గుంటూరు, ఫిబ్రవరి 22: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వివరం సంబంధిత శాఖల అధికారులు వెంటనే పంపాలని జిల్లా కలెక్టర్ ఎస్ సురేకుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వివరాలతో కూడిన జాబితాను కార్యాలయాల, సంస్థల పరిధికి చెందిన తహశీల్దార్లకు అందజేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగుల అందరి వివరాలు పంపాలన్నారు. జాబితా పంపే సమయంలో ప్రతి ఉద్యోగి వివరాలు అందించినట్లు సంబంధిత జిల్లా స్థాయి శాఖాధిపతి నుండి ధృవపత్రం పొందాలని కలెక్టర్ తహశీల్దార్లకు సూచించారు. సాధారణ ఎన్నికల్లో ఎన్నికల విధులు కాకుండా అదనపు విధుల కోసం సుమారు 1600 మంది ఉద్యగులు అవసరమవుతారన్నారు. ఉద్యోగుల్లో డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు ఉన్నా వారి వివరాలను కూడా పంపాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణం నుంచి ప్రతి ఉద్యోగి భారత ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తామని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులంతా ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. బదిలీపై జిల్లాకు వచ్చిన తహశీల్దార్లంతా తప్పనిసరిగా వారికి కేటాయించిన మండల కేంద్రాల్లో నివాసం ఉండాలన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ కేంద్రాలను మార్చే అవకాశం లేనందున ప్రతి పోలింగ్ కేంద్రాన్ని జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచించారు. ఈ నివేదికలను 25వ తేదీ నాటికి అందించాలని కోరారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని ఎన్నికల నియమావళిని అమలు చేయడంలో, శాంతి భద్రతల పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.
బార్, బెంచ్‌ల మధ్య సత్సంబంధాలు అవశ్యం
మంగళగిరి, ఫిబ్రవరి 22: కేసుల పరిష్కారాలకు సంబంధించి కోర్టులో బార్, బెంచ్‌ల మధ్య సత్సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎం రఫి అన్నారు. మంగళగిరి కోర్టు ప్రాంగణంలో శనివారం నాల్గవ అడిషనల్ జిల్లా జడ్జి జి శ్రీనివాస్‌తో కలిసి తనిఖీలకు విచ్చేసిన ఎస్‌ఎం రఫి, బార్ అసోసియేషన్ న్యాయవాదులతో మాట్లాడారు. బార్ అధ్యక్షుడు లంకా శివరామప్రసాద్ అధ్యక్షత వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఫి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో కేసుల పరిష్కారం కొంతమేర జాప్యం జరిగిందని, కక్షిదారుల సేవలో న్యాయమూర్తులు, న్యాయవాదులు నిమగ్నమై ఇక పనిచేస్తే కేసుల పెండెన్సీ కూడా కొంత తగ్గుతుందని, కక్షిదారులకు వెసులుబాటు ఉంటుందని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న కోర్టు భవన నిర్మాణం పూర్తయిన వెంటనే న్యాయమూర్తులతో కలిసి ప్రారంభానికి కృషి చేద్దామని అన్నారు. మంగళగిరి కోర్టులో నెలకొన్న సమస్యలు న్యాయవాదులు జిల్లా జడ్జి దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కారానికి హామీ ఇచ్చారు. నాల్గవ అదనపు జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయవాదులు సహకరిస్తేనే కేసులు త్వరిత గతిన పరిష్కార మవుతాయన్నారు.
రైతు గర్జనను విజయవంతం చేయాలి
గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 22: జిల్లాలో మూడు లక్షల మంది రైతులతో రైతు గర్జనను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందని, రైతు గర్జనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం టిడిపి కార్యాలయంలోని ఎన్‌టిఆర్ భవన్‌లో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ రైతు సదస్సును బిఆర్ స్టేడియంలోగాని, జెకెసి కళాశాలలో గాని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్చి 2వ వారంలో ఈ కార్యక్రమం ఉంటుందని, 1994లో రైతుగర్జన విజయవంతమైనదని తెలియజేశారు. పలుచోట్ల ఎన్‌టిఆర్ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు. అలాగే ఈ సమావేశంలో మూడు పార్లమెంటు, శాసనసభ స్థానాలకు త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని తద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేందుకు సన్నద్దం కావాలన్నారు. పార్టీ విప్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సిపి, టిఆర్‌ఎస్ పార్టీలు చేసిన కుట్ర రాజకీయాలను ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేయాలని పదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని విమర్శించారు.
రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
తెనాలి, ఫిబ్రవరి 22: దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌లో తెనాలి రైల్వేస్టేషన్ ఎ1 స్టేషన్‌గా అభివృద్ధి చెందుతున్న క్రమంలోప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, రైల్వే ఆస్తుల పరిరక్షణ, రైల్వే క్వార్టర్స్‌లో వౌలిక వసతులకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే విజయవాడ డివిజన్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 7గంటలకు పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి చేరుకున్న డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్, వివిధ విభాగాల ఇన్‌చార్జిలు, అన్ని విభాగాల సిబ్బందితో రైల్వేస్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫారాలు, రైల్వే క్వార్టర్స్, రైల్వే బౌండరీలోని వివిధ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్‌లో నిర్మిస్తున్న లిఫ్ట్ నిర్మాణ పనులను పరిశీలించి, లోపాలను సవరించాలని సూచించారు. ఇటీవల గూడ్స్ షెడ్‌కు వెళ్లే ట్రాక్‌పైన గూడ్స్ రైల్ పట్టాలు తప్పిన క్రమంలో గూడ్స్ షెడ్‌కు వెళ్లే ట్రాక్‌లో ఉన్న లోపాలపై ఆరా తీశారు. ట్రాక్ కింద భాగంలో ఉన్న లోపాలు సవరించి, ట్రాక్ పటిష్ఠతకు సూచనలు చేశారు. 1వ నెంబర్ ప్లాట్‌ఫారం నుండి 2వ నెంబర్ ప్లాట్‌ఫారంకు వెళ్లే ప్రయాణికులు నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు నివారించ లేకపోతున్నామని, నిబంధనలకు విరుద్ధంగా రైల్వే ట్రాక్ దాటకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గూడ్స్ షెడ్ ఎగుమతులు, దిగుమతుల ట్రేడర్స్ తమ సమస్యలను డిఆర్‌ఎం దృష్టికి తెచ్చారు. 2009కి ముందు గూడ్స్ షెడ్‌లో 10గంటల పనివిధానం ఉండేదని, ఆతర్వాత 24గంటలు పని విధానం ప్రవేశపెట్టడం ద్వారా తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి మరలా 10గంటల పనివిధానం గూడ్స్ షెడ్‌లో ఏర్పాటు చేయాలని కోరగా, పరిశీలిస్తామన్నారు. స్టేషన్‌కు పశ్చిమం వైపున ఉన్న రైల్వే బుకింగ్ కౌంటర్‌కు ప్రయాణికులు చేరుకునే మార్గంలోనే, గూడ్స్ షెడ్‌కు వచ్చే భారీ వాహనాలు రావడం వలన ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, గూడ్స్ షెడ్‌కు ప్రత్యేకంగా రోడ్‌నిర్మాణం చేయాలని ట్రేడర్స్ కోరగా పరిశీలిస్తామన్నారు.
భారత్‌లో పారిశ్రామిక విధానాల మార్పు జరగాలి
నాగార్జున యూనివర్సిటీ, ఫిబ్రవరి 22: భారత్ వంటి అభివృద్థి చెందుతున్న దేశాలలో పారిశ్రామిక విధానాలు నూతనీకరణ చెందాల్సిన అవసరముందని ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ బొమ్మిడాల కృష్ణమూర్తి అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మానవ వనరుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ‘పారిశ్రామిక సంబంధాలలో వస్తున్న నూతన ఒరవడులు’ అనే అంశంపై డైక్‌మెన్ ఆడిటోరియంలో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావు అధ్యక్షత వహించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ప్రభుత్వాలు అనుసరించిన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల దేశంలో పారిశ్రామికి అభివృద్ధి శరవేగంగా జరిగిందని, అనంతరం కాలంలో వచ్చిన మార్పుల వల్ల ఈ వేగం మందగించిందని అన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పారిశ్రామిక విధానాలను మార్చాల్సిన అవసరముందని, చట్టాలను పారిశ్రామిక మిత్రులుగా మార్పు చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో చైనా మిగిలిన దేశాలకు గట్టిపోటీని ఇస్తుందని, చైనా పారిశ్రామిక ప్రగతి మిగిలిన దేశాలపై ఒత్తిడి పెంచుతుందని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్సిటీ వీసీ ఆచార్య కె వియన్నారావు మాట్లాడుతూ దేశాభివృద్థిలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగాల పాత్రే అత్యంత కీలకమైందని, దేశీయ పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరముందని అన్నారు. దేశంలో చట్టాలకు కొదవలేదని, వాటిని సమర్థవంతంగా అమలుచేయటంలోనే అలసత్వం గోచరిస్తుందని అన్నారు. ఐటిసి హ్యూమన్ రిసోర్స్ విభాగం ఉపాధ్యక్షుడు రావి శ్రీనివాస్ మాట్లాడుతూ సిబ్బంది, యాజమాన్యాల మధ్య వచ్చే సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే సంస్థలే అనుకున్న లక్ష్యాలను చేరుకోవటంలో విజయం సాధిస్తాయని తెలిపారు. సదస్సు డైరక్టర్ డాక్టర్ బి నాగరాజు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సంబంధాలు సంస్థల విజయంలో కీలకభూమికను పోషిస్తాయని అన్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో పారిశ్రామిక సంబంధాలలో అనేక విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయని, ఆ మార్పులపై సమగ్రమైన అధ్యయనం చేసి వాటిలోని మంచి చెడ్డలను ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
