చింతలపూడి, ఫిబ్రవరి 24 : చింతలపూడిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌పై సోమవారం ఎసిబి అధికారులు దాడులు జరిపి రికార్డులు సీజ్ చేశారు. ఎసిబి డిఎస్‌పి ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో పలు అవకతవకలు గుర్తించి ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన రికార్డులను సీజ్ చేసి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఎసిబి డి ఎస్‌పి వెంకటేశ్వర్లు విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో అధికంగా విద్యార్ధులు గల హాస్టళ్లను తనిఖీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, దీనిలో భాగంగా చింతలపూడిలోని ఈ హాస్టల్‌ను తనిఖీ చేశామని చెప్పారు. అయితే ఆదివారం రాత్రి 365 మంది విద్యార్ధినులు ఈ హాస్టల్‌లో వున్నట్లు హాజరుపట్టీలో చూపారని, సోమవారం ఉదయం 360 మందే వున్నట్లు చూపారని, మిగిలిన అయిదుగురు విద్యార్ధినులు తెల్లవారే సరికి ఏమయ్యారని అనుమానం వచ్చిందన్నారు. దీనితో మొత్తం హాస్టల్‌లోని విద్యార్ధులను లెక్కించగా 298 మంది మాత్రమే వున్నట్లు గుర్తించామని, విద్యార్ధినులు లేకపోయినా 67 మంది అధికంగా వున్నట్లు చూపించడంతో ఈ హాస్టల్ విద్యార్ధినులు చదివే పాఠశాలల హాజరుపట్టీలను తెప్పించి తనిఖీ చేస్తే పాఠశాలలకు హాజరుకాని వారు కూడా హాస్టల్‌లో వున్నట్లు రికార్డులు తయారు చేసినట్లుగా రూఢీ అయ్యిందన్నారు. 8, 9, 10 తరగతుల విద్యార్ధినీ విద్యార్ధులకు రోజుకు 27 రూపాయలు, 3 నుంచి 7వ తరగతి వరకు చదివే విద్యార్ధులకు రోజుకు 24 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తోందని ఆయన చెప్పారు. ఎక్కువ మంది విద్యార్ధినులు వున్నట్లు చూపించి అధికంగా డ్రా చేస్తున్నట్లు తెలియడంతో హాస్టల్‌లో వున్న బియ్యం, సరుకులు, నిల్వలను కూడా తనిఖీ చేశామని, బియ్యంతో సహా అన్ని సరుకుల నిల్వలు ఉండవలసిన దానికంటే అధికంగా వున్నట్లు గుర్తించామని డి ఎస్‌పి తెలిపారు. దీంతో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన హాస్టల్ రికార్డులను సీజ్ చేసి తీసుకువెళుతున్నామని ఎంత అవకతవకలు జరిగాయో రికార్డులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికను పంపిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక సహాయ సాంఘిక సంక్షేమాధికారి జివి సత్యనారాయణ, హాస్టల్ వార్డెన్ జి మంగారత్నంలను సుధీర్ఘంగా విచారించారు. ఈ తనిఖీల్లో ఎసిబి సి ఐలు విజె విల్సన్, పి కొమరయ్య, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చింతలపూడిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌పై సోమవారం ఎసిబి అధికారులు దాడులు జరిపి
english title:
s
Date:
Tuesday, February 25, 2014