
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 : జన్యు మార్పిడి (జిఎం) పంటల వల్ల ఎటువంటి ముప్పు ఉండదని, ఇవి సురక్షితమైనవేనని చెప్పేందుకు సశాస్ర్తియమైన ఆధారాలు ఉన్నాయని బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి విజయ్ రాఘవన్ స్పష్టం చేశారు. అయితే ఈ పంటలపై నెలకొన్న ఇతర భయాందోళనలను తొలగించేందుకు విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ) ఆధ్వర్యాన లాల్ బహదూర్ శాస్ర్తీ 44వ స్మారకోపన్యాస కార్యక్రమం సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జన్యు మార్పిడి పంటల విషయమై భారత్ ‘సైద్ధాంతిక గందరగోళం’లో ఉందని, ప్రస్తుతం రాజ్యమేలుతున్న పాతకాలపు భావజాలానికి లోబడకుండా శాస్తవ్రేత్తలు జన్యు మార్పిడి పంటలకు సంబంధించిన శాస్ర్తియమైన సాక్ష్యాధారాల గురించి నిర్భయంగా, స్వేచ్ఛగా, నిస్పాక్షికంగా మాట్లాడాలని ఆయన అన్నారు. ‘జన్యు మార్పిడి పంటలు సురక్షితమైనవేనని శాస్ర్తియ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే జన్యుమార్పిడి పంటల పట్ల వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు ప్రధాన కారణం విజ్ఞాన శాస్త్రం కాదు. ఈ పంటలపై ఇతర భయాందోళనలు ఎన్నో ఉన్నాయి’ అని విజయ్ రాఘవన్ పేర్కొన్నారు. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా విజ్ఞాన శాస్త్రం పట్ల అవగాహన ఉన్నవారు సైతం జన్యుమార్పిడి పంటలను వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, జన్యు మార్పిడి పంటలు సురక్షితమైనవా, కావా అనే అంశంపైనే కాకుండా వ్యవసాయ రంగంలో వీటి పాత్రపైన, అలాగే మార్కెట్‌లో వీటికి గల అపారమైన అవకాశాలపైనా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు చెప్పారు.