విశాఖపట్నం, ఫిబ్రవరి 18: విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదంతో చోటుచేసుకున్న పరిణామాలు మంగళవారం నాడిక్కడ కొంత ఉద్రిక్తతకు దారితీశాయి. మద్దిలపాలెం కూడలిలో జివిఎంసి ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని మంత్రి గంటా చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు నిర్ణయించగా, మధ్యాహ్నమే విభజన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఢిల్లీలో ఉన్న మంత్రి గంటా తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారన్న వార్తలు వెల్లడికావడం, మంత్రి పర్యటన వాయిదా పడినట్టు భావించారు. అయితే సాయంత్రం మంత్రి విశాఖ వస్తున్నారని, విగ్రహావిష్కరణ ఉంటుందన్న ప్రచారం జరిగింది. అయితే బిల్లుకు పార్లమెంట్ ఆమోదంతో సాయంత్రం 5 గంటల సమయంలో ఆర్టీసీ కార్మికులు, వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు మద్దిలపాలెంలో నిరసన ప్రదర్శనకు తరలివచ్చాయి. తొలుత ఆర్టీసీ కార్మికులు కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహం వద్దకు ఆర్టీసీ కార్మికులు చేరుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకానొక దశలో ఆర్టీసీ కార్మికులు, పోలీసులు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తాము తెలుగుతల్లి పాదాలు పట్టుకుని క్షమాపణలు కోరాలని పట్టుబట్టారు. దీనికి పోలీసులు అంగీకరించలేదు. ఇది జరుగుతున్న తరుణంలోనే పక్కనే ఉన్న వైకాపా కార్యాలయంలో ఉన్న ఆపార్టీ మహిళా నేతలు పెద్ద సంఖ్యలో తెలుగుతల్లి విగ్రహం వద్దకు చేరుకున్నారు. బ్లాక్ డే ఫ్లకార్డులతో, నోటికి నల్లని గుడ్డలు ధరించి వచ్చిన వైకాపా కార్యకర్తలు తెలుగుతల్లి విగ్రహాన్ని చేరుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు మరోసారి వారిని అడ్డుకున్నారు. సమారు అరగంట పాటు పోలీసులు, వైకాపా మహిళా కార్యకర్తల మధ్య వాగ్వాదం కొనసాగింది. ఇదే తరుణంలో కొంతమంది వైకాపా ప్రతినిధులు తెలుగుతల్లి విగ్రహానికి వేసిన తెల్లని వస్త్రాన్ని బలవంతంగా చించేశారు. విగ్రహం మొహం మినహా వస్త్రాన్ని తొలగించగా, అక్కడే సమైక్య నినాదాలు చేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి ఒకరు మొహంపై వస్త్రాన్ని కూడా తొలగించడంతో ఆవిష్కరణ పూర్తయినట్టైంది. అయితే పోలీసులు మాత్రం విద్యార్థిని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడే వైకాపా శ్రేణులు బైఠాయించాయి. పరిస్థితి అదుపులో ఉందని భావించిన పోలీసులు ఏమరుపాటుగా ఉన్న సందర్భంలో మహిళా కార్యకర్త విగ్రహం పైకి చేరుకుని పూలమాలవేసి మిగిలిన తంతును పూర్తి చేశారు. మంత్రి గంటా రాకుండానే తెలుగుతల్లి విగ్రహావిష్కరణ పూర్తయినట్టైంది.
* విగ్రహం ముసుగును తొలగించిన వైకాపా * మద్దిలపాలెంలో ‘గంట’హైడ్రామా * పోలీసులు సమైక్య వాదుల మధ్య తోపులాట * విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
english title:
t
Date:
Wednesday, February 19, 2014