కాకినాడ, మార్చి 3: కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే మత మార్పిడుల చట్టాన్ని రద్దు చేస్తామని ఆ పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో సోమవారం ‘మోడీ ఫర్ పిఎం’ అనే కార్యక్రమాన్ని వెంకయ్య ప్రారంభించారు. బిజెపి అధికారంలోకి వస్తే దేశంలో నదులను అనుసంధానిస్తామన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దుచేస్తామని, తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపి, టెర్రరిజాన్ని అణచివేస్తామని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ఎన్నికల తర్వాత కూలే టెంటుగా మారనుందని ఎద్దేవా చేశారు. దేశంలో బిజెపి సంకీర్ణ కూటమికి 272 సీట్లు రావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వ హయాంలో దేశం దివాళా తీసిందని, పెట్టుబడులు పెట్టేందుకు ఏ ఒక్క విదేశీ కంపెనీ ముందుకు రావడం లేదని వెంకయ్య ఆరోపించారు. చైనా, పాక్, తదితర పొరుగు దేశాలు దండెత్తుతున్నా ఎదుర్కొనే స్థితిలో కేంద్ర ప్రభుత్వం లేదన్నారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థి అగ్రనేత నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏ విధమైన మత కలహాలకు తావులేకుండా, సుస్థిరమైన పాలన అందిస్తూ గ్రామాల్లో సైతం 24 గంటలూ విద్యుత్ అందిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 24 గంటలూ కరెంట్ సరఫరా కావడం లేదని ఆయన విమర్శించారు. విభజన పూర్తయిన నేపథ్యంలో దాని గురించి ఇక మరిచిపోయి, సీమాంధ్ర అభివృద్ధికి పాటుపడాలని ఆయన సలహా ఇచ్చారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీమాంధ్రకు ప్రకటించిన ప్యాకేజీని కచ్చితంగా అమలుచేసి గుజరాత్ తరహాలో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రధాని, లోక్‌సభ స్పీకర్, పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ముగ్గురూ కలసి ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి చీకట్లో టి-బిల్లును ఆమోదించారని, అలా జరగడం సమంజసం కాదన్నారు. రాజ్యసభలో పోలవరాన్ని పూర్తి చేయాలని, సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న షరతులు విధించామని, వీటిపై ప్రధాని నుండి హామీ లభించిందన్నారు. కేంద్రమంత్రి జైరాంరమేష్ ఇచ్చిన హామీల చిట్టా తనవద్ద ఉన్నదని, దాన్ని త్వరలోనే ప్రజలకు తెలియజేస్తానన్నారు. జిఒఎంలో తెలుగువారు లేరని, ఈ విధంగా చేయడం తెలుగువారిని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఇక కాలం చెల్లిందని, ప్రస్తుతం ఉన్నది నకిలీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్ పిల్లలు (వైసిపి) కూడా ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తోందని అన్నారు.వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణకు బిజెపి అనుకూలంగా ఉన్నదని, అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ జరిపి ఉభయులకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపుతామన్నారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
బిజెపి నేత వెంకయ్యనాయుడు భరోసా
english title:
n
Date:
Tuesday, March 4, 2014