ఏలూరు, మార్చి 3 : చంద్రబాబునాయుడు పరిపాలన రాష్ట్రానికి భయానక రోజులని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు విశ్వసనీయత, విలువలు లేనేలేవని, ఆయన పాత తరం మనిషని, తాను నవతరం ప్రతినిధినని జగన్ చెప్పుకున్నారు. సీమాంధ్ర ప్రాంతాన్ని సింగపూర్‌కన్నా ఉన్నతంగా ఒక షాంఘైలా, ఒక వాషింగ్టన్‌లా, ఒక దుబాయ్‌లా మార్చే శక్తి తమకే ఉందన్నారు. ఏలూరులో సోమవారం జనభేరి కార్యక్రమంలో ఆద్యంతం చంద్రబాబు పాలనను గుర్తు చేస్తూ నిప్పులు చెరిగారు. చంద్రబాబువి అసత్యాలు, మోసాలు, తప్పుడు మాటలు, విశ్వసనీయత లేని దిగజారుడు రాజకీయాలని, విభజన పేరుతో ప్రజలను అమ్మేశారని, విరుచుకుపడ్డారు. తాను ముఖ్యమంత్రినైతే రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే విధంగా అమ్మ ఒడి పథకం, పెన్షన్లు 700 రూపాయలకు పెంచడం, రైతులకు గిట్టుబాటు ధర స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ అనే నాలుగు ఫైళ్లపై తాను సంతకాలు చేస్తానన్నారు. విశ్వసనీయత అంటే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి నేర్చుకోవాలన్నారు.బాబు పాలనను గుర్తు చేసుకుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. వైఎస్‌ఆర్ అనంతరం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేశారని ఓట్లు, సీట్ల కోసం ప్రజలను అమ్మేసేందుకు కూడా సిద్ధపడ్డారన్నారు. విభజన అన్యాయమంటూనే చంద్రబాబు తన ఎంపిలతో ఆ బిల్లుపై మొదటి ఓటు వేయించారని చెప్పారు. ఆ ప్రాంతంలో విజయోత్సవాలు చేసుకోవాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సిగ్గులేకుండా ఈ ప్రాంతాన్ని సింగపూర్ చేస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం బిజెపి, రాష్ట్రంలో ప్రతిపక్షం టిడిపి కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మన ప్రాంతంలో మనమే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని, 30 ఎంపి స్థానాలను గెలుచుకుని, మనపైనే ప్రధానమంత్రి మనుగడ వుండేలా చేస్తామన్నారు. నిధులను కూడా అలాగే రాబడతామన్నారు. చంద్రబాబు పాతతరం మనిషని, తాను నవతరం ప్రతినిధినని, చంద్రబాబుకన్నా మెరుగ్గా పరిపాలించగలనని చెప్పారు. తెల్లం బాలరాజు, చేగొండి హరిరామజోగయ్య, పిల్లి సుభాష్‌చంద్రబోస్, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, తోట చంద్రశేఖర్, ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌కుమార్, మేకా శేషుబాబు, గ్రంధి శ్రీనివాస్, జ్యేష్ఠ రమేష్ పాల్గొన్నారు.
జనభేరిలో జగన్
english title:
n
Date:
Tuesday, March 4, 2014