Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విభజన బిల్లు వచ్చిన విధంబెట్టిదనిన...

$
0
0

ఎట్టకేలకు 29వ రాష్ట్రంగాతెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వారెవరికి తెలంగాణ ఇస్తుందని అనుకోరు. ఆ పార్టీకి తనపైననే నమ్మకంలేదు. ఏ మాయ జరిగిందో ఏమోగాని, గత జులై30న అ మాంతంగా తెలంగాణ ఏర్పాటుకు యుపి ఏ ప్రభుత్వం పచ్చజెండాను ఊపింది. అయినా డిసెంబర్ 9, 2009నాటి భేతాళ కథలా ఈసారి కూడా చెట్టెక్కుతుందని భావించారు. ఓ ప్రహసనంగా బిల్లును రూపొందించడం నుంచి, పార్లమెంటుతో గట్టెక్కేదాకా ఆపరేషన్ గది నుంచి (వార్‌రూం) అత్యవసర హాలుదాకా (పార్లమెంట్) పెనుమార్లు బిల్లుపై కసరత్తు చేసి, కొన ఊపిరితో వున్న పేషంట్‌ను అప్పజెప్పినట్టు, ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ తెలంగాణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయ. కథ సుఖాంతం కాకున్నా 60 సంవత్సరాల ధారావాహిక ప్రసారానికి ‘శుభం’ అనే ముగింపును పార్లమెంటు పలికింది.
ఓవైపు సంబరాలు (కొన్ని పత్రికలు అప్పుడే తెలంగాణ యాసలో సంబురాలు అని రాశాయ) మరోవైపు నిరసనలు, తెలంగాణను ఇచ్చినవారు, పుచ్చుకున్నవారు ఎగురుతూ గంతులు వేసినా, ఎదలో తెలియని అసంతృప్తి. పోతే, మహదానంద పడింది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ వారైతే, కృత్రిమంగా బాధపడింది అవశేష రాష్ట్ర కాంగ్రెస్ వారు! చావుతప్పి కన్నులొట్ట పోయిందన్న విధంగా కూడా కాకుండా, కోమాలోకి వెళ్ళిన తెలంగాణను సాధించినట్లుగా వుంది.
కలిసి ప్రయాణం చేసి రైలు దిగి వెళ్ళేటప్పుడు తోటి ప్రయాణికుల్లో ఏదో బాధ, ఆత్మీయత తొణికిసలాడుతుంది. దాదాపు ఆరు దశాబ్దాలు సహజీవనం చేసిన ఇరు ప్రాంతాల ప్రజల మధ్యన ఇలాంటి ఉద్వేగభరిత వాతావరణం లేని స్థితి.కారణాలు ఏమైనా, కారకులు మాత్రం కాంగ్రెస్‌వారు మాత్రమే! ఇందిరాలాగే సోనియా కూడా తెలంగాణను ఇవ్వరనే విపరీత నమ్మకాన్ని 2004 తర్వాత, తిరిగి 2009లో కలిగించి, వైకాపాను, తెదేపాను నమ్మించి బుట్టలో వేశారు. అప్పుడప్పుడు బుసకొట్టె పరిస్థితిని కలిగిస్తూ తాను మాత్రం నాదస్వరం ఆపలేదు. నక్క, కొంగ కథలాగా ఒకరింటికి మరొకరికి పిలుచుకొని, ఎవరి పాయసం వారే ఆరగించినట్లు కాకుండా, తనింట్లో, ఎదిరింట్లో కూడా పాయసం తాగే రాజనీతి కాంగ్రెస్‌ది! అదనుతీసి దెబ్బతీయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. రామాయణంలో వాలిని, కురుక్షేత్రంలో కర్ణుణ్ణి, అశ్వత్తామ పేరును ఉచ్ఛరించడం దావరా,ద్రోణుల్ని చంపినట్లు కాఖృ శతకోటి విద్యల అనుభవం వుంది. అందుకే వైకాపాను, తెదేపాను మధ్యమధ్యన రెచ్చగొట్టి, భస్మాసుర హస్తాన్ని వారి నెత్తిపైనే పెట్టింది.
