
సిడ్నీ, ఫిబ్రవరి 23: రాబోయే ఐదేళ్లలో ప్రపంచ వృద్ధిరేటును 2 శాతం లేదా 2 ట్రిలియన్ డాలర్ల మేర పెంచేందుకు కృషి చేస్తామని జి20 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఆటోమెటిక్ టాక్స్ ఇన్ఫర్మేషన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎమ్‌ఎఫ్ సంస్కరణల అమలు దిశగా పనిచేసేందుకు అంగీకరించాయి. ఇక్కడ ఆదివారంతో ముగిసిన రెండు రోజుల జి20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సమావేశాల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా అమెరికా ఉద్దీపన పథకాల ఉపసంహరణ ప్రభావంపై భారత్ ఆందోళనలను జి20 దేశాలు గుర్తించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జి20 దేశాలే ప్రధాన చోదకాలన్న విషయం తెలిసిందే. ప్రపంచ వృద్ధిరేటులో 85 శాతం వాటా జి20 దేశాలదే. ఈ క్రమంలోనే రాబోయే ఐదేళ్లలో ప్రపంచ వృద్ధిరేటును 2 శాతానికిపైగా పెంచాలని జి20 దేశాలు నడుంబిగించాయి. ఐఎమ్‌ఎఫ్ గణాంకాల ప్రకారం ప్రపంచ వృద్ధిరేటు ఈ ఏడాది 3.7 శాతంగా, వచ్చే ఏడాది 3.9 శాతంగా ఉంటుందని అంచనా. దీంతో జి20 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరుచుకుంటే ప్రపంచ జిడిపి 2 శాతానికిపైగా పెరిగి భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని సమావేశం అభిప్రాయపడింది. కాగా, ఈ సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం మాట్లాడుతూ మాకున్న ఆందోళనలకు ఈసారి సమావేశాల్లో చక్కని ప్రాధాన్యం లభించిందని పిటిఐ వద్ద సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఆటోమెటిక్ టాక్స్ ఎక్స్‌చేంజ్ ఇన్ఫర్మేషన్ 2015 నాటికి అమలు కాగలదనే ఆశాభావాన్ని జి20 సభ్యదేశాలు ఈ సందర్భంగా వ్యక్తం చేశాయి. పన్నుల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా కొన్ని వివాదాలను పరిష్కారమవుతాయన్న భావనను వెలిబుచ్చాయి. అటు ఐఎమ్‌ఎఫ్ తీసుకొచ్చిన సంస్కరణల అమల్లో జాప్యంపై చింతించాయి. అమెరికా ఈ సంస్కరణలు ఇప్పటికీ ధ్రువీకరించని నేపథ్యంలో ఏప్రిల్‌లో జరిగే సమావేశాల వరకైనా వాటికి ఆమోదం లభించేలా చేసుకోవాలని కోరుకున్నాయి. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న అన్నింటిపైనా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జి20 రిజర్వ్ బ్యాంకులు అభిప్రాయపడ్డాయి. ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్నైనా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలోనూ అమెరికా ఉద్దీపన పథకాల ఉపసంహరణపై మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని రాజన్ వ్యక్తం చేశారు. మరోవైపు ఐఎమ్‌ఎఫ్ చీఫ్ క్రిస్టినా లగార్డే మాట్లాడుతూ జి20 దేశాల ప్రపంచ వృద్ధిరేటు అజెండా ప్రశంసనీయమైనదని, సహేతుకమైనదని అన్నారు. ఉపాధి, పెట్టుబడులు, వాణిజ్యం పురోగతికి జి20 దేశాలు పటిష్టమైన కార్యాచరణను ఏర్పరచుకోవడం అభినందనీయమన్నారు.
జి20 సమావేశాల్లో మాట్లాడుతున్న క్రిస్టినా లగార్డే