దుబాయ్, ఫిబ్రవరి 22: అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు క్వార్టర్ ఫైనల్స్ నుంచే నిష్క్రమించింది. ఏ మాత్రం ఆర్భాటాలకు వెళ్లకుండా నిలకడగా ఆడిన ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీపక్ హూడా వీరోచిత పోరాటాన్ని కొనసాగించి 68 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్‌కాగా, సర్ఫరాజ్ ఖాన్ 46 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు సాధించాడు. వీరిద్దరితోపాటు కెప్టెన్ విజయ్ జోల్ (48) కూడా తన వంతు కృషి జరపడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 221 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫిషర్ 55 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 222 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లకు 222 పరుగులు చేసి విజయభేరి మోగించింది. డకెట్ (61), క్లార్క్ (42) చక్కటి ఆటతో రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఉన్నంత సేపు పరుగుల వేటను కొనసాగించారు. దీనితో ఇంగ్లాండ్‌కు మూడు వికెట్ల తేడాతో విజయం సాధ్యమైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 46 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతనిని మినహాయిస్తే, భారత బౌలర్లు ఎవరూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌పై చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయారు. మధ్యమధ్యలో వికెట్లు పడగొట్టినప్పటికీ, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ వ్యూహాత్మకంగా లక్ష్యం దిశగా వెళుతున్నప్పటికీ వారిని నిలువరించలేకపోయారు. మొత్తం మీద నిరుటి విజేత భారత్ పరుగు ఈసారి సెమీస్ చేరక ముందే ముగిసింది.
ఇలావుంటే, ఇంగ్లాండ్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు కూడా సెమీ ఫైనల్‌లో స్థానం సంపాదించాయి. శ్రీలంకను ఢీకొన్న పాకిస్తాన్ 121 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఓపెనర్లు సమీ అస్లమ్ (కెప్టెన్) 95, ఇమామ్ ఉల్ హక్ 82, ఫస్ట్‌డౌన్ ఆటగాడు కమ్రాన్ గులామ్ 52 పరుగులతో అండగా నిలిచారు. లంక బౌలర్లను వీరు సమర్థంగా ఎదుర్కోవడంతో, పాకిస్తాన్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 279 పరుగులు చేసింది. లంక బౌలర్లలో బినుర ఫెర్నాండొకు నాలుగు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 42.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సమరవిక్రమ (51), పెరెరా (68) పరుగులతో రాణించినప్పటికీ మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. ఫలితంగా శ్రీలంక 42.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో జియా ఉల్ హక్, కరామత్ అలీ, జఫర్ గొహర్, కమ్రాన్ గులాం తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కెనడాను బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కెనడా 27.1 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూలింది. టింటో 16 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని కంటే ఎక్కువగా 18 పరుగులు ఎక్‌స్ట్రాల రూపంలో కెనడాకు లభించడం విశేషం. అనంతరం 76 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 13.5 ఓవర్లలో, ఒక వికెట్ కోల్పోయి అందుకుంది. జొయ్‌రాజ్ షేక్ 33 పరుగులకు అవుటయ్యాడు. షాద్మన్ ఇస్లామ్ (35), జహీర్ హసన్ (1) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ జట్టుకు విజయాన్ని అందించారు.
నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఆరు వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 194 పరుగులు చేసింది. ఓపెనర్ పిచెర్స్ 78, లొఫ్టీ ఇటాన్ 45 పరుగులతో రాణించగా, జింబాబ్వే బౌలర్ మంబోకు నాలుగు వికెట్లు లభించాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 45.1 ఓవర్లు ఆడి, నాలుగు వికెట్లకు 197 పరుగులు సాధించి విజయం సాధించింది. ఓపెనర్ గంబీ (37), బర్ల్ (55 నాటౌట్), గెయిల్ (37), కెప్టెన్ లేక్ (39 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ ప్రతిభ కనబరిచారు.
అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
english title:
under - 19
Date:
Sunday, February 23, 2014