Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కంప్యూటర్ ఆమెగా మారినవేళ ...

$
0
0

*** హర్ (బాగుంది)

తారాగణం:
జాక్విన్ ఫోనిక్స్, అమీ ఆడమ్స్
మనీమారా, ఒలివిటా విల్డ్
సార్లెట్ జాన్సన్ తదితరులు
సంగీతం: ఆర్కెడ్ ఫైర్
ఫొటోగ్రఫీ: హొటే వాన్ హొటెమా
దర్శకత్వం: స్పైక్ జోంజ్.

మానవుడు కనిపెట్టిన విజయాలలో కంప్యూటర్ ఒకటి. మానవుని అనేకానేక కార్యక్రమాలను, అతడు ఎదుర్కొనే సమస్యలను అతి వేగంగా, అతి సులభంగా పరిష్కరించే కంప్యూటర్ జీవితంలో ఒక భాగమయింది. అన్నిరకాల అలవాట్లను, అన్నిరకాల వినోదాలను త్రోసివేసి ఆ స్థానాన్ని కంప్యూటర్ ఆక్రమించింది. ప్రస్తుతం కంప్యూటర్ సరికొత్త వ్యసనంగా తయారయింది. మానవుని అధీనంలో ఉండాల్సిన కంప్యూటర్, ఇప్పుడు మానవుడ్నే తన ఆధీనంలోకి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. చివరకు కంప్యూటర్ కుటుంబ జీవితంలోకి, వ్యక్తిగత జీవితంలోకి ఎలా చొచ్చుకుని వచ్చిందో ‘‘హర్’’ చిత్రంలో అద్భుతంగా చిత్రీకరించారు.
‘‘హర్’’ చిత్రంలో- కంప్యూటర్ ప్రోగ్రాంలు తయారుచేసే థియోడర్ వివాహబంధం విచ్ఛిన్నమైన బాధను మరిచిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. బహుశా అది 2025నాటి కాలం కావచ్చు. ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్ ఎంత ఉన్నత స్థాయికి చేరుకుందంటే మనుషులతో మాట్లాడే దానికి, కంప్యూటర్‌తో మాట్లాడే దానికి తేడా లేకుండా పోతుంది.
థియోడర్ తన కంప్యూటర్లో అమర్చుకున్న కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, అతనికి వచ్చిన వేలకొద్ది ఇ-మెయిల్స్‌కు సమాధానమిస్తుంది. అతని ఉత్తరాలకు ప్రూఫ్‌రీడింగ్ చేస్తుంది. అతని జోక్స్‌కు నవ్వుతుంది. అద్భుతంగా పనిచేస్తుంది. ఆత్మీయంగా, ప్రేమగా మాట్లాడుతుంది. ప్రేమ - జీవితం గురించి చర్చిస్తుంది. థియోడర్ దానికి సుమంతా అనే పేరు పెట్టుకుంటాడు. నిద్రలో, మెలకువలో సుమంతాతో మాట్లాడుకోవడమే. తన ఇష్టాఇష్టాలు, తన కోపతాపాలు, తన ఉద్వేగాలు అన్నీ సుమంతాతోనే పంచుకుంటాడు. సుమంతా లేనిదే ఒక్క నిముషం కూడా వుండలేని పరిస్థితి వచ్చేస్తుంది.
సుమంతాతో ఏర్పరచుకున్న అనుబంధంవల్ల థియోడర్‌లో కొత్త ఉత్సాహం, సంతోషం వెల్లివిరుస్తాయి. అయితే బ్రిటీష్ కమీషనర్ అభివృద్ధి పరిచిన ఆపరేటింగ్ సిస్టమ్‌తో సుమంతా సంబంధాన్ని ఏర్పరచుకుని తనను నిర్లక్ష్యం చేయడం థియోడర్ భరించలేకపోతాడు. అప్పుడు సుమంతా తాను ఇతర ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కలిసి అప్‌డేట్ కాక తప్పదనీ, దానివల్ల తమ విధులు కూడా మారే అవకాశముందని తెలియజేస్తుంది. తనలాగే ఇతరులతో సాన్నిహిత్యం ఏర్పరచుకుంటే భరించలేనని చెబితే, నేనింతవరకు 8,316 మందితో