కర్నూలు, ఫిబ్రవరి 22 : రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు కొత్త రాజధాని అంశంపై జిల్లాలో రగడ రాజుకుంటోంది. 1953లో మాదిరిగానే కర్నూలులో కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలన్న డిమాండు పెరుగుతోంది. కర్నూలు లేదంటే రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ గత కొంతకాలంగా రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేస్తున్న విషయం విధితమే. ఇతర అన్ని రాజకీయ పార్టీలు సమైక్య బాటలో ఉన్నప్పటికీ సమైక్య ఉద్యమం ప్రయోజనమివ్వదని రాయలసీమ ప్రయోజనాల కోసం పోరాడాలంటూ ఆర్పీఎస్ తరపున ఆయన అన్ని రాజకీయ పార్టీల నేతలకు లేఖలు రాశారు. దీంతోపాటు పలు రకాల యాత్రలు నిర్వహించారు. రాజధాని ఇవ్వకపోతే సీమ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక రాష్ట్రం విడిపోవడంతో తెలుగుదేశం పార్టీ కర్నూలులో రాజధానికి ఏర్పాటు చేయాలంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పోరుబాటకు శ్రీకారం చుట్టింది. గతంలో చేసిన త్యాగాలకు ఫలితంగా 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా గతంలో కలిసిన తెలంగాణ ఇపుడు విడిపోయిన సందర్భంగా తిరిగి పాత పద్ధతిలో కర్నూలులో రాజధానిని ఎ ంపిక చేయాలన్న డిమాండ్ చేస్తోంది. తాజాగా రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాల్సిందేనని, లేదంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. వైకాపా సైతం రాయలసీమకు రాజధాని అంశంపై ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. వామపక్ష పార్టీలో సిపిఐ ఇప్పటికే రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ స్వరాన్ని వినిపిస్తోంది. కేవలం రాష్టప్రతి ఆమోదం మినహా ఇతర అన్ని అడ్డంకులను దాటుకున్న విషయం విధితమే. ఈ తంతు ముగిసిన తరువాత కేంద్రం కొత్త రాజధాని అంశాన్ని చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈలోగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని ఆక్షణం నుంచి నిబంధనావళి అమలులోకి వచ్చి రాజధాని అంశం తెర వెనక్కి పోతుందని నాయకులు పేర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాకే కొత్త రాజధాని ఎంపిక బాధ్యతను స్వీకరిస్తుందని ఈలోగా కర్నూలులో రాజధాని ఏర్పాటు అంశాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదే అంశంపై రానున్న ఎన్నికల్లో ప్రజలకు వాగ్దానం కూడా చేయాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయని వెల్లడిస్తున్నారు. కాగా రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు ముందుకు రానిపక్షంలో కేంద్రంపై మరో పోరాటానికి సిద్ధపడక తప్పదన్న భావన జిల్లా నేతల్లో వ్యక్తమవుతోంది. ఉద్యమాన్ని ప్రారంభిస్తే సమైక్య ఉద్యమం కంటే ఎక్కువగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
సీమకు న్యాయం చేయకపోతే
ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట
* కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
బేతంచెర్ల, ఫిబ్రవరి 22: విభజన నేపధ్యంలో రాయలసీమకు న్యాయం చేయకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పట్టుబడతామని రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా బేతంచెర్లలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోరుతూ మరో ఉద్యమానికి తానే స్వయంగా నాయకత్వం వహిస్తానని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తొందరపాటు చర్యే అన్నారు. అయితే విభజనకు సిపిఎం మినహా మిగతా అన్నిపార్టీలు బాధ్యత వహించినట్లేనన్నారు. బిజెపి నాటకమాడిందన్నారు. సీమాంధ్ర రాజధానిని కర్నూలులో మళ్లీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చెప్పామన్నారు. విభజనతో సీమాంధ్రలో సాగు, తాగునీటి సమస్య తీవ్రమవుతుందన్నారు. తుంగభద్ర, గోదావరి, కృష్ణా జలాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదాతోపాటు ప్యాకేజీకి మూడు నెలల గడువు ఉందని, ఈ విషయంలో సీమాంధ్రకు ఏదైనా అన్యాయం జరిగితే సోనియా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
