
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన 401కె పింఛను ప్లాన్‌తో ప్రేరణ పొందిన మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దేశంలో మ్యూచువల్ ఫండ్ లింక్‌డ్ రిటైర్మెంట్ ప్లాన్(ఎంఎఫ్‌ఎల్‌ఆర్)ను ప్రతిపాదించింది. ఇది ఆమోదం పొందితే దేశంలోని మూలధన మార్కెట్లోకి రూ. 18,000 కోట్లు వస్తాయని సెబీ అంచనా. అమెరికాలో విజయవంతంగా అమలవుతున్న 401కె పింఛన్ ప్లాన్‌ను పరిశీలిస్తే.. అక్కడి ప్రభుత్వం, ఉద్యోగ సంస్థలు పౌరులకు కల్పిస్తున్న పింఛను ప్లాన్‌లకు అదనంగా ఈ 401కె ప్లాన్ వారికి మరిన్ని పదవీ విరమణ పొదుపులను అందిస్తోంది. ఈ ప్లాన్‌లు పన్ను ప్రయోజనాలతోపాటు ఇనె్వస్టర్లకు మంచి రాబడులను తెచ్చేపెట్టేవిగా పేరుపొందాయి. కాగా, సెబీ తాను ప్రతిపాదించిన ఎంఎఫ్‌ఎల్‌ఆర్ స్కీముల్లో కూడా పన్ను ప్రోత్సాహకాలను ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. తద్వారా ఏటా రూ. 18వేలకోట్లను సమీకరించాలని భావిస్తోంది. గృహ రంగంలో జరిగే పొదుపులను మూలధన మార్కెట్లోకి తరలించడానికి ఈ స్కీం ప్రధాన మాధ్యమంగా ఉపయోగపడుతుందని సెబీ పేర్కొంది. అంతేకాక, సెబీ తన ప్రతిపాదనలో.. ఎంఎఫ్‌ఎల్‌ఆర్ స్కీముల్లో పెట్టే పెట్టుబడి రూ. 50,000 వరకు పన్ను మినహాయింపు ఇవ్వాలని పేర్కొంది లేదా ఆదాయపు పన్ను చట్టం 80సి కింద పరిమితిని రూ.2 లక్షలకు పెంచి ఈ పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలను కల్పించాలని సూచించింది.ప్రస్తుతం రూ.లక్ష వరకు మ్యూచువల్ ఫండ్స్, బీమా, ప్రావిడెంట్ ప్లాన్లలోపెట్టుబడులకు ఆదాయపుపన్ను చట్టం 80సి కింద పన్ను ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తోంది.