భీమవరం, ఫిబ్రవరి 23: రాష్ట్ర విభజన అంకం ముగిసింది. ఎన్నికల సన్నద్ధత మొదలైంది. ఇప్పటివరకు ఆందోళన కార్యక్రమాలు.. విభజన ప్రక్రియ అడ్డుకోవడానికి దేశ రాజధానిలో మంత్రాంగం.. ఈ వ్యవహారాలతో నిమగ్నమైన నేతలు ప్రస్తుతం జిల్లాకు మకాం మార్చారు. ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి ? ప్రత్యర్ధి పార్టీల బలహీనతలు ఏమిటి ? అసమ్మతి ఉంటే ఎలా సరిదిద్దుకోవాలి ? ఇలాంటి అంశాలపై విచారణ ప్రారంభించారు. దీనిపై నియోజకవర్గాల్లో ముఖ్య నేతలతో మంతనాలు మొదలుపెట్టారు. మొత్తం ఇప్పటివరకు నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు, టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు నియోజకవర్గాలపై దృష్టిసారించారు. అన్ని పార్టీలు రానున్న ఎన్నికలను కీలకంగా భావిస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేయకముందే నియోజకవర్గాల్లో సమీకరణలు మొదలయ్యాయి. టిడిపిలో ఇప్పటికే కొందరికి టిక్కెట్టు కేటాయింపుపై అధినేత నుంచి భరోసా లభించినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు దాదాపుగా అభ్యర్థులు ఖరారు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండు, మూడుచోట్ల అక్కడి పార్టీ బాధ్యులనే అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో దాదాపు సగం నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ తరఫున ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధినేత కూడా ఇతర అంశాలను పక్కన పెట్టి నియోజకవర్గాలపై దృష్టిసారించాలని వారికి సూచించినట్టు తెలిసింది. త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నట్టు అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో పార్టీలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం రగులుకుంది. కొందరు నాయకులు ఒకవైపు టిక్కెట్టు దక్కించుకునే విషయమై దృష్టి పెడుతూ.. మరోవైపు నియోజకవర్గంపై పట్టు నిలుపుకునే యత్నాలు మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ పూర్తి సమయాన్ని నియోజకవర్గానికే కేటాయిస్తున్నారు. ప్రతి మండలంలోని ముఖ్య నాయకులను గుర్తించి వారిని పిలిపించుకునే ప్రయత్నాలు సంప్రదింపులు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. వైసిపి నేతలు సైతం నియోజకవర్గాలను వదలిపెట్టడం లేదు. వైసిపికి చెందిన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. రానున్న ఎన్నికల్లో మళ్ళీ వారికే టిక్కెట్టు దక్కుతుందన్న ఆశతో ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాన్ని రచిస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కొందరికి బహిరంగంగా.. మరికొందరికి అంతర్గతంగా టిక్కెట్టు వ్యవహారంపై హామీలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆయా నాయకులు నియోజకవర్గాల్లో తమ బలాన్ని కూడదీసుకునే యత్నాల్లో ఉన్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ తొలిసారి అభ్యర్థులను బరిలో దింపనుంది. దీంతో ఎవరికి అవకాశం వస్తుంది ? టిక్కెట్టు ఆశిస్తూ పార్టీలోకి వచ్చిన వారి పరిస్థితి ఏమిటి ? పార్టీ ప్రకటించిన అభ్యర్థికి మద్దతు ఉంటారా ? అనే సందేహాలు ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో టిక్కెట్టు ఆశిస్తున్న వారంతా నియోజకవర్గంలోని వర్గాలను బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎంతో హడావిడిగా కదనరంగంలో దిగిన కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. పార్టీ తరఫున ఎవరు బరిలో దిగుతారు ? అసలు పార్టీలో ఉండేది ఎవరు ? ఇలాంటి సందిగ్ధంలో అంతా సతమతమవుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు సైతం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కీలకంగా వ్యవహరించి సీమాంధ్రకు అన్యాయం చేసిందని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. దీంతో ఆ పార్టీ తరపున బరిలో దిగేది ఎవరనేది ఇప్పట్లో స్పష్టత వచ్చేలా కనపడటం లేదు. టిడిపి, వైసిపిలతో పోలిస్తే కాంగ్రెస్ ఎన్నికల సన్నద్ధతపై అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో ఉండటం గమనార్హం.
* ప్రధాన పార్టీ నేతల తీరు* నియోజకవర్గాల్లోనే మంత్రాంగం* ఎన్నికల వ్యూహాలకు శ్రీకారం
english title:
a
Date:
Tuesday, February 25, 2014