రాజధాని లేదంటే ప్రత్యేక రాష్టమ్రే
* తాజా మాజీమంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఫిబ్రవరి 22 : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు, తాజా మాజీమంత్రి టిజి వెంకటేష్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ప్రకటించాలని అన్నారు. 1953లో మాదిరి కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కర్నూలులో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర రాజధానిగా సీమలో ఏదో ఒక నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాస్తవానికి తాము ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేయాల్సి ఉందన్నారు. అయితే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటూ పోతే దేశం బలహీన పడుతుందన్న నేపథ్యంలో ఆ డిమాండ్ చేయడం లేదన్నారు. ఒక వేళ సీమకు రాజధాని ఇవ్వని పక్షంలో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని టిజి హెచ్చరించారు. తెలుగు వారందరికీ ఒక రాష్టమ్రంటే గతంలో కర్నూలులో ఉన్న రాజధానిని హైదరాబాదుకు మార్చేందుకు సహకరించి త్యాగం చేశామన్నారు. అప్పట్లోనే లక్షల కోట్ల అభివృద్ధిని కోల్పోయామన్నారు. ఇప్పుడు తెలుగువారు రెండు ముక్కలయిన సందర్భంగా పాత పద్దతిలో కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఇందుకు అంగీకరించని పక్షంలో రెండు ముక్కలైన రాష్ట్రం మరెన్ని ముక్కలైనా ఇబ్బందేమీ ఉండదన్నారు. రాయలసీమలో అపారమైన బంగారం, వజ్రాలు, ఐరన్‌ఓర్ నిక్షేపాలు ఉన్నాయని, నల్లమల అడవులు, వాయు, సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసమైన ప్రకృతి సంపద దండిగా ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం వేలాది ఎకరాలు, వందలాది గ్రామాలను త్యాగం చేసి ఇతర ప్రాంతాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నామని వెల్లడించారు. కాంగ్రెస్, బిజెపిల కారణంగా తెలుగువారు రెండు రాష్ట్రాల్లో నివసించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటుకు అన్ని ప్రాంతాల వారు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. గ్రేటర్ రాయలసీమ డిమాండ్‌పై స్పందిస్తూ ప్రకాశం, నెల్లూరు జిల్లాల నాయకులు అందుకు సుముఖంగా లేరన్నారు. దీనిపై ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ రెండు జిల్లాల్లో మెజారిటీ ప్రజలు రాయలసీమలో కలవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోందన్నారు. ఎవరినీ బలవంతపెట్టే ఉద్ధేశ్యం లేదని టిజి అన్నారు. నాలుగు జిల్లాల రాయలసీమకే ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఆ రెండు జిల్లాల ప్రజలు అంగీకరిస్తే రాయలసీమలో కలుపుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని టీజీ వివరించారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు
* కోట్ల రైల్వేస్టేషన్‌లో నూతన భవనాలు ప్రారంభం
* భూగర్భ, ఫ్లైఓవర్‌కు శంఖుస్థాపన
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఫిబ్రవరి 22 : జిల్లాలో రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు నిరంతరం శ్రమించినట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శనివారం నగరంలోని కోట్ల రైల్వేస్టేషన్‌లో రూ.56 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాలు, ఫ్లాట్‌ఫాం, బుకింగ్ కౌంటర్లను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు గుత్తి రోడ్డులో రూ.46కోట్లతో నిర్మించనున్న ఫ్లైఓవర్, కృష్ణా నగర్‌లో రూ.2.80కోట్లతో నిర్మించనున్న భూగర్భ వంతెనల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తాను రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు దక్షిణ మధ్య రైల్వేకు తీరని అన్యాయం జరిగేదని గుర్తు చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే దక్షిణ మధ్య రైల్వేలో ప్రధానంగా రాష్ట్రంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చొరవ చూపానన్నారు. రాష్ట్రంలో ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు డోన్, బేతంచెర్ల, వెల్దుర్తి, కర్నూలులో ఫ్లైఓవర్లు, భూగర్భ వంతెనలు నిర్మించినట్లు తెలిపారు. వీటి నిర్మాణంతో రైలు మార్గంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడమే కాకుండా ప్రమాదాలను కూడా నివారించామని తెలిపారు. ఇక అనేక కొత్త రైళ్లను మంజూరు చేశామన్నారు. ఇందులో జిల్లా మీదుగా ఆరు రైళ్లు పరుగులు తీయనున్నాయన్నారు. వీటితో పాటు డోన్ నుంచి ఆదోని మీదుగా ముంబయి నగరానికి మరో రైలును మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది ఇంటర్‌సిటీ రైలును మంజూరు చేసిన విషయం గుర్తు చేశారు. అనేక రైళ్లకు ఆదోనిలో ఆగేలా సమయం కేటాయించామని తెలిపారు. గుత్తి, కాచిగూడ మార్గంలో డబ్లింగ్ పనులకు సర్వే చేయించడానికి, గుంతకల్, గుంటూరు మార్గంలో విద్యుద్దీకరణ పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజలు తనను ఎంపిగా గెలిపించి ఢిల్లీకి పంపితే ప్రధాని మన్మోహన్, సోనియా గాంధీలు తనకు రైల్వే శాఖ బాధ్యతలు అప్పగించి ప్రజాకాంక్షను నెరవేర్చడంలో శక్తి వంచన లేకుండా కృషి చేశానని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, రైల్వే అధికారులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రపంచస్థాయిలో రైల్వేకు గుర్తింపు
* రైల్వే సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి
బేతంచెర్ల, ఫిబ్రవరి 22 : ప్రపంచ స్థాయిలో భారతరైల్వే వ్యవస్థకు గుర్తింపు వచ్చేలా ఆధునీకరణ చేస్తున్నట్లు రైల్వే సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌లో హనుమాన్‌నగర్, సంజీవనగర్ కాలనీవాసులతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం రూ 78.5 లక్షలతో నిర్మించిన పాదచారుల వంతెనకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోట్లకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బేతంచెర్లతో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తాను రైల్వే సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి దేశస్థాయిలో రైల్వే గేట్ల విషయంలో 30 శాతం, మరుగుదొడ్ల విషయంలో 20 శాతం ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా హైదరాబాదు తిరుపతి, హైదరాబాదుగుంటూరు, హైదరాబాదు ముంబయికి ఎసి డబుల్ డెక్కర్ రైల్ సర్వీసులను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల అనంతరం ప్రస్తుత బడ్జెట్ ఆమోదం మేరకు కర్నూలుడోన్ ముంబయి, తిరుపతి, గుంతకల్లు, డోన్ సర్వీసులను క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. అలాగే బేతంచెర్ల మీదుగా వెళ్లే హౌరా యశ్వంతపూర్, హౌరా పుట్టపర్తి, అమరావతి ఎక్స్‌ప్రెస్‌లను బేతంచెర్ల ప్రజల కోరిక మేరకు రోజూ ఆగేలా చూస్తానని హామీ ఇచ్చారు. లోడింగ్ కార్మికుల కోరిక మేరకు విశ్రాంతి గది, మలమూత్ర గదులను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తమ దృష్టికి వచ్చిన అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అనంతరం బేతంచెర్ల పారిశ్రామిక కేంద్రం కావటంతో సాంకేతిక ఉపాధి అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎఐయస్‌ఎఫ్ నాయకులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ మంత్రి కోట్ల సూచనలతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా 88 మిలియన్ల ట్రాక్‌లను ఏర్పాటు చేశామన్నారు. మూడు వేల మిలియన్ల ప్రయాణికుల ద్వారా రూ 8650 కోట్ల రూపాయలు ఆదా యం లభిస్తోందన్నారు. కర్నూలులో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, డబల్ డెక్కర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
నా హయాంలోనే అభివృద్ధి
