ఒంగోలు, ఫిబ్రవరి 21: రాష్టవ్య్రాప్తంగా ఆక్వా సాగుకు కాలం కలిసొస్తోంది. ఆక్వా సాగు వైపు బడాపారిశ్రామికవేత్తలనుండి సన్నకారు రైతుల వరకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా సాగును విస్తారంగా చేపట్టారు. గతంలో ఎందుకూ పనికిరాని బీడు భూములను సైతం రొయ్యల చెరువులను చేసే పనిలో రైతులు పడ్డారు. చైనా, వియత్నాం, ధాయ్‌లాండ్, మలేషియా తదితర దేశాల్లో వెనామి సాగు వర్ల మెటాల్టి సిండ్రోమ్ అనే వ్యాధితో దెబ్బతినటంతో రాష్ట్రంలో పండించే వెనామి సాగుకు డిమాండ్ పెరిగింది. దీంతో ఈపాటికే కొంతమంది ఆయా దేశాలకు మన ఆక్వా సంపద ఎగుమతి చేసి కోట్లు గడించారు. గతంలో బీడు భూములుగా ఉన్న వాటిని, ప్రకాశం జిల్లాలోని ఉప్పు కొఠారు భూములను సైతం రొయ్యల చెరువుగా మార్చి సాగుచేస్తున్నారు. ఉప్పు ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ రైతులు ఆకాశాన్ని అంటుతున్న రొయ్యల ధరలను చూసి ఆ సాగు వైపు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం 30కౌంట్ వెనామి రొయ్య ఆరువందల రూపాయలకు పైగానే ధర పలకడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. గతంలో 30కౌంట్ రొయ్యల దిగుబడుల వైపు రైతులు చూసే వారుకారు. కాని వందకౌంట్ రొయ్యలు దిగుబడులు వస్తేనే పంటను తీసివేసి సొమ్ము చేసుకుని అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం వంద కౌంట్ వెనామి రొయ్యలు 350 రూపాయల వరకు పలుకుతున్నాయి. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే ఈ కౌంట్ వస్తుండటంతో సంవత్సరానికి మూడుపంటలు సాగుచేసేందుకు రైతులు సమయాత్తవౌతున్నారు. ఒక్కొక్క హెక్టారు చెరువుకు సుమారు 15లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుండటంతో రైతులు ఆక్వాసాగువైపు పరుగులు తీస్తున్నారు. ఈరేట్లు మరికొంతకాలం ఉండనుండటంతో రైతులు బంగారం పండే పొలాలను సైతం చెరువులుగా మారుస్తూ లక్షల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇదిలాఉండగా గతంలో ఎందుకూ పనికిరాని చెరువులకు మంచి గిరాకి ఏర్పడింది. ఒక్కొక్క హెక్టారు చెరువుకు ఏరియేటర్లు, విద్యుత్, ఇంజన్ల సౌకర్యం ఉంటే రెండులక్షల రూపాయల వరకు కౌలు ఇస్తున్నారు. కౌలుకు రొయ్యల చెరువులను తీసుకునేందుకు కౌలుదారులు ముందుకొస్తున్నారు. కొంతమంది రొయ్యల చెరువులను సంవత్సరానికి కౌలుకు ఇస్తుండగా మరికొంతమంది 50శాతం భాగానికి ఇస్తున్నారు. అదేవిధంగా గతంలో రొయ్యల ధరలు పతానావస్ధకు చేరటంతో రొయ్యల చెరువులను సాగుచేసేవారు లేకపోవటంతో కోస్తా తీరప్రాంతంలోని రొయ్యపిల్లలు ఉత్పత్తిచేసే హేచరిలు మూతపడ్డాయి. కాని ప్రస్తుతం ఉన్న ధరలకు రొయ్యపిల్లలు ఉత్పత్తిచేసే హేచరీల యజమానులు లాభాలబాట పట్టారు. ప్రస్తుతం ఒక్కొక్క రొయ్యపిల్ల 50 పైసల నుండి 60 పైసల వరకు పలుకుతోంది.
బీడు, ఉప్పుకొఠారు భూములను చెరువులుగా మారుస్తున్న రైతులు
english title:
a
Date:
Saturday, February 22, 2014