ఏలూరు, ఫిబ్రవరి 24: కట్టుబాట్ల పేరుతో బలవంతపు ప్రశాంతత కన్పించే లంకగ్రామాల్లో చిచ్చు రగులుతూనే ఉంది. ఇంతకుముందు చెట్టున్నపాడు ఉదంతం తెల్సిందే. అంతకుముందునుంచి సెగలు ప్రారంభమైన ప్రత్తికోళ్లలంక గ్రామం వ్యవహారం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఆరని మంటలు తరహాలో ఇక్కడ రెండువర్గాల మధ్య దూరం పెరుగుతూనే ఉండగా ఇవి ఒకదశలో ఒకరిపైఒకరు ఆరోపణలు దిగటంతో ఎటుదారితీస్తాయోనన్న ఆందోళనను కూడా కలిగిస్తున్నాయి. తాజా పరిణామాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, మరికొందరు ఇంతకుముందే గ్రామానికి దూరంగా ఉండగా సోమవారం తెల్లవారుఝామున నేరుగా గ్రామానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి పోలీసు బలగాలు కూడా భారీఎత్తున గ్రామానికి చేరుకున్నాయి. ఏలూరు డిఎస్పీ సత్తిబాబు, రూరల్ సిఐ, పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మరోవైపు తాము డిమాండ్ చేసిన విధంగా ఉపసర్పంచ్ వివరణ ఇవ్వకుండానే గ్రామంలోకి రావటంతో మిగిలిన గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం వారంతా బయలుదేరి ఏలూరు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈసందర్భంగానే గ్రామానికి చెందిన నిధుల విషయంలో భారీగోల్‌మాల్ జరిగిందని, దీని లెక్కలు తేల్చాలని తాము డిమాండ్ చేస్తున్నా దాన్ని పట్టించుకోకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు పోలీసుల సహకారంతో గ్రామం చేరుకున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్దితి వల్ల అటు గ్రామంలో, ఇటు ఏలూరులో కూడా కొంత ఉద్రిక్తత పరిస్ధితికి దారితీసింది. మరోవైపు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న గ్రామస్తులకు మద్దతుగా నిలిచారు. అటు పోలీసుఅధికారులతో చర్చలు జరుపుతూనే గ్రామస్తులను శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. అయితే తాము కలెక్టరును కలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరినతర్వాతే ఇక్కడనుంచి వెళతామని వారంతా భీష్మించారు. ఆవిధంగా వారు రాత్రి పొద్దుపోయేవరకు కూడా కలెక్టరేట్ వద్దే ఆందోళనలో ఉండిపోయారు. రాత్రి సమయంలో కూడా ఎమ్మెల్యే చింతమనేని లంకవాసుల పరిస్దితిని కలెక్టరు సిద్ధార్ద్‌జైన్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో కలెక్టరు మాట్లాడుతూ ఈ సమస్య వివరాలు ఎమ్మెల్యే ద్వారా తెలుసుకున్నానని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ పరిస్ధితులు ఇలాఉండగా లంక గ్రామాల్లో నెలకొన్న ఇటువంటి వ్యవహారాలపైనే సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇంతకుముందు వరకు కట్టుబాట్ల పేరుతో ఆందోళనలు, ఆరోపణలు పైకి విన్పించకపోయినా తాజా పరిస్దితుల్లో గ్రామస్తులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ రోడ్డున పడుతున్న సందర్భాల్లో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన అధికారవర్గంలోనూ నెలకొంది. వాస్తవానికి చెట్టున్నపాడులో జరిగిన హత్యోదంతం ముందు ఇటువంటి పరిణామాలే చోటుచేసుకోవటం, గ్రామస్తులు వర్గాలుగా విడిపోవటంతోపాటు ఒకరిపైఒకరు ఆరోపణల స్దాయి పెంచుకుని దాదాపు కక్షల స్ధితికి చేరిపోవటమే ఆ ఘటనకు కారణమని పోలీసు అధికారులు చెపుతూనే ఉన్నారు. అయితే అంతకుముందే ప్రత్తికోళ్లలంకలో ఈ చిచ్చు రగిలినప్పటికీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ప్రత్యేక పరిష్కార చర్యలు లేకపోవటమే గమనార్హం. ఈ పరిస్దితుల్లో ఇరువర్గాలు అభద్రతాభావంలోనే గ్రామంలో కొనసాగుతూ వస్తున్నాయి. ఏ నిముషంలో ఏం జరుగుతుందోనన్న ఉద్వేగం కూడా అందరిలోనూ కన్పిస్తోంది.
సాధారణ ఎన్నికలకు సిద్ధంకండి: ఎస్పీ
విజయనగరం (కంటోనె్మంట్), ఫిబ్రవరి 24: వచ్చే సాధారణ ఎన్నికలను ధృష్టిలో ఉంచుకుని పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలతో సత్ససంబంధాలను ఏర్పరుచుకుని, వారి సహకారంతోనే శాంతిభద్రతలను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ అధికారులకు సూచించారు. ఎస్పీ తన కార్యాలయంలో సోమవారం విజయనగరం పోలీస్ డివిజన్ అధికారులతో మాసాంతపు నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ డివిజన్ పరిధిలో నమోదు కాబడిన కేసులు, వాటి దర్యాప్తు స్థాయి తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నేపధ్యంలో పోలీస్ అధికారులు తమ పరిధిలోగల ప్రాంతాలపై పూర్తి స్థాయి వివరాలను సేకరించి, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతలపై స్థానికులతో చర్చించాలని సూచించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఢివిజన్ పరిధిలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదలు తదితర నేర నియంత్రణలపై ప్రత్యేక ధృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విజయనగరం డిఎస్పీ శ్రీనివాసరావు, డివిజన్ పరిధిలో సిఐలు, ఎస్సైలు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.