ఎన్నికలలో నేర చరితులు ఎక్కువవడం మన ప్రజాస్వామ్యానికి మచ్చగా మారింది. ఎన్ని సంస్కరణలు తెచ్చినా ఎన్నికలపై నల్లధనం ప్రభావం బాగా వుంది. డబ్బు వుంటే ఏమైనా చేయవచ్చని మన రాజకీయ నాయకులు భావిస్తున్నారు. ఇది వాస్తవం కూడా. మన రాజకీయ రంగం నేరచరితమైనది. ఒక అధ్యయనం ప్రకారం 2009లో ఎన్నికైన లోక్‌సభ సభ్యులలో 30 శాతం మందికి నేర చరిత్ర వుంది. రాజ్యసభలో ఈ శాతం 31. వీరిపై ఆరోపణలు కూడా తీవ్రమైనవే. వీరిపై హత్య, అత్యాచారం లాంటి కేసులున్నాయి. చాలా రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలే నేరచరిత గల అభ్యర్థులను ఎన్నికలకు ఎన్నుకుంటున్నారు. హంతకులు, దేశద్రోహులు, భూదురాక్రమణదారులు రాజకీయ రంగంలో ప్రవేశిస్తారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు.
నేరస్థులు రాజకీయ రంగంలో ప్రవేశించడానికి అనేక కారణాలున్నాయి. వీరే ఎన్నికలలో గెలిచే అవకాశం ఎక్కువ. ప్రస్తుత పరిస్థితులలో వీరు తేలికగా కేసులలో పురోగతి లేకుండా చేయగలరు. శిక్ష పడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే నేర పరిశోధనకు ఆటంకాలు కల్పించగలరు. ప్రస్తుతం ఒక పార్లమెంట్ సభ్యుడు గాని, రాష్ట్ర శాసనసభ్యుడు గాని, నేరారోపణ జరిగిన మూడు నెలల్లో తనపై మోపిన నేరాన్ని పునఃపరిశీలించవలసిందిగా కోరవచ్చు. తన సభ్యత్వాన్ని కాపాడుకోవచ్చు.
ఈ నేపథ్యంలో 2013 జూలై 10న సుప్రీంకోర్టు తన నిర్ణయం ప్రకటించింది. దీని ప్రకారం న్యాయస్థానం నేరస్థులుగా నిర్ధారించిన చట్టసభ ప్రతినిధులు అప్పీళ్లతో సంబంధం లేకుండా తక్షణం పదవులను కోల్పోతారు. అయితే, గతంలో దోషులుగా నిర్ధారణ జరిగిన నేరప్రతినిధులకూ సైతం ఈ తీర్పును వర్తింపజేసి వుంటే బాగుండేది. జైలు, జుడిషియల్ కస్టడీలో ఉన్నవారు ఎన్నికలలో పోటీచేయకుండా కట్టడి చేయడం మంచిదే. అయితే, అధికారంలో వున్నవారు తమ ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీసేందుకు అవకాశం వుంది. ఇంకొక సమస్య. దిగువ న్యాయస్థానం శిక్ష విధించిందని ఒక చట్టసభ సభ్యుడిని అనర్హుడిగా చేశాక, హైకోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటిస్తే ఏం చేయాలి?
నేరచరిత రాజకీయ నాయకులవల్ల ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం పోతుంది. నేరస్థులు రాజకీయ రంగంలో ప్రవేశించడమే కాదు, రాజకీయ నాయకులు నేరస్థులతో సంబంధాలు పెంచుకోవడం కూడా ప్రమాదకరమే. నేరచరితగల రాజకీయ నాయకులు అభివృద్ధి నిరోధక శక్తులంటే అతిశయోక్తి లేదు. అన్ని అభివృద్ధి పనులకు వీరు ఆటంకంగా నిలబడతారు. మాఫియాలను సృష్టిస్తారు. ఉదాహరణకు ఇసుక అక్రమ రవాణా గురించి పేపర్లలో చదువుతున్నాం. ఫొటోలు కూడా చూస్తున్నాం. ఈ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. ఇసుక మాఫియాను పెంచి, పోషిస్తున్నది ఎవరో వేరే చెప్పనక్కర్లేదు.
చార్జిషీట్ దాఖలైనప్పటినుంచి నిర్దోషిత్వం ధృవపడేవరకు సంబంధిత నిందితులు చట్టసభలకు పోటీచేయరాదని, సభల సభ్యులుగా కొనసాగరాదని నిర్దేశిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి. చట్టాలను ఉల్లంఘించేవారు చట్టసభల్లో కొనసాగటం వాంఛనీయం కాదు. ఇంకొక విషయం. తప్పుడు కేసుల్లో ఇరుక్కొన్నవారు సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గుతున్నారు. న్యాయవ్యవస్థ ఈ అంశంపై దృష్టిపెట్టాలి. ప్రజలలో రాజకీయ చైతన్యం పెంచాలి. నిజానికి ప్రజల్లో అటువంటి చైతన్యం సంపూర్ణంగా వస్తే...వారే తమ ఓటు ఆయుధం ద్వారా నేర చరితులను అధికారంలోకి రాకుండా అడ్డుకోగలుగుతారు. కానీ అవినీతిపరులు, నేరచరితులు ప్రజా ప్రతి నిధులుగా ఎన్నికవుతున్నారంటే కారణం అందుకు కారణం ప్రజలు మాత్రమే. ప్రజల్లో మార్పు వచ్చిననాడు కోర్టు తీర్పులతో పనేముంది?
ఎన్నికలలో నేర చరితులు ఎక్కువవడం మన ప్రజాస్వామ్యానికి మచ్చగా మారింది.
english title:
p
Date:
Monday, February 24, 2014