ఇక భాజపాది ముందు నుయ్యి, వెనక గొయ్యి పరిస్థితి. అవుననలేదు. అంటె, తెలంగాణను ఇచ్చిన ఘనత కాంగీకి దక్కుతుంది. కాదంటే, తెలంగాణ నినాదాన్ని వెనక్కి తీసుకున్నట్లైతే, తిరిగి కాంగ్రెస్ బాగుపడుతుంది. అందుకే బిల్లుకు మద్దతిచ్చినట్లు కనపడాలి, గట్టిగా వ్యతిరేకించినట్లు వుండాలి. అందుకే చివరి అంకంలో సమైక్యవాదుల పక్షాన వెంకయ్యనాయుడ్ని, తెలంగాణవాదుల పట్ల కిషన్‌రెడ్డిని వాడుకున్నది. ఇలా బహురూప రాజకీయాలు దేశప్రజలకు కొత్తేమి కాకున్నా ఒకే పార్టీ ద్విపాత్రాభినయం పోషించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే చెల్లింది.
2000 సంవత్సరంలో ఎన్‌డిఎ ప్రభు త్వం మూడు రాష్ట్రాల్ని ఇచ్చినప్పుడు, తె లంగాణ ఇవ్వకుండా తానే చక్రం తిప్పానని గర్వంగా చెప్పుకున్న బాబు, తెలంగాణ అంశమే 2004లో పదవిలోకి రావడానికి పెద్ద అడ్డంకి అవుతుందని అనుకోలేదు. అందుకే ఆయన కొంగ జపం చేయడం ప్రారంభించి, రెండు కళ్ళ సిద్ధాంతంతో, తిరిగి అదే తెరాసతో 2009 పొత్తుపెట్టుకోవడం సీ మాంధ్రలో కాంగ్రెస్‌కు మరింతగా కలిసివచ్చింది. ఈ సందర్భంగానే నాడు వైఎస్ తెలంగాణలో అనుకూలంగా, సీమలో బద్ధ వ్యతిరేకంగా ప్రసంగించడం జరిగింది.
ఇలా ఇరు రాజకీయ పార్టీలతో దగాపడిన తెరాస... ఎం.సత్యనారాయణ లాంటి నాయకుని చాలెంజీతో ఉప ఎన్నికకు పోవడం, మెజార్టీతో తిరిగి గెలవడం, వైఎస్ చనిపోవడం తెరాసకు ఎనలేని బలాన్నిచ్చింది. దీనికితోడు యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి రావడం, ఉద్యమాలు చేయడం, ఈ ఉద్యమాల్ని అవసరం వచ్చినప్పుడల్లా తెరాస ఉపయోగించుకోవడం, తన చేతిలో ఉద్య మం లేనప్పుడు వాటిని నీరుగార్చాలనే ప్రయత్నం (మిలీనియం మార్చ్) చేయడం, మధ్యమధ్యన కాంగ్రెస్ ప్రకటనలకు, ఉద్యమాల వైఫల్యాలకు కలత చెందిన యువకులు ఆత్మబలిదానాల్ని ఎంచుకోవడం, ఈ బలిదానాల్ని తెరాస రాజకీయంగా ఉపయోగించుకోవడం ఉద్యమానికి బాగా కలిసివచ్చింది. ఇలాంటి అనిశ్చిత వాతావరణంలోనే డిసెంబర్ 9, 2009న ఓ ప్రకటన (కెసిఆర్ దీక్షకు జడిసి కావచ్చు!) చేసిన పదిహేను రోజులు తిరక్కుండానే వెనక్కి తీసుకున్న ఘనత కాంగ్రెస్‌ది. ఇలాంటి కాంగ్రెస్ తానే తెలంగాణను ఇచ్చానని అంటుంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనియా అని తెరాస పొగడడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠ! తెరాసకు కొంత అర్హత వున్నా, తెలంగాణను ఉచ్చరించడానికే అర్హత లేని పార్టీ కాంగ్రెస్ అసలైన తెలంగాణ సాకార పార్టీగా చరిత్రలో మిగిలిపోవడం ఓ విషాదం!
