
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత క్రికెట్ జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇరకాటంలో పడ్డారు. వరుస వైఫల్యాలకు దారితీసిన కారణాలపై వివరణ ఇవ్వాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఆదేశించనున్నట్టు వార్తలు రావడంతో, ఏ సమాధానం చెప్పాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఫ్లెచర్ కోచ్‌గా, ధోనీ కెప్టెన్‌గా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా వైట్‌వాష్ వేయించుకొని స్వదేశానికి తిరిగి వచ్చింది. ఆతర్వాత ఆస్ట్రేలియాలోనూ అదే పరిస్థితి ఎదురైంది. దక్షిణాఫ్రికాపర్యటనకు వెళ్లి, ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ దారుణంగా విఫలమైంది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 0-4 తేడాతో చేజార్చుకుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో కోల్పోయింది. కాగితంపై చూస్తే భారత్ కంటే న్యూజిలాండ్ చాలా బలహీనంగా కనిపిస్తున్నది. అయినప్పటికీ ఈ పరాజయాలు భారత క్రికెటర్ల సామర్థ్యాన్ని, కెప్టెన్ ధోనీ వ్యూహరచనను, కోచ్ ఫ్లెచర్ మార్గదర్శకాన్ని ప్రశ్నిస్తున్నాయి. బిసిసిఐ అధికారులు కూడా న్యూజిలాండ్ సిరీస్‌లో ఎదురైన పరాజయాలపై ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఫ్లెచర్, ధోనీలను పిలిపించి, పరాజయాలకు కారణాలను వివరించడమని కోరడంతోపాటు, జట్టు మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తుందని తెలుస్తోంది. న్యూజిలాండ్‌లో వనే్డ, టెస్టు సిరీస్ పరాజయాల అంశం ఈనెల 28న భువనేశ్వర్‌లో జరిగే బిసిసిఐ వర్కింగ్ గ్రూప్ సమావేశంలోనూ చర్చకు రావచ్చు. కోచ్, కెప్టెన్‌ల నుంచి వివరణ కోరాలని ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవచ్చు. లేదా బిసిసిఐ పాలక మండలి ప్రత్యేకంగా ఆదేశాలను జారీ చేయవచ్చు. ఏదిఏమైనా, విదేశాల్లో టీమిండియా ఆశించిన స్థాయిలో ఎందుకు రాణించలేకపోతున్నదనే విషయంపై ఇప్పటికే చర్చ మొదలైంది. గతంలో మాదిరి ఈ అంశాన్ని బిసిసిఐ తేలిగ్గా తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. సౌరవ్ గంగూలీ, మార్టిన్ క్రోవ్ వంటి కొంత మంది మాజీ క్రికెటర్లు తక్షణమే ధోనీని తప్పించి, అతని స్థానంలో విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పాలని కోరుతున్నారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి మరి కొంత మంది ధోనీకి అండగా నిలుస్తున్నారు. అయితే, వేర్వేరు ఫార్మెట్స్‌కు విడివిడిగా కెప్టెన్లు ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు. టీమిండియా పరాజయాలు ఎదుర్కొన్న ప్రతిసారీ తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగడం, ఆతర్వాత ఒకటిరెండు విజయాలను నమోదు చేయగానే ఆ విషయాన్ని మరచిపోవడం ఆనవాయితీగా మారింది. కెప్టెన్ ఎవరైనా, అటు అభిమానులుగానీ, ఇటు బోర్డు పెద్దలుగానీ పరాజయాలపై తీవ్రంగా స్పందించిన దాఖలాలు లేవు. అయితే, ఈసారి బోర్డు అధికారులు అంత తేలిగ్గా తీసుకుంటారని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు జరగనుండగా, వచ్చే ఏడాది వరల్డ్ కప్‌లో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈలోగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుస వైఫల్యాల బాటను వీడకపోతే టీమిండియాకు గడ్డు సమస్యలు తప్పవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, కోచ్ ఫ్లెచర్, కెప్టెన్ ధోనీలను పిలిపించి వివరణ కోరేందుకు బిసిసిఐ అధికారులు సిద్ధమవుతున్నారు. కీలక షెడ్యూల్ నేపథ్యంలో కెప్టెన్‌ను మార్చే సాహసం బిసిసిఐ చేయకపోయినా, కోచ్‌ను మార్చడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్‌తో బోర్డు అధికారులు సమాలోచనలు జరుపుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలను బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ ఖండించినప్పటికీ, నిప్పులేనిదే పొగ రాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద విదేశాల్లో వైఫల్యాలపై వివరణ ఇవ్వక తప్పని పరిస్థితిని ఫ్లెచర్, ధోనీ ఎదుర్కొంటున్నారు.