విశాఖపట్నం, మార్చి 3: తన పట్ల దురుసుగా ప్రవర్తించి, సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రికార్డులు చూపడానికి నిరాకరించారంటూ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి (డిఆర్‌ఓ) వెంకటేశ్వరరావుపై విశాఖ రెండవ నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి స.హ చట్టం కార్యకర్తలు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాంతియా కుమారి సోమవారం విశాఖ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఆమెకు ప్రభుత్వ వాహనాన్ని ఇవ్వడంలో డిఆర్‌ఓ విఫలమయ్యారు. దీంతో ఆమె ఆటోలోనే జిల్లాపరిషత్, జివిఎంసి కార్యాలయాలకు తిరిగారు. చివరకు కలెక్టరేట్‌లోని రికార్డుల పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడ డిఆర్‌ఓ సహకరించలేదు. కనీసం కూర్చోమని కూడా చెప్పలేదని కార్యకర్తలు పేర్కొన్నారు. ఎప్పుడుపడితే అప్పుడు రికార్డులు చూపడం సాధ్యం కాదని, ఎవరు పడితే వారు వచ్చి రికార్డులు అడిగితే చూపేది లేదని డిఆర్‌ఓ చెప్పినట్టు కార్యకర్తలు వివరించారు. ఈ నేపథ్యంలో తాంతియాకుమారి, డిఆర్‌ఓల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని వారు చెప్పారు. కలెక్టరేట్‌లో జరిగిన సంఘటనపై తాంతియాకుమారి, స.హ. చట్టం కార్యకర్తలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో డిఆర్‌ఓపై ఫిర్యాదు చేశారు. అలాగే డిఆర్‌ఓకు, మరొక అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులకు తాంతియాకుమారి సూచించారని తెలిసింది. పోలీసులు ఈ ఫిర్యాదు తీసుకుని, రశీదు కూడా ఇచ్చారు.
‘రికార్డులు చూపించాను’
దీనిపై డిఆర్‌ఓ వెంకటేశ్వరరావును వివరణ కోరగా, స.హ కమిషనర్‌కు అడిగిన రికార్డులు చూపించామని తెలియచేశారు.
* డిఆర్‌ఓపై పోలీసులకు తాంతియా కుమారి ఫిర్యాదు * దురుసుగా ప్రవర్తించి, రికార్డులు చూపలేదంటూ ఆరోపణ
english title:
s
Date:
Tuesday, March 4, 2014