జాఫర్ హుస్సేన్ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కంటే ప్రస్తుత అభివృద్ధి మెరుగ్గా ఉందని కోట్ల అన్నారు. అనంతరం మాజీ జెడ్పిటిసి పోలూరు భాస్కరరెడ్డి స్థానిక రైల్వే స్టేషన్ నుండి రైల్వే వ్యాగన్ల ద్వారా నాపరాయి, రంగురాళ్లు, బేతంచెర్ల ఖనిజాలు ఇతర ప్రాంతాలకు పంపేందుకు పాత పద్ధతిని ప్రవేశ పెట్టమని కోరగా దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనెజర్ సునీల్ అగర్వాల్ సమాధానమిస్తూ ప్రస్తుతం డబల్ ర్యాక్, మల్టీ కమిటీ ర్యాక్ వ్యవస్థ నడుస్తోందని పాతపద్ధతి ప్రవేశపెట్టడం సాధ్యంకాదని తెలిపారు. ఈ సమావేశంలో డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, డిసిసి అధ్యక్షుడు బివై రామయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ జెడ్పిటిసి బుగ్గన ప్రసన్నలక్ష్మీతో పాటు రైల్వే అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల హామీ నెరవేర్చాం
ఎన్నికల సమయంలో బేతంచెర్లకు వచ్చినప్పుడు రైల్వే కమీలను దాటుతూ ఒక పసిపాప చనిపోయిన విషయాన్ని తన దృష్టికి తీసుకొస్తే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చానని డోన్ మాజీ ఎమ్మేల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాటలు చెప్పి ప్రజలను బుట్టలో వేసుకునే సంస్కృతి తమకు లేదని ఇచ్చిన హామీలు నెరవేర్చే కుంటుంబం మాది అన్నారు. ప్రజలే తమ ఆస్తులు అన్నారు. మీ ఆశీర్వాదాలే మాకు బలమన్నారు. అయితే ఒక పార్టీకి చెందినవారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రస్టుపేరుతో మాయమాటలు, మాయాజాలం సృష్టిస్తున్నారన్నారు. వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ రామస్వామి, రైల్వే డిఆర్‌ఎం మనోహార్ జోషి, డిసిసి అధ్యక్షుడు బివై రామయ్య, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ డిసిఎంఎస్ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, రైల్వే బోర్డు సంఘం సభ్యుడు ఎరుకలిచెరువు శివ, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు బుగ్గన ప్రసన్నలక్ష్మీ, భీమేశ్వరరెడ్డి, జిసి వెంకట్, మండల కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు శంకలాపురం బాలతిమ్మయ్య తదితరులతో పాటు రైల్వే శాఖ సిబ్బంది, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
మురళీధర్‌రెడ్డిని కలిసిన కోట్ల దంపతులు
బేతంచెర్ల పెద్దాయనగా పిలిచే పారిశ్రామికవేత్త బిఎస్ మురళీధర్‌రెడ్డిని కేంద్ర రైల్వే సహాయమంత్రి కోట్ల జయ దంపతులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. సుమారు అరగంట సేపు పెద్దాయన యోగక్షేమ సమాచారాలతో పాటు పలు విషయాలను తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హయాం నుండి పెద్దాయన కుటుంబంతో సన్నిహిత సత్సబంధాలు ఉండటంతో మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలిపారు.
ఆకాశ దీప దర్శనంతో
పులకరించిన భక్తులు
బనగానపల్లె, ఫిబ్రవరి 22 : మండలంలోని యాగంటి క్షేత్రంలో శనివారం సాయంకాలం వెలిగించిన ఆకాశదీపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆదిశేషు నాయుడు ఆధ్వర్యంలో అర్చకులు టంగుటూరి చంద్రశేఖర్ ఆలయం వెనుక వైపు సాహసోపేతంగా కొండపైకి చేరుకుని దీపాన్ని వెలిగించారు. శివరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండడంతో యాగంటికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. కర్నాటక నుండి కాలినడకన, వాహనాల్లో వెళ్తున్న భక్తులు యాగంటిని దర్శించుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో నాలుగు రోజుల నుండి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఆలయ ఇఓ ఆదిశేషు నాయుడు భక్తుల ఆలయం వద్ద సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నారు.
శివరాత్రి ఏర్పాట్లు
యాగంటిలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రం చేస్తున్నారు. రథాన్ని సిద్ధం చేస్తున్నారు. క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, ప్రసాదాల తయారీ, దర్శనాల వద్ద సౌలభ్యం తదితర పనులు జరుపుతున్నారు.