వ్యాఘ్ర వాహనంపై మల్లేశ్వరుని గ్రామోత్సవం
మంగళగిరి, ఫిబ్రవరి 22: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామిని వ్యాఘ్ర వాహనంపై అలంకరించి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం మెయిన్ బజార్‌లో ఆంజనేయ మిద్దె సెంటర్ వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరింది. భక్తులు వ్యాఘ్ర వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని నేత్ర పర్వంగా తిలకించారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా సిందే నారాయణరావు, హేమంత్‌కుమార్ వ్యవహరించారు. నిడమర్రుకు చెందిన ఎఎంసి మాజీ డైరెక్టర్ జంగా శివారెడ్డి, సరోజిని దంపతులు, ప్రభాస్‌రెడ్టి, శిరీష, చరణ్, రాజేష్‌రెడ్డి భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆలయ మేనేజర్ కృపాల్‌రెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బృంగి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందని కృపాల్‌రెడ్డి తెలిపారు.
టోర్నీలతోనే క్రీడాకారుల నైపుణ్యం తెలిసేది
గుంటూరు (స్పోర్ట్స్), ఫిబ్రవరి 22: క్రీడల ద్వారా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవచ్చని డాక్టర్ లతీఫ్ అన్నారు. గ్లోబల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్‌టిఆర్ స్టేడియంలోని సింథటిక్ టెన్నిస్‌కోర్టులో శనివారం ప్రారంభమైన ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగించారు. క్రీడాకారుల్లో దాగివున్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇలాంటి టోర్నీలు ముఖ్యమన్నారు. జిల్లా టెన్నిస్ సంఘ కార్యదర్శి కెఎస్ చారి మాట్లాడుతూ గ్లోబుల్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5వసారి ఐటా టెన్నిస్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభలో గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు జి ఉషారాణి మాట్లాడుతూ జిల్లాలో పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్ లతీఫ్, కెఎన్ చారి పోటీలను ప్రారంభించారు.
అందరి సహకారంతో గ్రామాభివృద్ధి
తెనాలి రూరల్, ఫిబ్రవరి 22: గ్రామాభివృద్ధికి గ్రామంలో నివసించే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు.... ఇలా ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవరమని రాష్ట్ర శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 15లక్షల రూపాయల పనులను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. జిల్లాలోనే అత్యధికంగా తెనాలి నియోజకవర్గంలోని తెనాలి పట్టణం, మండలం, కొల్లిపర మండలాల్లో వందల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. అనంతరం గ్రామంలో అన్ని వర్గాలు, కులాల నాయకులను కలిసి మాట్లాడారు.
9న స్టార్ క్రికెట్ లీగ్ పోటీలు
గుంటూరు (స్పోర్ట్స్), ఫిబ్రవరి 22: వెండితెర, బుల్లితెర కళాకారుల ఆధ్వర్యంలో మార్చి 9వ తేదీన స్థానిక బిఆర్ స్టేడియంలో ఎస్‌సిఎల్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు బుల్లితెర కళాకారులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక అరండల్‌పేటలో జరిగిన విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న కళాకారులు లోహిత్, సమీర్, ప్రదీప్, శ్రీరామ్, నందకిషోర్‌లు మాట్లాడుతూ మొత్తం 4 టీమ్‌లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయన్నారు. రెడ్ ఫ్లేమ్స్, ఎల్లో కెమాండోస్, గ్రీన్ తండర్స్, బ్లూ రైడర్స్ జట్లు పాల్గొంటున్నాయని, సెమీఫైనల్స్, ఫైనల్‌తో మొత్తం మూడు మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. రక్తదానం, పచ్చదనం పరిశుభ్రత, బాలికల సంరక్షణ, నీటి పొదుపులను ప్రధానాంశాలుగా చేసుకుని వాటి ప్రముఖ్యతను తెలియజేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా తమ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. తమతోపాటు స్థానిక సంస్థలు ఈ కార్యక్రమలో భాగస్వామ్యం వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.