తెలంగాణ పైగల అభిమానాన్ని, సాధనకై జరిగిన ఉద్యమాలను పరిగణనలోకి తీసుకోకుండా, ఉభయ పార్లమెంటు సభల్లో సుదీర్ఘ చర్చకు యుపిఎ ప్రభుత్వం అవకాశం కలిగించకపోవడం దాని రోగగ్రస్త బలహీనతకు చిహ్నం. తెలంగాణ అంశం ఒక్క తెలంగాణ ప్రాంత ప్రజలదన్న తప్పుడు సంకేతాన్ని, ఉభయ పార్లమెంటులు దేశంలోని అత్యధిక రాజకీయ పార్టీలు కల్గించడం వాటి హ్రస్వ దృష్టికి నిదర్శనం! ఓ ఫెడరల్ వ్యవస్థగా వున్న దేశంలో రాష్ట్రాలకు, కేంద్రాలకు మధ్యనున్న సంబంధాన్ని, వుండాల్సిన విధానాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్ (3)యొక్క ప్రాముఖ్యతను విస్తృతంగా చర్చించి, తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్ని, మోసపూరిత వాగ్దానాల్ని, వీటినెదిరించి పోరాడుతున్న ప్రజల వైనాన్ని, నూనతాభావానికి గురై విలువైన ప్రాణాలు పోగొట్టుకున్న భావోద్వేగాల్ని, రాజకీయ నాయకుల వైఖరిని పార్లమెంటులో చర్చల ద్వారా బాహ్యప్రపంచానికి పార్లమెంటు వేదికగా తెలియజేయాల్సింది. దీంతోపాటు, ఒక్క తెలంగాణనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఏర్పడాల్సిన కొత్త రాష్ట్ర ఆవశ్యకతను నొక్కిచెప్పే విధంగా చర్చలు జరగాల్సింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడడమే రాజ్యాంగ విరుద్ధమని దాదాపు ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికి వుండడం వాటి సంకుచిత స్వభావానికి నిదర్శనం. యుపిలో మరో నాలుగు రాష్ట్రాలుగా విడిపోతే, మాయావతికి ఎక్కడ పేరు వస్తుందోనని, తిరిగి బిఎస్‌పి బలోపేతం అవుతుందని సమాజ్‌వాది పార్టీ, గూర్ఖాలాండ్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందోనని మమతాజీ దాగుడుమూతలు, విదర్భ ఇవ్వడం ఇష్టంలేని శివసేన, ఆ రాష్ట్ర కాంగ్రెస్, గుజ్జర్ల సమస్య ఎక్కడ విభజనకు దారితీస్తుందోనని రాజస్థాన్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించడమే గాని, చిన్న రాష్ట్రాల, కొత్త రాష్ట్రాల ఆవశ్యకతను ఏ పార్టీ సమర్ధిస్తున్నట్లు గాని, నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నట్లుగాని తమతమ మానిఫెస్టోలో రాసుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితి. ఎక్కడ వీటి ప్రస్తావన వుంటే, ఆ ప్రాంత, కొన్ని వర్గాల ఓట్లు రాలవేమోననే స్వార్థ రాజకీయాలు తప్ప, ఓ ప్రాంత అవసరాలను పట్టించుకున్న పాపాన పోలేదు.
