెలువడిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదు. రాజీనామాలపై ఉద్యోగ సంఘాలు పదే పదే ఎంపిలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు హెచ్చరిస్తూ వస్తున్నా, అధికార దాహంతో వాటిని వదులుకోలేక, చివరకు ప్రజల మనోభావాలను పాతాళంలోకి తొక్కేసి, ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీస్తున్నారు. రాష్ట్ర విభనను సాకుగా చూపి, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, వేర్వేరు పార్టీలతో చేతులు కలిపి, వారి రాజకీయ భవిష్యత్‌కు పునాది వేసుకున్న ప్రజా ప్రతినిధులు, ప్రజల భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించలేకపోయారు. వారానికి ఆరు రోజులు హైదరాబాద్, ఢిల్లీల్లోనే ఉన్న వీరు రాష్ట్రం సమ్యైంగా ఉంచేందుకు ఏం చేశారో తెలియదు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అప్పుడే రాజీనామా చేసేశామని చెప్పిన కొందరు ప్రజా ప్రతినిధులు అధికార హోదాను ఇప్పటి వరకూ అనుభవించారు. మళ్లీ మంగళవారం మరో రాజీనామా కాగితాన్ని పార్టీకి, స్పీకర్‌కు ఇచ్చి సొంత నియోజకవర్గాలకు బయల్దేరి వచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందంటూ ఆపార్టీని విడిచిపెట్టి వేర్వేరు పార్టీలోకి చేరడానికి ముహూర్తాలను నిర్ణయించుకున్నారు ఇంత జరిగాక, ప్రజలకు ఏవిధంగా వీరు ఏవిధంగా ముఖం చూపిస్తారు? కాంగ్రెస్ పార్టీపై వీరు ఇప్పుడు కొత్తగా విమర్శలు గుప్పిస్తే, ప్రజలు నమ్ముతారా?
* నేతలు చెపుతున్న మాట ఇది * అంతా అయిపోయాక రాజీనామాలు
english title:
n
Date:
Wednesday, February 19, 2014