
ఓ రాత్రి తెలం‘గానా’బజానాగా- దిక్కులు ఏకమైనట్లు సంబరాలతో అలిసిపోయిన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్- 21 ప్రొద్దునే్న - చాలాకాలం తర్వాత ప్రశాంతంగా కనబడ్డది. రాళ్లవానల ధ్వనులు, భాష్పవాయుగోళాల ప్రతిధ్వనులు లేవు. లైన్ క్లియర్ అయిపోయింది. తెలంగాణ స్వయంపాలన రైలు ఔటర్‌లో నిలబడ్డది... ఫ్లాట్‌ఫామ్ మీదికి రావడానికి రెడీ అన్నట్లున్నాయి క్యాంపస్‌కీ, అడిక్‌మెట్‌కీ మధ్యనున్న లోకల్ స్టేషన్లు.
‘టి’ఏజిటేషన్ అయిపోయింది. ఇక అన్నీ టీ పార్టీలే! మూడున్నర కోట్ల తెలంగాణ్యులకు- 20వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకే- భళ్లున సూర్యోదయం అయినట్లుంది.
ఇక టైమ్ లేదు. యు.పి.ఏ గవర్నమెంట్‌కు కాలం దగ్గరపడ్డది. చివరి లోక్‌సభకీ, ఆఖరి రాజ్యసభకీ మంగళం పాడేలోగానే ‘టి’బిల్లు- ‘శాసనముద్ర’కి రెడీ చేయాలి అన్నదే కాంగ్రెస్ పార్టీకి- జీవన్మరణ సమస్య. ఆపాటికే సోనియాగాంధీ టీము- ‘్ధర్మరాజు జూదంలో అన్నీ వోడి, సర్వస్వమూ ఒడ్డి- నిస్సిగ్గుగా నిలబడినట్లు’- పాపం అలా నిలబడింది.
‘‘నువ్వు యిస్తావా? నన్ను గెలిపించి, నాచేత, కె.సి.ఆర్. అండ్ పార్టీకి గిఫ్ట్‌గా రాష్ట్ర విభజనను యివ్వమంటావా?’’అన్నట్లు ప్రతిపక్ష భల్లూకం- ఠేవిణీ వేసుక్కూర్చుంది. సోనియా మాతకి ఎక్కడ లేని సాహసం వచ్చింది. ‘‘రాణీ-చీమ’’ కూలీ చీమల్ని పిలిచి ఆదేశించినట్లుగా వుంది సన్నివేశం.
‘సిజేరియన్ చెయ్యాలి’అన్న లేడీ డాక్టర్ లాగా వున్నదామె కృతనిశ్చయం. ‘‘మంత్రసాని కావాలా? మేడమ్! నేను రెడీ’’- అంటూ మిడ్‌వైఫ్ సుష్మాస్వరాజ్‌గారు రంగంలోకి దూకింది. ఈ ఆపరేషన్‌కి దీపాలార్పేస్తే తప్పులేదు. ఫలితం ముఖ్యం. అప్పోజిషన్ అధికార పార్టీ కుమ్మక్కయిన వేళ అది- ‘టి’-బిల్లు ఓ.కే. అయింది. హమ్మయ్య! ఎలాగోఅలాగ డెలివరీ అయింది.
తింటున్న జాడ- ఉంటున్న జాడ లేకుండా- అటూ, యిటూ యిరకాటంలో పడి కొట్టుకుంటున్న ఏడున్నర కోట్ల జనం ఊపిరిపీల్చుకున్నారు. పార్టీషన్‌కి పచ్చతోరణాలు రంగుదీపాలు పెట్టి- ముహూర్తం పెట్టకపోతే పోయె- ఇకనైనా రెక్కాడించి- డొక్కనింపుకునే మామూలు వాళ్లకి స్వేచ్ఛ దొరికింది అనుకున్నది జనావళి- ఆ విధంగా 2009 డిసెంబర్ 9న చిదంబరం పెట్టిన ‘‘చిచ్చు’’- సామ/ దాన ప్రక్రియలలో సాగాల్సిన ప్రక్రియగా/ కాక- మనిషికి, మనిషికీ-మనసుకీ మనసుకీ మధ్య- అడ్డుగోడలు కట్టే ‘పోరు’గా చివరి రాజ్యసభలో మెల్లోడ్రామాగా 2014 ఫిబ్రవరి 20 రాత్రి- రాష్ట్రం మొత్తాన్ని పీకి పందిరివేసిన తర్వాత- సమసిపోయింది.
