
శ్రీకాకుళం, ఫిబ్రవరి 21: ఐదు దశాబ్దాలుగా రగులుతున్న వంశధార నదీజలాల వివాదంపై ఒడిశా ప్రభుత్వం మనసు మార్చుకుంది. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రాథమికంగా అంగీకరించినట్టు సమాచారం. వంశధారపై ఏర్పాటైన ట్రిబ్యునల్ చైర్మన్ ముకుందంశర్మ ఆధ్వర్యంలో ఉభయ రాష్ట్రాల ఇంజనీర్లు ఏ మూహూర్తాన కాట్రగడ్డ - సరా ప్రాంతాల్లో అడుగుపెట్టి సర్వే చేశారో కానీ, ఎట్టకేలకు బంగాళాఖాతంలో కలుస్తున్న వంశధార వరద జలాలను పొలాలకు మళ్లించడానికి మార్గం సుముగమైంది. ట్రిబ్యునల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను గమనించిన తర్వాత ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా భామిని మండలం కాట్రగడ్డ నుంచి మళ్లింపు కాలువ ద్వారా 8 టిఎంసిల వంశధార వరద నీటిని వాడుకునేందుకు తీర్పు వెల్లడించింది. నేరడి వద్ద బ్యారేజీ నిర్మిస్తే వంశధార వరద జలాలు మరింతగా సద్వినియోగం అవుతాయనే దిశగా దృష్టి పెట్టింది.
1962లోనే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టగా అప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజకీయ ఎత్తుగడలతో ఒడిశా అడ్డుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ట్రిబ్యునల్ మరింత చొరవ చూపుతుండటంతో వంశధార జలాలు తమ ప్రాంతంలో కూడా వినియోగించుకుంటే మేలు జరుగుతుందన్న భావనకు ఒడిశా ప్రభుత్వం వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ బ్యారేజీ నిర్మిస్తే ఒడిశా వైపు నష్టం కంటే మేలు ఎక్కువగా జరుగుతుందన్న వాస్తవాలను ఆ రాష్ట్రం గ్రహించింది. నదీజలాల వాటాగా 52 టిఎంసిల నీటిని ఒడిశా వినియోగించుకునేందుకు వీలుగా కాలువలు నిర్మించి, అన్ని ఏర్పాట్లు చేస్తామంటూ ఆంధ్రా జలవనరుల కమిటీ సూచించడంతో ఒడిశా ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లు సమచారం. వరద సమయంలో ఆంధ్రావైపు మళ్లించడం ద్వారా ఒడిశాలోని కాశీనగర్ బ్లాక్‌లో పలు గ్రామాలకు వరద ముంపు తప్పుతుందని భావించే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ట్రిబ్యునల్ బృందం ఇరు రాష్ట్రాల వాదప్రతివాదనలు నమోదు చేసుకునేందుకు మార్చి 20న రానున్నట్టు తెలిసింది. నేరడి వద్ద బ్యారేజీ నిర్మిస్తే వంశధార నదీ పరివాహక ప్రాంతం (ఒడిశాలో) 13 కిలోమీటర్లు ముంపునకు గురవుతుందని ఇప్పటి వరకూ ఒడిశా వాదించింది. అయితే, గొట్టా వద్ద బ్యారేజీ నిర్మించిన తర్వాత ఒడిశాకు వచ్చిన వరదను పరిశీలిస్తే దాని ప్రభావం బ్యారేజీ పైభాగంలో కనీసం కిలోమీటరులో కూడా లేదని ట్రిబ్యునల్ గమినించినట్లు సమాచారం. అదే ప్రస్తుతం నేరడి వద్ద బ్యారేజీ నిర్మించి గొట్టాబ్యారేజీకి ఇరువైపుల రక్షణ కల్పించిన మాదిరిగానే అక్కడ కూడా కల్పించి కొత్త డిజైన్‌ను రూపొందిస్తే నదికి ఇరువైపులా నష్టం ఉండదని అంచనా వేస్తున్నారు. ఇదే షరతులతో ఉభయ రాష్ట్రాలు అంగీకరిస్తే వంశధార నదీజలాలు ఇరుప్రాంతాల భూములను సస్యశ్యామలం చేస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 20న వంశధార నదీజలాల ట్రిబ్యునల్ చైర్మన్ ముకుందశర్మతోపాటు బిఎస్ చతుర్వేది, గులాం మహ్మద్, వై రాజగోపాలరావు, ఎం సుబ్రహ్మణ్యం, ఎస్‌కె సిన్హా, ఎ భరధ్వాజ, సిఎస్ వైద్యనాథం ఒడిశాలోని సరా, బడిగాం ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. ట్రిబ్యునల్‌తోపాటు కేంద్ర జలనవనరుల సంఘం ఇంజనీర్లు కూడా నేరడి (ఆంధ్రా) - సరా (ఒడిషా) ప్రాంతాల మధ్య వంశధారపై నిర్మించనున్న బ్యారేజీ పనులకు అనుకూల, ప్రతికూల పరిస్థితులు గమనించి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం నేరడి వద్ద బ్యారేజీ పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉంటాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత ఏడాది ఏప్రిల్ 23న వంశధార నదీజలాల ట్రిబ్యునల్ బృందం ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుది నివేదిక సమర్పించింది. దాని ఫలితంగానే ఎనిమిది టిఎంసిల నీటిని వినియోగించుకోచ్చని, కాట్రగడ్డ వద్ద నిర్మించనున్న సైడ్ వ్యూయర్, వరద కాల్వ , హిరమండలం వద్ద జలాశయం పనులు కొనసాగించాలంటూ గత ఏడాది డిసెంబరులో ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. నేరడి వద్ద బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతాన్ని, కాడ్రగడ్డ వద్ద సైడ్ వ్యూయిర్ నిర్మించనున్న ప్రాంతాన్ని ట్రిబ్యునల్ పరిశీలించినప్పుడు రిజర్వాయర్ నిర్మాణం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆంధ్రా అధికారులు తెలుపగా, ఈ బ్యారేజీ నిర్మాణం ద్వారా 13 కిలోమీటర్లు మేర ముంపునకు గురవుతుందని ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది.
.....................
శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద కాలువ తవ్వాల్సిన
ప్రదేశాన్ని పరిశీలిస్తున్న వంశధార ట్రిబ్యునల్ బృందం (ఫైల్ ఫొటో)