
కర్నూలు, ఫిబ్రవరి 21: శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు శుక్రవారం రాత్రి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం చండీశ్వరపూజ నిర్వహించారు. నిత్యహోమ బలిహరణ, జపానుష్ఠానములు, స్వామి వారికి విశేషార్చనలు, అమ్మవారికి నవావరణ నామార్చనలు నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, చండీహోమం, నిత్యపూజలు, అనుష్టానములు, నిత్యహవాన కార్యక్రమలు జరిపించారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హంసవాహనంపై ఆశీనులనుచేశారు.
అనంతరం జయజయధ్వానాల మధ్య ఆలయం చుట్టూ గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో గ్రామోత్సవాన్ని తిలకించారు. గ్రామోత్సవం ముందుభాగంలో భక్తుల కోలాటాలు, డప్పు నృత్యాలు, విచిత్ర వేషధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు పెద్దఎత్తున శివభక్తులు శ్రీగిరికి చేరుకుంటున్నారు. శివరాత్రి నాటికి శ్రీశైలంలో సుమారు 12 లక్షల మంది భక్తులు ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరందరికి వసతి సౌకర్యాల కల్పనకు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. అవసరమైతే తాత్కాలిక ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
వివాదంలో ఆలయ కమిటీ
శ్రీశైలం ఆలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ఎంపికలో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కమిటీ ఎంపికకు సంబంధించిన ఫైలుపై అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేసిన తరువాత కమిటీ సభ్యుల్లో ఒకరి పేరు తొలగించి మరొకరి పేరు చేర్చినట్లు తెలుస్తోంది. సంబంధిత శాఖ మంత్రి ఈ మార్పులు చేర్పులు దగ్గరుండి మరీ చేయించినట్లు సమాచారం. దీంతో కమిటీలో స్థానం కోల్పోయిన సభ్యుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా ఈ విషయంపై దేవాలయ అధికారులు మాట్లాడుతూ తమ వద్దకు వచ్చిన ఆదేశాల ప్రకారమే తాము ప్రమాణ స్వీకారం చేయించామని హైదరాబాదులో ఏం జరిగిందో తమకు తెలియదని పేర్కొన్నారు.
.....................................
హంసవాహనంపై ఊరేగుతున్న పార్వతీపరమేశ్వరులు. మల్లన్న, భ్రమరాంబికకు హంసవాహనంపై గ్రామోత్సవం