బోధన్, ఫిబ్రవరి 23: నిజాం డెక్కన్ షుగర్స్ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ప్రైవేటు యాజమాన్యం అయోమయంలో పడింది. అంతేకాకుండా ఇక్కడి రైతులు, కార్మికులు సైతం అదే పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తోంది. బోధన్‌లోని నిజాం డెక్కన్ షుగర్స్‌లో ఈ ఏడాది క్రషింగ్ సీజన్ బుధవారం నాటితో ముగిసింది. దీంతో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తమను ఎక్కడ విధుల నుండి తొలగిస్తుందోనని క్యాజువల్ కార్మికులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కర్మాగారంలో ఈ ఏడాది లక్షా 72వేల టన్నుల చెరకు గానుగాడింది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు యాజమాన్యం కేవలం ఏడు కోట్ల రూపాయలను మాత్రమే రైతులకు చెల్లించింది. ఇంకా 35 కోట్ల రూపాయల వరకు బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉంది. కానీ యాజమాన్యం ఈ బిల్లులను చెల్లించేందుకు ఏ మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. బిల్లులు నిలిపివేయడం వెనుక అంతర్యమేమిటోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. యాజమాన్యం పకడ్బందీ వ్యూహంతోనే చెరకు బిల్లులు నిలిపివేసిందా అని రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము కర్మాగారానికి తోలిన చెరకుకు సంబంధించిన బిల్లులను చెల్లించాలంటూ చెరకు రైతులు అనేకసార్లు ఇక్కడి యాజమాన్య ప్రతినిధులను కలిసి విన్నవించారు. కానీ యాజమాన్యం అదిగో..ఇదిగో అంటూ వాయిదాలు పెడుతూ వస్తోంది. క్రషింగ్ ముగిసినా బిల్లుల చెల్లింపులను మాత్రం పెండింగ్‌లోనే పెట్టింది. గత రెండు మాసాల క్రితం ఈ కర్మాగారాలను ప్రభుత్వ పరం చేయాలా...లేక ప్రైవేటు పరం చేయాలా అనే అంశం క్యాబినేట్‌లో చర్చకు రావడంతో డెక్కన్ షుగర్స్ వ్యవహారం మలుపులకు దారి తీసిన సంగతి విదితమే. తెలంగాణ ప్రాంత మంత్రులు కర్మాగారాలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేయడం ఆ తర్వాత ప్రభుత్వం ఓ సబ్‌కమిటి వేయడం, రైతు ప్రతినిధులు హైకోర్టు నుండి ఉత్తర్వులు తీసుకురావడం వంటివన్నీ ప్రైవేటు యాజమాన్యాన్ని అయోమయంలో పడేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో చక్కెర కర్మాగారాలు తమకు దక్కడం కష్టతరమేనని భావించిన యాజమాన్యం చెరకును గానుగాడించి రైతులకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బిల్లులను చెల్లించినట్లయితే తమపై 35 కోట్ల రూపాయల భారం పడుతుందనే యాజమాన్యం బిల్లులను నిలిపివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో నూటికి నూరుపాళ్లు ఈ చక్కెర కర్మాగారాలను తమకు దక్కవనే ఆలోచనతోనే ప్రైవేటు యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంత తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు గత కొంతకాలం నుండి ఈ కర్మాగారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ప్రైవేటు పరమైన నిజాం షుగర్స్ కర్మాగారాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకుంటామంటూ ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని డెక్కన్ షుగర్స్‌ను నిర్వహిస్తున్న యాజమాన్యం ఆచితూచి అడుగులు వేస్తోంది. క్రషింగ్ సీజన్ ముగిసిన వెంటనే క్యాజువల్ కార్మికులను విధులలో నుండి తీసివేస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. చెరకు బిల్లుల చెల్లింపుల విషయమై యాజమాన్యం స్తబ్దంగా ఉండటం రైతులను కలవరానికి గురిచేస్తోంది. తమ బిల్లులు నిలిపివేయడం వెనుక అంతర్యమేమిటో స్పష్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
బోధన్‌లోని నిజాం డెక్కన్ షుగర్స్ కర్మాగారం