అన్ని ప్రాంతాల ప్రజలను ఏకరీతిన పాలించి, స్థానిక వనరులను, ఉద్యోగాలను, ఉపాధి అవకాశాల్ని స్థానికులే అనుభవించేలా చేసినట్లైతే, ప్రాంతీయ వైషమ్యాలు పొడసూపవు. కాని, ఓ ప్రాంతం మరో ప్రాం తంపై, ఓ రాజకీయ దాష్టీకం మరో ప్రాంత రాజకీయాలపై దాడి చేస్తుంటే, ఇరు ప్రాం తాల ప్రజల్లో నోట్లో మట్టి కొడితే, ఏదో ఓ ప్రాంతంలో, ముఖ్యం గా అన్యాయానికి గురైన ప్రాంతంలో అలజడి రేగుతుంది. ఈ పాపాల్ని దోపిడి చేస్తున్న ప్రాంత అమాయక ప్రజలు కూడా మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఈ ఆరు దశాబ్దాల్లో సాధారణ ప్రజలకు ఇరు ప్రాంతాల్లో ఇబ్బందులే మిగలగా, బాగుపడింది మాత్రం ఇరుప్రాంతాల రాజకీయ నాయకులు, వీరి తాబేదార్లే!
ఈ అసమానత, అభివృద్ధి నిరోధక కారణాలను, రాజకీయాలను అసెంబ్లీలో, పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చకు అవకాశం కలిగిస్తే వాస్తవాలు బహిర్గతమై, చిన్న రాష్ట్రాల ఆవశ్యకత అవసరమా, అనవసరమా అనేది తేలేది. ఇలాంటి వాతావరణానికి అవకాశం లేకుండా చేసి, వేర్పాటువాదమంటేనే దేశ సమగ్రతకు భంగకరమనే కుహనా ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకురావడం సమస్యల్ని పరిష్కరించే దానికన్నా జఠిలం చేయడం మాత్రమే. అసెంబ్లీకి (42) రోజుల చర్చకు అవకాశం ఇచ్చినా, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించకుండా, అడ్డుకొని, మరింత సమయం కావాలని కోరి, చివరికి మూజువాణి అనే అప్రజాస్వామిక విధానంతో డ్రాఫ్టు బిల్లునే తిరస్కరించడం, ఇదే శుక్రాచార్య నీతిని పార్లమెంటు ఉభయ సభలు వాడుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే! చట్టసభలు ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే, విజ్ఞతతో ప్రవర్తించలేని పరిస్థితి భాజపాది. అసలు ప్రజాస్వామిక వాతావరణం ఎక్కడుందో కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు చెప్పాలి.
ప్రజాస్వామ్య యుతంగా చర్చ జరిగి వుంటే దేశంలోని మిగతా రాష్ట్రాల వాదనలు, ప్రతివాదనలు కూడా చర్చకు వచ్చి, తెలంగాణ ఏర్పాటుకు ఓ ఆరోగ్యకర ముగింపుతో పాటుగా, ఆంక్షలు లేని తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమయ్యేది. ఇలా అప్రజాస్వామ్యవాదులకు జడిసి, ఓట్ల రాజకీయాల వేటలో పది సంవత్సరాలు రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చి, యువకుల ఉసురు తీసుకొని, మిగతా రాష్ట్రాల ఆవశ్యకతపై చర్చకు అవకాశం లేకుండా చేసిన పార్లమెంటరీ రాజకీయాలు ఏ ప్రాంత ప్రజలకు దోహదకారిలా లేవు. చర్చలు జరిగితే, తమతమ వాదనలు ఎక్కడ వీగిపోతాయోనని, తమ దోపిడికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందోననే అంతర్లీన ఎజెండానే పార్లమెంటరీ విధానాలకు పెద్ద అడ్డంకి. ఈ పద్ధతితో ఏర్పడే ఏ రాష్ట్రం సంతోషంతో కొనసాగలేక మరికొన్ని సమస్యలకు గురికావాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణకు సంక్రమించబోతున్నది ఇదే! వీటిని ఉదాహరణగా చూపి, కొత్త రాష్ట్రాల ఏర్పాటువాదం తప్పు అనే సంకేతాన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడబలుక్కునే కేంద్రంగానే పార్లమెంటులు మిగిలిపోయాయి.

ఎట్టకేలకు 29వ రాష్ట్రంగాతెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది.
english title: 
v
author: 
- జి.లచ్చయ్య (సెల్ : 94401 16162)

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>