
ప్రజాస్వామ్య విధాన కోడ్‌ను ఉల్లంఘిస్తూ సభలు, సమావేశాలు ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా వాగ్దానాలు, శంకుస్థాపనలు విందులు వినోదాలు వాగ్దానాలు చేస్తూ రాజ్యాంగ క్రియాసూత్రాలను ఉల్లంఘించి వారి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి తీవ్ర కళంకం తెచ్చి అప్రతిష్ట తీసుకురావడం తగునా? పబ్బం గడుపుకొనేందుకు నీతి నియమాలు తప్పి చెల్లికట్ట దాటిన విధంగా వికృతచేష్టలు అనుసరించడం మంచిది కాదు.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
తిరుపతిలో ఇస్లామిక్ వర్సిటీ పెట్టడం తగదు
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో చట్టాన్ని అతిక్రమించి నిర్మించిన హీరా ఇస్లామిక్ ఇంటర్నేషనల్ వర్సిటీని పెట్టడం సమంజసమేనా? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో స్థలాలు ఉన్నా ఇక్కడే యూనివర్సిటీ కట్టడంలో ఆంతర్యమేమిటి? అనవసరంగా మత కల్లోలాలకు దారి తీయటం తప్ప? ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తగిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చెయ్యాలి.
- గుండు రమణయ్యగౌడ్, పెద్దాపూర్
సీమాంధ్రకు తగిన నిధులివ్వాలి
రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన తరువాత బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన మాట సమన్యాయం. అన్ని పార్టీలు ఏమిచేస్తే సమన్యాయం జరుగుతుంది అనేది చెప్పరు. ప్రభుత్వానికి, ప్రజలకు వారివారి ఆలోచనలకు అవగాహనకు ఒదిలేశారు. ముఖ్యంగా సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి, శాసనసభ, మండలి, సచివాలయం, మంత్రుల నివాస ప్రాంగణాలకు, ఉన్నత న్యాయస్థాన నిర్మాణానికి, ఉద్యోగుల నివాసమునకు కాలనీల ఏర్పాటుకు కేంద్రం ఉదారంగా నిధులు సమకూర్చాలి. నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, కొత్త రైలు, రోడ్ల నిర్మాణానికి, గ్రామీణాభివద్ధికి, ఉపాధి పెంచే పరిశ్రమలు, వైద్య, విద్యాలయాలు ఏర్పాటుకు సంవత్సరానికి 5 లక్షల కోట్ల చొప్పున 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం సహాయం అందస్తే కొంతవరకు సమన్యాయం జరిగే అవకాశం ఉండవచ్చనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టిలో సీమాంధ్ర నాయకుల దృష్టిలో ఇంకా అవసరాలు కనపడచ్చు. 10 సంవత్సరాలు సీమాంధ్ర ప్రభుత్వం హైదరాబాదులోనే ఉంటుంది కాబట్టి ఆ గడువులో అభివృద్ధి చేసుకోవడం జరగవచ్చని భావిస్తున్నాను.
- కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
జాతీయ భాషపై నిర్లక్ష్యం తగదు
మన రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో భాషల్లో హిందీని ఆప్షనల్ సబ్జెక్టుగా అన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టాలి. అతి కొద్ది కళాశాలల్లో మాత్రమే హిందీ సబ్జెక్టును ప్రవేశపెట్టారు. దీనివల్ల హిందీ భాషను నేర్చుకోవాలనే తపన ఉన్న అభ్యర్థులు ఎంతో నిరాశకు గురవుతున్నారు. జాతీయ భాషపై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యానికి ఎందరో విద్యార్థులు నష్టపోతున్నారు. అలాగే గ్రూపు సబ్జెక్టుల్లో కూడా హిందీనిఅన్ని కళాశాలల్లో ప్రవేశపెట్టాలి. ఈమేరకు ఇంటర్మీడియట్ బోర్డు, ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. జాతీయ భాషను నిర్లక్ష్యం చేస్తే మన దేశం భవిష్యత్తులో తగు మూల్యం చెల్లించుకోవలసి వుంటుంది. హిందీ భాషకు న్యాయం చేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
వలసలపై జాగ్రత్త వహించాలి
తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ! ఇది సుమతి శతకకారుని సర్వకాలీన సందేశం. వయసుడిగిన కాంగ్రెస్ వంశపారంపర్య పాలనా, మన్మోహన్ వెనె్నముక లేని పాలనా, అంతేవాసుల అవినీతి విక్రమ పరాక్రమమా లేక ‘గుజరాత్ నమూనా, నమో పై’ ఆశలా ఏదైతేనేం కూలనున్న ఇంటి నుండి సురక్షిత స్థానానికి వలసలా అనేలా మొదలయ్యాయి. ఇప్పుడే భాజపా నేతృత్వం, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ జాగరూకులై వుండాలి. అన్ని స్థానాలకూ పార్టీలో పుట్టి పెరిగిన వారు దొరకడం కష్టమే కావచ్చు. అలాగని ఒక బస్సు పర్మిటుతో పది రూట్లలో నడిపేవారు, నిన్నటి వరకూ ఎటిఎం దొంగల, భూబకాసురుల పార్టీగా పేరుపొందిన వాటిలో వున్న వారిని అన్నట్టు నా మతస్తులు, నా మతస్తులు కాకపోయినా, నా కులస్తులు నా వెంటే’ అనే దుష్ట ఆలోచనలు కూడా గల పార్టీతో అంటకాగి స్వైరవిహారం చేసిన వారిని దరిచేరనిస్తే- ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అయిదేళ్ళు కూడా బతకనీయకపోవచ్చు. తొలిసారి ఎన్టీఆర్ తెదేపాను ఏర్పరచిన నాడు నాటినుంచి నేటి వరకూ భాజపాలోనే వున్న వెంకయ్య అనేవారు- ఇది కాంగ్రెసేతర ప్రభుత్వమని ఎలా అంటాం ఎన్టీఆర్ తప్ప మిగిలిన వారంతా కాంగ్రెస్ వారేగా! అని. ఆ స్థితికి నమో రాకూడదనే ఆశపడ్తున్నారు కాంగ్రెస్‌నుంచి దేశ విముక్తికోరేవారు.
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, వరంగల్