ఎంత నష్టం!? ప్రాణ నష్టం, ధన నష్టం, విద్యానష్టం ఎంత కష్టం- మనశ్శాంతి లేని ఉదయాస్తమయాలలో ఒక పచ్చటి వెచ్చటి రాష్ట్రం కుదేలయిపోయింది. చివరి రాజ్యసభ రోజు- (లోక్‌సభ దృశ్యాలు చూడనోచలేదు గాని) మరీ చిత్రం.
కనీ వినీ ఎరుగని డ్రామా చూశాం. ‘జై ఆంధ్రా మూమెంట్’లో అప్పటి స్టూడెంటు కుర్రాడు వెంకయ్యనాయుడు ఝనాయించి- ధనురు లేపేస్తూ పిడుగులు కురిపించడం చూశాం. మళ్లీ యివాళ కూడా అదే స్పీడు- సీనియర్ నాయకుడు వెంకయ్యాజీలో చూశాం. కాని యిది వేరు... నాటి ప్రత్యేకాంధ్ర కోరిన వెంకయ్యాజీ ప్రభృతుల కోర్కె నేడు యిలా నెరవేరింది. ‘చెల్లెలికి మొగుడొస్తే అక్కకి వరుడు రాడా?’ అన్నట్లు- తెలంగాణా ప్రజల ‘కల’సాకారమైతే- ఆంధ్రా రాయలసీమలకు- వేరుకాపురం ఆటోమాటిక్‌గా రాదా? కొసమెరుపు ఏమిటీ అంటే- టూరిజం మంత్రివర్యుడు నిజ జీవితంలో మెగాస్టార్ ఐన చిరంజీవి ప్రధానమంత్రి వౌన మోహన్‌జీ- చాపక్రింద నీరు షిండేజీలు- బెల్లంమొత్తిన రాళ్లలా చూస్తూ వుండగా- హైకమాండ్‌నీ- గవర్నమెంట్‌నీ తన తొలి పార్లమెంటు ‘‘స్పీచు’’లోనే రేవుపెట్టేస్తూంటే- గొప్ప ముచ్చటేసింది మనకి. భళా చిరూ...!
‘‘ఇది కూడా, ఏ స్క్రిప్టులో భాగం సారూ?’’ అంటే రుూ భేతాళ ప్రశ్నకి జవాబు చెప్పలేని కుర్రాడు- ఆంధ్రాలోనూ, తెలంగాణాలోనూ కూడా లేడు. తెలంగాణాలో ఎలాగూ స్క్రిప్టు రైటరూ, డైరెక్టరూ ఒక్క కె.సి.ఆర్.గారే. కానీ, ఆంధ్రాలో రేపు కిరణ్‌కుమార్‌రెడ్డి, జగన్‌లతోపాటు- హైకమాండ్ కేండిడేట్‌గా చిరంజీవి కూడా దిగితే రంజుగా వుండదా? యిప్పుడు రెండో స్థానంలో వస్తాడనుకున్న నాయుడుగారు మూడో ప్లేసుకి వెళ్లిపోతే- ఫినిష్! మళ్లీ రుూ ముగ్గురితో ఓ ఆట సాగుతుంది. ఆనక ఎన్నికలలో పెర్‌ఫార్మెన్స్ బాగున్నవాడికి ‘వరమాల’ వేస్తాంరా రమ్మనొచ్చును’- అన్న ఆలోచన వుందేమో హై.కి అన్నాడో విశే్లషకుడు. ఔరా! ఏమి వ్యూహారచనా చమత్కారం? మరి కిరణ్‌జీ అలా మొహం కాల్చి మంగళారతి యిస్తే- అతణ్ని ముట్టుకోలేదు. ఎందుకని? జగన్- ‘‘సోనియాని ఇటలీకి పో’’ - అంటూ విన్యాసాలు చేస్తూంటే కూడా - డిగ్గీరాజా- ‘గాడ్‌బ్లెస్‌యూ’- అంటాడు ఏల?
ఏమి డ్రామా బాబూ! అనంగానే తననే అనుకుని చంద్రబాబు నాయుడుగారు- ‘మోడీ’వేపు చూస్తాడుట! ‘‘కలుద్దాం’’తో సదరు ఆ(అ)రాజకీయం అట్లు తగలడనిండు. అడ్డు-గోడలని చెరిపి- మమతల వంతెన కట్టుటకు- ఇరువైపులా నడుములు బిగించుడు. వోటు మీది- రేపు మీది. నేలమీది నింగిమీది... తెలంగాణా, సీమాంధ్రాలు రేపు ప్రపంచ విపణిలో- ఒకే నాణానికి రెండు మొహాలు అయిననాడు... ఓహో!...
దేర్ మేఁబి ఏ న్యూ ఈరా బ్లూమింగ్!...