
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) దేశీయ రుణ మార్కెట్లోకి దాదాపు 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చారు. జనవరిలో 12,609 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌ఐఐలు.. ఫిబ్రవరిలోనూ 21,210 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టారు. అయితే తిరిగి 10,219 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో నికర పెట్టుబడులు 10,991 కోట్ల రూపాయలు (1.77 బిలియన్ డాలర్లు)గా నమోదైనట్లు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలియజేసింది. మరోవైపు స్టాక్‌మార్కెట్ల నుంచి ఫిబ్రవరిలో ఎఫ్‌ఐఐలు 549 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. కాగా, గత ఏడాదిలో రుణ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు 50,847 కోట్ల రూపాయల (8 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను తిరిగి తీసేసుకున్నారు. అయినప్పటికీ స్టాక్‌మార్కెట్లలో 1.13 లక్షల కోట్ల రూపాయల (20.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను పెట్టారు. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు తమ ఉద్దీపన పథకాలను ఉపసంహరించడం మొదలు పెట్టినప్పటి నుంచి విదేశీ మదుపర్లు దేశీయ మార్కెట్లలో పెట్టుబడులపై పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని మార్కెట్లన్నిటి పరిస్థితీ ఇలాగే తయారైంది. సంక్షోభంలో చిక్కుకున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పడేసేందుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు నెలనెలా 85 బిలియన్ డాలర్ల బాండ్ల కొనుగోళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఆర్థిక పరిస్థితులు పుంజుకున్న సంకేతాలు వెలువడటంతో బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియను దశలవారీగా నిలిపి వేయాలని గత ఏడాది డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే జనవరి నుంచి నెలకో 10 బిలియన్ డాలర్ల చొప్పున బాండ్ల కొనుగోళ్లను తగ్గిస్తోంది. దీంతో విదేశీ మదుపర్లు సైతం అదేరీతిలో స్పందిస్తున్నారు. అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలోని పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. ఇదిలావుంటే గత ఏడాది ఆగస్టులో మునుపెన్నడూ లేనివిధంగా డాలర్‌తో పోల్చితే 68.85 స్థాయికి దిగజారిన రూపాయి మారకం విలువ.. శుక్రవారం 62.12 వద్ద ఉంది.