మాట్లాడాననీ, అందులో 641 మందితో ప్రేమలో పడ్డానని చెబుతుంది. ఏది ఏమైనా థియోడర్‌తో ఉన్న ప్రేమలో ఎలాంటి మార్పులేదని చెబుతుంది. వాటికి అప్పజెప్పిన పనులు, కార్యక్రమాలు ముగియడంతో ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ తప్పుకుంటాయ్. అలా సుమంతా గుడ్‌బై చెప్పడంతో థియోడర్ స్పృహలోకొస్తాడు. దాంతో కుటుంబ సంబంధాల గురించి పునరాలోచనలో పడిన థియోడర్ తను ఇంకా కేథరీన్‌ను ప్రేమిస్తున్నానని గ్రహించి, ఆమెతో కలిసి వుండటానికి ప్రతిపాదనను పంపివేస్తాడు.
ఇదంతా థియోడర్ ఒక్కని జీవితమే కాదు. థియోడర్ జీవితంలోకి నలుగురు స్ర్తిలు వస్తారు. మొదటి స్ర్తి థియోడర్ మాజీ భార్య కేథరీన్. తన గర్ల్‌ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలైన కేథరీన్ విడిపోవడానికి నిశ్చయించుకుంటుంది. ఆమె విడాకులకోసం ఎదురుచూస్తూ, ఒకసారి థియోడర్‌ను కలిసినప్పుడు సుమంతా ప్రస్తావన వస్తుంది. నిజ జీవితంలో కంటే నీవు కాల్పనిక జీవితంలోనే కాలం గడుపుతావని ఆమె తేల్చివేస్తుంది. తర్వాత అతని సెక్స్ జీవితం గురించి ఆలోచించిన సుమంతా, ఒలివియాను ఎంపిక చేసి పంపిస్తుంది. కాని వారి డేటింగ్ ఘోరంగా విఫలమవుతుంది. ఇక ఆఫీసులో పనిచేసే స్నేహితురాలు అమీ ఆడమ్స్‌తోవున్న పరిచయం, స్నేహంగానే మిగిలిపోతుంది.
ఈ చిత్రం ఒంటరి జీవితాల గురించి చెబుతుంది. అపార్ట్‌మెంట్లలో నివసిస్తూ ఆఫీసుల్లో పనిచేస్తూ సెన్సిటివ్‌గా వున్న వ్యక్తుల ఒంటరితనానికి హీరో ప్రతినిధిగా కనిపిస్తాడు. బిడియస్తుడు, అంతర్ముఖుడిగా కనిపించే థియోడర్ పాత్రలో జాక్విన్ ఫోనిక్స్ అద్భుతంగా నటించారు. ప్రేమ రాహిత్యం, ఒంటరితనంవల్ల మనుషులలో చోటుచేసుకుంటున్న యాంత్రికత, కృత్రిమత్వాన్ని ఈ చిత్రం చర్చకు పెట్టింది. ఆ దిశగా ఆలోచింపచేస్తుంది. విమర్శకుల మెప్పును పొందిన ఈ చిత్రాన్ని, 2013లో నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్‌వారు ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు. లాస్ ఏంజెలీస్ ఫిలిం క్రిటిక్ అసోసియేషన్‌వారు ‘గ్రావిటీ’తోపాటు ఈ చిత్రాన్ని కూడా ఉత్తమ చిత్రంగా ఎన్నుకున్నారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ నటుడికి గాను గోల్డెన్ గ్లోబ్ నామినేషన్లను పొందిన ఈ చిత్రం, చివరకు ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును పొందింది. ఆస్కార్ అవార్డుల పోటీలో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లేలతో కలిసి మొత్తం అయిదు నామినేషన్లను పొందడం విశేషం.

మానవుడు కనిపెట్టిన విజయాలలో కంప్యూటర్ ఒకటి
english title: 
her
author: 
- కె.పి.అశోక్‌కుమార్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>